తెవికీ-మైకు

వారం వారం తెవికీ వ్యాసాలు.

Sunday, November 22, 2009

ఘంటసాల వెంకటేశ్వరరావు: ఈ వారం తెవికీ వ్యాసం

ఘంటసాల వెంకటేశ్వరరావు (1922, డిసెంబర్ 4 - 1974) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. ఘంటసాల జన్మతః వచ్చిన గంభీరమైన స్వరముతో, మరియు పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో ఈయన తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు.

ఘంటసాల గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామములో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించాడు. సూర్యనారాయణగారు మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. ఘంటసాల భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి ఆయనను 'బాల భరతుడు ' అని పిలిచేవారు.

... పూర్తి వ్యాసం

Thursday, November 19, 2009

ఈ వారం తెవికీ వ్యాసం: హెపటైటిస్‌-బి

హెపటైటిస్‌-బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెపటైటిస్‌-బి వైరస్ ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్ హెపడ్నావైరస్ (Hepadnaviridae) కుటుంబానికి చెందిన వందల రకాల వైరస్‌లలో ఒక రకం. దీనికి సీరం హెపటైటిస్ అని ఇంకో పేరుంది. ఈ వ్యాధి ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో చాలా చోట్ల ప్రబలంగా ఉంది. ఒంట్లో హెపటైటిస్‌-బి వైరస్‌ ఉన్నవాళ్లు మన దేశంలో, మన ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 3-5% వరకూ ఉన్నట్టు అంచనాలు చెబుతున్నాయి. కాలేయానికి వాపు రావటం, వాంతులు, పచ్చ కామెర్లు ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ముదిరితే కాలేయం గట్టిబడిపోయి (liver cirrhosis) లివర్ కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది


హెపటైటిస్‌-బి వైరస్‌ శరీరంలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్దిరోజుల్లో కామెర్లు వస్తాయి. ఇలా కామెర్లు వచ్చి, హెపటైటిస్‌-బి 'పాజిటివ్‌' ఉన్న వారిలో నూటికి 99.5 మందికి ప్రాణాపాయం ఉండదు. ఈ దశలో మనం వీరికి మంచి ఆహారం, పూర్తి విశ్రాంతి ఇస్తే చాలు. ముఖ్యంగా లివర్‌ను దెబ్బతీసే మందులు వాడకూడదు. పసర్లు తాగించటం, చేతులు కాల్పించటం వంటివేమీ చెయ్యకూడదు. అంటే హెపటైటిస్‌-బి ఎంతోమందికి సోకినా కేవలం కొద్దిమందికి మాత్రమే అది ఒంట్లో నిల్వ ఉండిపోతుంది. ఇది దీర్ఘకాలిక సమస్యకు ఆరంభం! ఒకసారి హెపటైటిస్‌-బి ఉన్నట్టు తేలిందంటే వారి నుంచి అది ఇతరులకు సంక్రమించకుండా ఇంట్లోని వారంతా టీకాలు వేయించుకోవటం వంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. జీవిత భాగస్వాములకు ఈ జాగ్రత్తలు మరీ ముఖ్యం!

... పూర్తి వ్యాసం

Sunday, November 8, 2009

బోనాలు: ఈ వారం తెవికీ వ్యాసం

బోనాలు మహాకాళిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు మరియు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు)తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు.

బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము; మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా ఉంది. అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు.

... పూర్తి వ్యాసం

Monday, November 2, 2009

భారత దేశము: ఈ వారం తెవికీ వ్యాసం

భారత గణతంత్ర రాజ్యము నూటపది కోట్లకు పైగా జనాభా తో ప్రపంచం లో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. వైశాల్యము లో ప్రపంచం లో ఏడవది. భారత దేశ ప్రాముఖ్యత గత రెండు దశాబ్దాలలో గణనీయంగా పెరిగింది. భారత ఆర్ధిక వ్యవస్థ యొక్క స్థూల జాతీయోత్పత్తి( పర్చేసింగ్ పవర్ పారిటీ) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో ఇది ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము ఐన భారతదేశం, ప్రపంచం లోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగన దేశంగా ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తి] ఆవిర్భవించినది.

దక్షణాసియా లో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండము లో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారుల పైన ఉన్నది. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు ఆఫ్ఘానిస్తాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు మరియు ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. భారతదేశము కొన్ని పురాతన నాగరికతలకు పుట్టిల్లు మరియు నాలుగు ముఖ్య ప్రపంచ మతాలకు (హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము మరియు సిక్కు మతము) జన్మనిచ్చినది.

... పూర్తి వ్యాసం

Sunday, October 25, 2009

జమ్మూ & కాశ్మీరు: ఈ వారం తెవికీ వ్యాసం

జమ్మూ & కాశ్మీరు రాష్ట్రం భారతదేశంలో ఉత్తరపుకొనన, హిమాలయ పర్వతసానువుల్లో ఒదిగిఉన్న రాష్ట్రం. జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో మూడు విభాగాలున్నాయి - జమ్ము ప్రాంతం ప్రధానంగా హిందువులు ఉన్న ప్రాంతం. జమ్ము నగరం మందిరాల నగరంగా ప్రసిద్ధం; కాశ్మీరు లోయ కనులకింపైన పర్వతశ్రేణులతోనూ, సెలయేర్లతోనూ, సరస్సులతోనూ భూతల స్వర్గంగా పేరు పొందింది. ఇక్కడి శ్రీనగర్ ముఖ్య నగరం, వేసవికాలపు రాజధాని. కాశ్మీరులో ముస్లిం మతస్తులు అధిక శాతంలో ఉన్నారు; లడఖ్ హిమాలయశిఖరాల మధ్య ఉన్న పీఠభూమి . బౌద్ధ మతస్తులు ఎక్కువగా ఉన్నందున దీనిని "చిన్న టిబెట్" అంటారు.లే" ఇక్కడి ప్రధాన పట్టణం. - కాని జమ్ము-కాశ్మీరు మూడు ప్రాంతాలలోనూ హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ మతస్తులు విస్తరించి ఉన్నారు.

భారత్, పాకిస్తాన్, చైనా దేశాలమధ్య కాశ్మీరువివాదం చాలా తీవ్రమైనది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మూడు యుద్ధాలకు (1947, 1965, 1999(కార్గిల్)కాశ్మీరు వివాదమే కారణం. జమ్ము-కాశ్మీరు సంపూర్ణ రాష్ట్రం భారతదేశపు అంతర్గత భూభాగమని భారతదేశం వాదన. కాని మొత్తం రాష్ట్రంలో సగభాగం మాత్రమే ఇప్పుడు భారతదేశం ఆధీనంలో ఉన్నది. కాశ్మీరు లోయలో కొంత భాగం పాకిస్తాన్ అధీనంలో ఉన్నది. ఆక్సాయ్‌చిన్ ప్రాంతం చైనా అధీనంలో ఉన్నది. భారతదేశం అధీనంలో ఉన్న కాశ్మీరు భాగాన్ని "భారతదేశం ఆక్రమించిన కాశ్మీరు" అనీ, పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాశ్మీరు భాగాన్ని "స్వతంత్ర కాశ్మీరు" అనీ పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. ఇక పాకిస్తాన్ అధీనంలోని కాశ్మీరు భాగాన్ని "పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీరు" అని భారతదేశం వ్యవహరిస్తుంది.

... పూర్తి వ్యాసం

Monday, October 19, 2009

తిరుపతి వేంకట కవులు: ఈ వారం తెవికీ వ్యాసం

దివాకర్ల తిరుపతి శాస్త్రి (1872-1919) మరియు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు. వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంధాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి. బావా ఎప్పుడు వచ్చితీవు.., చెల్లియో చెల్లకో.., జెండాపై కపిరాజు.. వంటి పద్యాల ఆరంభ పదాలు తెలియని తెలుగువారు అరుదు.


దివాకర్ల తిరుపతి శాస్త్రి పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం వద్ద యండగండి గ్రామంలో జన్మించాడు. చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామంలో జన్మించాడు. వేంకట శాస్త్రి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వద్ద విద్యాభ్యాసం చేస్తున్నపుడు తిరుపతి శాస్త్రితో పరిచయం ఏర్పడింది. మొదటినుండీ తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేది. ఇక వేంకట శాస్త్రి పురాణ సాహిత్యాలపై ఉపన్యాసాలివ్వడంలోనూ, మెరుపులా పద్యాలల్లడంలోనూ దిట్ట. ఒకసారి వినాయక చవితి ఉత్సవాలకు చందాలు వసూలు చేయడంలో ఇద్దరూ తమ తమ ప్రతిభలను సమన్వయంగా ప్రదర్శించారు. ఒకరి ప్రతిభపై మరొకరికి ఉన్న గౌరవం వారి స్నేహాన్ని బలపరచింది. వేంకట శాస్త్రి వారాణసి వెళ్ళి తిరిగి వచ్చినాక కాకినాడ లో జంటగా శతావధానం ప్రదర్శించారు. ఆ తరువాత జీవితాంతం ఆ సాహితీ మూర్తులు ఒకరికొకరు తోడున్నారు. తిరుపతి శాస్త్రి సదా వేంకటశాస్త్రిని తన గురువుగా భావించాడు. తిరుపతి శాస్త్రి మరణానంతరం కూడా వేంకట శాస్త్రి తన రచనలను జంట రచనలుగానే ప్రచురించాడు. ఇద్దరూ కలిసి అసంఖ్యాకంగా అవధానాలు నిర్వహించారు. సన్మానాలు అందుకొన్నారు. 'ధాతు రత్నాకరం' రచించారు. అడయారు వెళ్ళినపుడు అనీబిసెంట్ ప్రశంసలు అందుకొన్నారు. వెంకటగిరి, గద్వాల, ఆత్మకూరు, విజయనగరం, పిఠాపురం సంస్థానాలు సందర్శించి తమ ప్రతిభను ప్రదర్శించి సత్కారాలు గ్రహించారు.

... పూర్తి వ్యాసం

Sunday, October 11, 2009

ఈనాడు: ఈ వారం తెవికీ వ్యాసం

ఈనాడు ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. తెలుగు పత్రికలలోనే కాక యావద్దేశంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన పత్రికలలో ఒకటిగా నిలిచింది. ప్రజల జీవితాలతో మమేకమై, సమకాలీన చరిత్రలో విడదీయరాని భాగమైపోయింది. ఈనాడు తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దిన పత్రిక. NRS 2006 సర్వే ప్రకారం 1,38,05,000 మంది పాఠకులను కలిగి, దేశంలోనే తృతీయ స్థానంలో నిలచినది.

1974 ఆగష్టు 10న రామోజీరావు విశాఖపట్నం శివార్లలోని, సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడును ప్రారంభించాడు. అదే సంవత్సరం ఆగష్టు 28 తేదీన ఈ పత్రిక రిజిస్టర్ చేయబడినది. 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది. ప్రారంభంలోనే ఈనాడుకు కొన్ని ప్రత్యేకతలుండేవి. అప్పట్లో ఉన్న అన్ని పత్రికల పేర్లు ఎక్కువగా ఆంధ్ర శబ్దంతో మొదలయేవి. పైగా ఆ పేర్లు కాస్త సంస్కృత భాష ప్రభావంతో ఉండేవి. ఈనాడు అనే అసలు సిసలైన తెలుగు పేరుతో మొదలైన ఈ పత్రిక అప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేని కొత్త అనుభవాలను అందించింది. ఆ రోజుల్లో పత్రికలు ప్రచురితమయ్యే పట్టణాలు, ఆ చుట్టుపక్కలా తప్పించి మిగిలిన రాష్ట్రం మొత్తమ్మీద పత్రికలు వచ్చేసరికి బాగా ఆలస్యం అయ్యేది; కొన్నిచోట్ల మధ్యాహ్నం అయ్యేది. అలాంటిది తెల్లవారే సరికి గుమ్మంలో దినపత్రిక అందించడమనే కొత్త సాంప్రదాయానికి ఈనాడు శ్రీకారం చుట్టింది. ఈనాడు సాధించిన విజయాలకు స్థానిక వార్తలకు అది ఇస్తూ వస్తున్న ప్రాధాన్యత ఒక కారణం.

ప్రముఖ పాత్రికేయుడైన ఎ.బి.కె. ప్రసాద్ ఈనాడుకు ప్రారంభ సంపాదకుడు. 1975 డిసెంబర్ 17హైదరాబాదు లో రెండవ ప్రచురణ కేంద్రం మొదలైంది. అలా విస్తరిస్తూ 2005 అక్టోబర్ 9 నాటికి, రాష్ట్రంలోను, రాష్ట్రం బయటా మొత్తం 23 కేంద్రాలనుండి ప్రచురితమౌతూ, అత్యధిక ప్రచురణ, ఆదరణ కల భారతీయ భాషా పత్రికలలో మూడవ స్థానానికి చేరింది.

... పూర్తి వ్యాసం