వారం వారం తెవికీ వ్యాసాలు.

Sunday, December 28, 2008

పండ్లు: ఈ వారం తెవికీ వ్యాసం

పండ్లు చెట్టు నుండి లభించే తిను పదార్ధాలు. రకరకాల పండ్లు వివిధ రుచులలో మనకు ప్రకృతిలో లభిస్తున్నాయి. ఆవృత బీజ మొక్కలలో ఫలదీకరణం తర్వాత అండాశయం ఫలంగాను, అండాలు విత్తనాలుగాను అభివృద్ధి చెందుతాయి. ఫలంలోపల విత్తనాలు ఏర్పడడం ఆవృతబీజాల ముఖ్య లక్షణం. ఇలా ఫలాలు ఏర్పడడానికి పట్టే సమయం కొన్ని వారాల నుంచి కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది.

ఫలదీకరణ ఫలితంగా అండాశయంతో పాటు మరియే ఇతర పుష్పభాగం అయినా ఫలంగా పెరిగితే దానిని 'అనృత ఫలం' అంటారు. ఉ. ఆపిల్ లో పుష్పాసనం, జీడిమామిడి లో పుష్పవృంతం ఇలా ఏర్పడిన అనృత ఫలాలు. నిజ ఫలాలు ఫలదీకరణ చెందిన అండాశయం నుంచి ఏర్పడతాయి. నిజఫలాలలో ఫలకవచం, విత్తనాలు అనే రెండు భాగాలుంటాయి. ఒక పుష్పంలోని సంయుక్త అండకోశంలోని అండాశయం నుంచి ఏర్పడే ఫలాన్ని 'సరళ ఫలం' అంటారు.

చాలా వందల రకాల పండ్లు మనకు మంచి రుచికరమైన పోషక ఆహారము. ఉదా: మామిడి, పుచ్చ, ఆపిల్ మొదలైనవి. వీటిని కొంతమంది పండు మొత్తంగా గాని లేదా జామ్ ల రూపంలో తింటారు. పండ్ల నుండి ఐస్ క్రీమ్ లు, కేకులు మొదలైనవి తయారుచేస్తారు. కొన్ని పండ్లనుండి పానీయాలు తయారుచేసి తాగుతాము.

... పూర్తి వ్యాసం

Sunday, December 21, 2008

శ్రీకాళహస్తి: ఈ వారం తెవికీ వ్యాసం

శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లాలో ఒక పట్టణము మరియు ఒక మండలము మరియు ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ ఉండే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలు. వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం కూడా ప్రధాన ఆకర్షణే. కళంకారీ కళకు కాళహస్తి పుట్టినిల్లు.

సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్టుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మం వ్రాసిన ధూర్జటి) వంటి వారి కధలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు ఈ ఆలయ నిర్మాణానికి సహకరించారు. క్రీస్తుశకం 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపుకొన్నాడు. 1912లో దేవకోట్టై కి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుదిరూపునిచ్చారు.

ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు. ఇక్కడి అనేక శివలింగాలు బహు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్టింపబడినవిగా భావిస్తారు. ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు

... పూర్తి వ్యాసం

Sunday, December 14, 2008

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ: ఈ వారం తెవికీ వ్యాసం

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ. ఇస్రో గా ప్రసిద్ధమైన ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో ఏర్పాటైంది. బెంగుళూరు కేంద్రంగా ఏర్పాటైన ఇస్రో, దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు కలిగి ఉంది. విక్రం సారాభాయ్ని భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు పితామహుడిగా అభివర్ణిస్తారు. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధాన మంత్రి అయిన నెహ్రూకు వివరించి, 1962లో హోమీ బాబా పర్యవేక్షణలో Indian National Committee for Space Research (INCOSPAR) ఏర్పరిచాడు. కేరళలో త్రివేండ్రం వద్ద Thumba Equatorial Rocket Launching Station (TERLS) నెలకొల్పి అమెరికా, రష్యా నుండి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ అనతికాలంలోనే స్వదేశీయంగా పూర్తి స్థాయి రాకెట్లను తయారు చేసి ఉపరితల అధ్యయంలో పురోగతి సాధించారు. 1969లో ఇస్రో, అనగా Indian Space Research Organisation (ISRO), 1972లో ప్రత్యేక అంతరిక్ష విభాగం ఏర్పడ్డాయి.


భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహమయిన ఆర్యభట్టను ఏప్రిల్ 19, 1975న అప్పటి సోవియట్ యూనియన్ నుండి విజయవంతంగా ప్రయోగించారు. 1979 నాటికి శ్రీహరికోటలో ప్రయోగించిన ఉపగ్రహం రెండవ దశలో ఎదురయిన సమస్య వల్ల విజయవంతం కాలేదు. లోపాలను సరిదిద్ది 1980లో విజయవంతంగా ప్రయోగించిన రోహిణి-1 భారతదేశంలో ప్రయోగింపబడిన మొదటి ఉపగ్రహం. 1987, 1988లో చేసిన ASLV ప్రయోగాలు రెండూ విఫలమయినప్పటికీ 1992లో ASLV ప్రయోగం విజయవంతమయింది. 1993లో PSLV ప్రయోగం విఫలమయింది. తిరిగి 1994లో PSLV ప్రయోగం విజయవంతమయింది. అప్పటినుండి భారత ఉపగ్రహాలకు PSLV స్థిరమయిన వేదికగా రక్షణ, విద్యా, వ్యవసాయాలకు అవసరమయిన ఎంతో పరిజ్ఞానానికి ఆధారంగా నిలిచింది.


... పూర్తి వ్యాసం

Sunday, December 7, 2008

తెలుగు సినిమా మైలురాళ్ళు: ఈ వారం తెవికీ వ్యాసం

తెలుగులో సినిమా 1931 సంవత్సరంలో మొదలయినప్పటి నుండినేటి వరకూ అనేక వందల సినిమాలు తియ్యబడ్డాయి. అలా తీయబడ్డ సినిమాలు, ఆ సినిమాలు తీసిన దర్శకులు, అందులో నటించిన నటీనటులు-కథా నాయకీ నాయకులు, ప్రతినాయకులు, హాస్య నటులు, బాల నటులు-సంగీతాన్ని కూర్చిన సంగీత దర్శకులు, పాటలు పాడిన గాయకీగాయకులు, తెరమీద కనిపించినవారు, కనబడనివారు, ఇలా చెప్పుకుంటూ పోతే, అనేక మంది కృషితో ఇప్పుడు మన సినీ ప్రపంచం రకరకాల అంద చందాలతో అలరారుతోంది. ఇన్ని దశాబ్దాల ప్రస్థానంలో అనేక మైలు రాళ్ళు, కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి.

తొలి పాక్షిక టాకీ చిత్రం లక్ష్మీ (1930), తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద (1931), తొలి జానపద చిత్రం చింతామణి (1933), తొలి సాంఘిక చిత్రం ప్రేమ విజయం (1936), తొలి చారిత్రక చిత్రం సారంగధర (1937), తెలుగు నుండి పర భాషలోకు అనువదింపబడిన (డబ్బింగ్) తొలి చిత్రం కీలు గుర్రం (1949) తమిళంలో మాయ కుదిరై పేరుతో విడుదలైంది)

తొలి ద్విపాత్రాభినయ చిత్రం అపూర్వ సహోదరులు (1950 - రంజన్), తొలి త్రిపాత్రాభినయ చిత్రం కులగౌరవం (1972-యన్‌.టి.రామారావు), ఏకైక పంచపాత్రాభినయ చిత్రం శ్రీమద్విరాట పర్వము (1979 - యన్.టి.రామారావు), ఏకైక నవపాత్రాభినయ చిత్రం నవరాత్రి (1966- అక్కినేని నాగేశ్వరరావు). తెలుగులో అత్యధిక చిత్రాలలో నటించిన నటుడు - అల్లు రామలింగయ్య (1003 చిత్రాలు), తెలుగులో అత్యధిక చిత్రాలలో నటించిన హీరో- కృష్ణ (326 చిత్రాలు) -

మైలురాళ్ళకెల్ల మైలురాయి గిన్నీస్ బుక్. మన చలన చిత్ర నటీనటులు, దర్శకులు మరి ఇతర సాంకేతిక నిపుణులు, వారివారి నైపుణ్యంతో, ప్రతిభతో గెన్నీస్ బుక్ లోకి ఎక్కారు - విజయనిర్మల - ప్రపంచంలో ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు, దాసరి నారాయణరావు - ప్రపంచంలో 20 సంవత్సరాల నిడివిలో 100 చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు. రామానాయుడు - ప్రపంచంలో ఎక్కువ సినిమాలు (100+) నిర్మించిన నిర్మాత., రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో. బ్రహ్మానందం అత్యధిక హాస్య పాత్రలు పోషించాడు.

... పూర్తి వ్యాసం

Sunday, November 30, 2008

చికాగో: ఈ వారం తెవికీ వ్యాసం

చికాగో అమెరికాలోని ఇల్లనోయ్ రాష్టంలో ఒక నగరం. అమెరికాలో 3వ అతిపెద్ద నగరం. ఇల్లనోయ్, విస్‌కాన్‌సిన్ మరియు ఇండియానా లతో కలిపి చికాగో నగరపాలిత ప్రాంత జనాభా 9.7 మిలియన్లు. అంతర్జాతీయంగా చికాగోకు కల ప్రాముఖ్యత, ఈ నగరాన్ని అల్ఫా వరల్డ్ సిటీ జాబితాలోకి చేర్చింది. 1837 నుండి చికాగో నగరాల జాబితాలోకి చేరింది. మిసిసీపీ నది తీరాన ఉండటం వలన వ్యాపారానికి అనువైన జలమార్గాలు, సరస్సులు మొదలైన నీటి వనరులు చికాగోను అతి త్వరిత గతిని అభివృద్ధి పధానికి నడిపాయి. మిడ్‌వెస్ట్ (మద్య పశ్చిమ ప్రాంతం)కు ప్రస్తుతం చికాగో రవాణాకు, ఆర్ధిక రంగానికి మరియు సాంస్కృతికంగా ప్రముఖ కేంద్రం.

చికాగో ఆర్ధికాభివృద్ధి మిచిగాన్ సరసుతో ముడిపడి ఉంటుంది. చికాగో నగర జలరవాణా ఎక్కువగా చికాగో నదిపై జరుగుతున్న కాలంలో,ఇప్పటి పెద్దసంస్థ అయిన లేక్ ఫ్రైటర్స్ మాత్రం నగరానికి దక్షిణ తీరంలో ఉన్న లేక్ కల్మెట్ హార్బర్‌ ని వాడుకుంటూ వచ్చింది. సరసు కారణంగా చికాగో వాతావరణం అనుకూలంగా కొంత హాయిని కొల్పేదిగా ఉంటుంది. చికాగో నగరం ఎదుర్కొన్న భయంకర అగ్ని ప్రమాదం నగరంలో అత్యంత అధునాతన భవన నిర్మాణ విప్లవవానికి నాంది పలికింది. చరిత్ర జ్ఞాపకాలలో చెరగని ముద్ర వేసిన ఈ అగ్ని ప్రమాదం దేశం గర్వించదగిన భవనాలు ఈ నగరంలో రూపుదిద్దుకోవడానికి దోహదమైంది.

చికాగో నగరం విధ విధమైన వంటకాలకు ప్రసిద్ది. ఇక్కడ స్థిరపడిన ప్రజల విభిన్న జాతీయతే ఇందుకు కారణం. చికాగోలో దేశమంతా ప్రబలమైన డీప్ డిష్ పీజా ఎంత ప్రసిద్దమో చికాగో నగర ప్రత్యేకమైన తిన్‌క్రస్ట్ పీజా కూడా అంత ప్రసిద్దమే. ప్రపంచంలో ధనిక నగరాలలో చికాగో 10 వ స్థానంలో ఉంది. వాణిజ్య కేంద్రాలలో ప్రంచంలో చికాగో 4 వ స్థానంలో ఉంది.

... పూర్తి వ్యాసం

Sunday, November 23, 2008

అంజు బాబీ జార్జ్: ఈ వారం తెవికీ వ్యాసం

అంజు బాబీ జార్జ్ ప్రముఖ అథ్లెటిక్ క్రీడాకారిణి. ఆమె ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భారతదేశంలో అత్యున్నతమైన క్రీడా పురస్కారాలలో ఒకటైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కూడా ఆమెకు బహుకరించారు. అంజు 1977, ఏప్రిల్ 19న కేరళలోని చంగనాస్సరిలో కోచిపరాంబిల్ కుటుంబంలో జన్మించింది. అంజు తండ్రి ప్రోత్సాహం మరియు పాఠశాల శిక్షకుడు తోడ్పాటుతో అథ్లెటిక్ రంగంలోకి ప్రవేశించింది. ఆమె హెప్టాథ్లాన్‌లో క్రీడాజీవితం ప్రారంభించినా ఆ తర్వాత లాంగ్‌జంప్, హైజంప్‌లపై శ్రద్ధ చూపించి 1996లో ఢిల్లీ లో జూనియన్ ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో లాంగ్‌జంప్‌లో స్వర్ణపతకం సాధించింది. 1999లో బెంగుళూరులో ట్రిపుల్‌జంప్‌లో జాతీయ రికార్డు సృష్టించింది. నేపాల్‌లో రజత పతకం సాధించింది. 2001లో లుధియానాలో జరిగిన జాతీయ క్రీడలలో ట్రిపుల్‌జంప్‌లో స్వర్ణం సాధించింది. 2002లో మాంచెస్టర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో అంజు 6.49 మీటర్లు లాంగ్‌జంప్ కాంస్యపతకం గెల్చింది. ఆ తర్వాత బుసాన్లో జరిగిన ఆసియా క్రీడలలో భారతదేశానికి స్వర్ణ పతకం సాధించి పెట్టింది.


2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ పోటీలలో 6.70 మీటర్ల దూరం దుమికి కాంస్య పతకం సాధించి దేశ అథ్లెటిక్ చరిత్రలోనే చరిత్ర సృష్టించింది. ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ పోటీలలో పతకం గెల్చిన తొలి భారతీయ వ్యక్తిగా రికార్డు సృష్టించింది. 2005లో దక్షిణ కొరియాలో 16వ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీలలో 6.65 మీటర్ల దూరంతో బంగారుపతకం గెల్చింది. అదే సంవత్సరం ఐ.ఎ.ఎ.ఎఫ్ ప్రపంచ అథ్లెటిక్స్‌లో 6.75 మీటర్లు దుమికి రజిత పతకం సాధించింది. ఇదే ఆమె ఆఖరి అత్యున్నత ప్రతిభ. 2006లో దోహలో జరిగిన 15వ ఆసియా క్రీడలలో లాంగ్‌జంప్‌లో రజత పతకం సాధించింది. 2008లో దోహాలో ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్ పోటీలలో రజతపతకం సాధించింది. అంజు జార్జి భర్త, బాబీ జార్జ్ కూడా క్రీడాకారుడే. మెకానికల్ ఇంజనీర్ అయిన అతడు ట్రిపుల్ జంప్‌లో జాతీయ క్రీడల చాంపియన్. అంజుకు క్రీడలలో ప్రాత్సాహమే కాకుండా మంచి శిక్షణ కూడా ఇచ్చాడు. 1998 నుంచి అంజుకు పూర్తి కాలపు కోచ్‌గా వ్యవహరించాడు.

 ప్రముఖ అథ్లెటిక్ క్రీడాకారిణి. ఆమె ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భారతదేశంలో అత్యున్నతమైన క్రీడా పురస్కారాలలో ఒకటైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కూడా ఆమెకు బహుకరించారు. అంజు 1977, ఏప్రిల్ 19న కేరళలోని చంగనాస్సరిలో కోచిపరాంబిల్ కుటుంబంలో జన్మించింది. అంజు తండ్రి ప్రోత్సాహం మరియు పాఠశాల శిక్షకుడు తోడ్పాటుతో అథ్లెటిక్ రంగంలోకి ప్రవేశించింది. ఆమె హెప్టాథ్లాన్‌లో క్రీడాజీవితం ప్రారంభించినా ఆ తర్వాత లాంగ్‌జంప్, హైజంప్‌లపై శ్రద్ధ చూపించి 1996లో ఢిల్లీ లో జూనియన్ ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో లాంగ్‌జంప్‌లో స్వర్ణపతకం సాధించింది. 1999లో బెంగుళూరులో ట్రిపుల్‌జంప్‌లో జాతీయ రికార్డు సృష్టించింది. నేపాల్‌లో రజత పతకం సాధించింది. 2001లో లుధియానాలో జరిగిన జాతీయ క్రీడలలో ట్రిపుల్‌జంప్‌లో స్వర్ణం సాధించింది. 2002లో మాంచెస్టర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో అంజు 6.49 మీటర్లు లాంగ్‌జంప్ కాంస్యపతకం గెల్చింది. ఆ తర్వాత బుసాన్లో జరిగిన ఆసియా క్రీడలలో భారతదేశానికి స్వర్ణ పతకం సాధించి పెట్టింది.


2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ పోటీలలో 6.70 మీటర్ల దూరం దుమికి కాంస్య పతకం సాధించి దేశ అథ్లెటిక్ చరిత్రలోనే చరిత్ర సృష్టించింది. ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ పోటీలలో పతకం గెల్చిన తొలి భారతీయ వ్యక్తిగా రికార్డు సృష్టించింది. 2005లో దక్షిణ కొరియాలో 16వ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీలలో 6.65 మీటర్ల దూరంతో బంగారుపతకం గెల్చింది. అదే సంవత్సరం ఐ.ఎ.ఎ.ఎఫ్ ప్రపంచ అథ్లెటిక్స్‌లో 6.75 మీటర్లు దుమికి రజిత పతకం సాధించింది. ఇదే ఆమె ఆఖరి అత్యున్నత ప్రతిభ. 2006లో దోహలో జరిగిన 15వ ఆసియా క్రీడలలో లాంగ్‌జంప్‌లో రజత పతకం సాధించింది. 2008లో దోహాలో ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్ పోటీలలో రజతపతకం సాధించింది. అంజు జార్జి భర్త, బాబీ జార్జ్ కూడా క్రీడాకారుడే. మెకానికల్ ఇంజనీర్ అయిన అతడు ట్రిపుల్ జంప్‌లో జాతీయ క్రీడల చాంపియన్. అంజుకు క్రీడలలో ప్రాత్సాహమే కాకుండా మంచి శిక్షణ కూడా ఇచ్చాడు. 1998 నుంచి అంజుకు పూర్తి కాలపు కోచ్‌గా వ్యవహరించాడు.

... పూర్తి వ్యాసం

Sunday, November 16, 2008

మొసలి: ఈ వారం తెవికీ వ్యాసం

మొసలి సరీసృపాల జాతికి చెందిన ఒక జంతువు. ఇది "క్రోకడైలిడే" అనబడే కుటుంబానికి చెందినది. స్థూలంగా దీనిని క్రోకడీలియా అనే క్రమంలో వర్గీకరస్తారు. crocodiles, alligators, caimans, gharial అనే జంతువులు ఈ "క్రోకడీలియా" అనే క్రమంలోకే చెందుతాయి. మొసళ్ళు ఆఫ్రికా, ఆసియా, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలలో ఉష్ణమండలపు తేమ ప్రాంతాలలో ఉండే పెద్ద జలచరాలుగా జీవించే సరీసృపాలు. అధికంగా ఇవి సరస్సులు, నదులు వంటి మంచి నీటి స్థలాలలోను, అరుదుగా ఉప్పునీటి కయ్యలలోను ఉంటుంటాయి. మొసళ్ళు భూమిమీద 200 మిలియన్ సంవత్సరాల క్రితంనుండి ఉన్నాయని అంచనా. భూమి మీద మరెన్నో జాతులు అంతరించినప్పటికీ మొసళ్ళ జాతి నిలబడింది. బ్రతికి ఉన్న మొసళ్ళలో అతి పెద్దది ఒరిస్సాలో "భైతర్కనికా వన్యప్రాణి సంరక్షణావనంలో ఉంది. దీని పొడవు 7.1 మిటర్లు (25.3 అడుగులు). ఇది జూన్ 2006లో గిన్నీస్ బుక్‌లోకి ఎక్కింది.


కొద్ది దూరాల ప్రయాణంలో మొసళ్ళు వేగంగానే కదలగలవు. వాటి దవడలు చాలా శక్తివంతమైనవి. వాటి నోటికి అందిన జంతువులను పటపట విరిచేసే శక్తి ఈ దవడల ద్వారా వాటికి లభిస్తుంది. అన్ని జంతువుల కంటే మొసళ్ళ దవడల బలం చాలా ఎక్కువ. దాని నోటిపట్టు చదరపు అంగుళానికి 5,000 పౌండుల బలాన్ని కలిగిస్తుంది. మొసళ్ళ పళ్ళు చాలా పదునైన రంపాలలాగా ఉంటాయి. చేపలను ముక్కలు ముక్కలుగా చేయడానికి వీలైనవి. పరిణామ క్రమంలో వేటను ఇంత బలంగా పట్టుకోవడానికి రూపొందిన మొసళ్ళ దవడ కండరాలకు నోటిని తెరిచేప్పుడు లభించే శక్తి మాత్రం చాలా తక్కువ. వాటి నోరు గట్టిగా మూసి పట్టుకొంటే అవి నోరు తెరువలేవు.


పెద్ద జాతి మొసళ్ళు మనుషులకు చాలా ప్రమాదకరమైనవి. వాటి "నడక" వేగం కంటే మెరుపులా మీదపడే లక్షణం వల్ల మనుషులకు తప్పించుకొనే అవకాశం చాలా తక్కువ. వీటిలో ఉప్పు నీటి మొసలి మరియు నైల్ మొసలి యేటా ఆఫ్రికా, ఆగ్నేయాసియాలలో వందలాది మనుషుల మరణాలకు కారణమవుతున్నాయి. మగ్గర్ మొసలి మరియు నల్ల కెయ్‌మన్ కూడా చాలా ప్రమాదకరమైనవి. అమెరికన్ ఎలిగేటర్ అంత ప్రమాదకరమైనది కాదు. రెచ్చగొడితే తప్ప తనంత తనుగా ఇది మనుషులపై దాడి చేయదు.

... పూర్తి వ్యాసం

Friday, November 14, 2008

అబ్‌ఖజియా: ఈ వారం తెవికీ వ్యాసం

అబ్‌ఖజియా కాకస్ పర్వతాల ప్రాంతంలో ఉన్న ఒక భూభాగం. ఇది దాదాపు పూర్తి స్వాతంత్ర్యం కలిగిన గణతంత్ర దేశం. కాని అంతర్జాతీయంగా దీనికి దేశంగా గుర్తింపులేదు. ఒక్క జార్జియా దేశం మాత్రం అబ్‌ఖజియాను గుర్తించింది. అబ్‌ఖజియా దేశం పూర్తిగా జార్జియా సరిహద్దుల లోపల ఉన్నది. పశ్చిమాన నల్ల సముద్రం, ఉత్తరాన రష్యా అబ్‌ఖజియాకు సరిహద్దులు. ప్రపంచంలోని ఏ ఇతర దేశాలు అబ్‌ఖజియాను స్వతంత్ర దేశంగా గుర్తించలేదు.


1992-1993 మధ్యకాలంలో జార్జియా నుండి జరిగిన వేర్పాటు ఉద్యమంలో జార్జియా మిలిటరీ ఓడిపోయింది. అబ్‌ఖజియా ప్రాంతంనుండి ఇతర జాతులవాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. 1994లో యుద్ధవిరమణ జరిగింది. అయినా ఇప్పటికీ వివాదం పరిష్కారమవలేదు. రష్యా అండ ఉన్న వేర్పాటువాదులు మొత్తం భూభాగంలో 83%పై అధిపత్యం కలిగిఉన్నారు (de-facto Government). మిగిలిన 17% భూభాగంపై అధిపత్యం కలిగి ఉన్న పార్టీలు 'కొడోరి లోయ'నుండి తమ పాలన సాగిస్తున్నారు. ఈ (17% పాలన) సముదాయానికే అబ్‌ఖజియాలో న్యాయపరమైన పాలకులుగా గుర్తింపు ఉన్నది. (de-jure Government). ఐక్య రాజ్య సమితి, యూరోపియన్ కమ్యూనిటీ వంటి అంతర్జాతీయ సంస్థలు అబ్‌ఖజియాను జార్జియా దేశంలో ఒక అంతర్గత భాగంగా మాత్రమే గుర్తిస్తున్నాయి. జార్జియా, అబ్‌ఖజియాలు తమ మధ్య వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకొని తమ స్థితిని స్పష్టం చేయాలని ఐ.రా.స. కోరుతున్నది.


మొత్తం 8,600 చ.కి.మీ. వైశాల్యం గల అబ్‌ఖజియా దేశం ప్రధానంగా పర్వతమయమైనది. కాకస్ పర్వతాలలో విస్తరించి ఉన్నది. చాలా పర్వత శిఖరాలు 4,000 మీటర్లు పైబడి ఎత్తు గలవి. నల్ల సముద్రం తీరాన మైదాన ప్రాంతాలనుండి ఉత్తరాన శాశ్వత హిమమయమైన లోయలవరకు వైవిధ్యం గల భౌగోళిక స్వరూపం ఉన్నది. మైదాన ప్రాంతాలలో సాగు అయ్యే తేయాకు, పొగాకు, ద్రాక్ష, ఇతర పండ్ల తోటలు అబ్‌ఖజియా ఆర్ధిక వ్యవస్థకు పట్టుకొమ్మలు. కాకస్ పర్వతాలనుండి సముద్రంలోకి ప్రవహించే చిన్న చిన్న నదులు వ్యవసాయానికి ప్రధానమైన నీటివనరులు. అబ్‌ఖజియా ఆర్ధిక వ్యవస్థ రష్యాతో గాఢంగా ముడిపడి ఉంది.

...పూర్తి వ్యాసం

Sunday, November 2, 2008

అమరావతి స్తూపము: ఈ వారం తెవికీ వ్యాసం

అమరావతి, గుంటూరు జిల్లాలో కృష్ణా నదీ తీరాన ఉన్నది. అమరావతికి సమీపంలోని ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకం. ఆ కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. అప్పటి అమరావతి స్తూపము ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఈ స్తూపము క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము, క్రీస్తు శకము 3వ శతాబ్దముల మధ్య కట్టబడి మార్పులు చేర్పులు చేయబడినది.


స్తూపం నిర్మాణంలో ముఖ్యమైన అంశాలు - ఒక వేదిక, దానిపైన అర్ధ గోళాకృతి అండము, అండముపై ఒక హర్మిక, దానిపై నిర్మాణాన్ని అంతటినీ ఆవరించే దండ సహిత ఛత్రము, అండము, హర్మికల మధ్య గళము, చుట్టూరా ఒకటి లేదా రెండు ప్రాకారాలు. మహాచైత్య గర్భంలోనూ, ఇతర భాగాలలోనూ పవిత్ర ధాతువులున్న పది మంజూషికలు లభించాయి. ఆచార్య నాగార్జునుడు ఇక్కడి విహారంలో నివసించి ప్రజ్ఞాపారమిత సూత్రాలను స్థానిక నాగరాజు నుండి గ్రహించి గ్రంథస్థం చేసినట్లు తెలుస్తోంది. తర్కపండితుడు భావవివేకుడు విహారంలో కొంతకాలం ఉండి రచనలు చేశాడు. క్రీ. శ. 684లో హుయాన్ త్సాంగ్ 'అభిధమ్మ పిటకం' అభ్యసించి రచనలు చేశాడు. అనేక సంఘారామాలున్నట్లు, వాటిలో జనావాసం చాలవరకు తగ్గినట్లు, అవి శిధిలావస్థలో ఉన్నట్లు పేర్కొన్నాడు. క్రీ.శ. 1344 వరకు పూజాపునస్కారాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. క్రీ.శ. 1700 నాటికి స్తూపము శిధిలావస్థకు చేరుకొంది. మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. "దీపాలదిన్నె" గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ.


ఆమరావతి శిల్పము ఆంధ్రభూమిని కళామయము చేసి ఆంధ్రులకు కీర్తి ప్రతిష్టలు ఆపాదించినది. అమరావతి ద్వారా ఆంధ్ర శిల్పి నైపుణ్యం దేశ దేశాలలో వ్యాపించింది. అమరావతీ శిల్పరీతియే ఆంధ్రరీతియై పల్లవ చాళుక్యాది దాక్షిణాత్య శిల్పులకు వరవడియై మలయా, జావా, సుమత్రా, సింహళాది దేశాలలో తన వైజయంతికలను ప్రసరింపజేసిందట. అమరావతి శిల్ప కళారీతి శ్రీలంక, ఆగ్నేయాసియాలలోని విర్మాణాలపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంది. ఇక్కడినుండి శిల్పాలు ఆయా దేశాలకు తీసికొని వెళ్ళడం ఇందుకు ఒక కారణం.

... పూర్తి వ్యాసం

Monday, October 27, 2008

మహబూబ్‌ నగర్: ఈ వారం తెవికీ వ్యాసం

మహబూబ్‌ నగర్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లోని తెలంగాణా ప్రాంతంలోని 10 జిల్లాల్లో విస్తీర్ణం పరంగా అతిపెద్దది. 18432 చ.కి.మీ. విస్తీర్ణం కల్గిన ఈ జిల్లాకు దక్షిణంగా తుంగభద్ర నది ప్రవహిస్తుంది. కృష్ణా నది కూడా ఈ జిల్లా గుండా ప్రవేశించి ఆలంపూర్ వద్ద తుంగభద్రతో కలుస్తుంది. అమ్రాబాదు గుట్టలు జిల్లా ఆగ్నేయాన విస్తరించాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా జనసంఖ్య 35 లక్షలు. ఈ ప్రాంతాన్ని పూర్వం పాలమూరు అని, రుక్మమ్మపేట అని పిలిచేవారు. డిసెంబరు 4, 1890న అప్పటి హైదరాబాదు సంస్థాన పరిపాలకుడైన ఆరవ మహబూబ్ ఆలీ ఖాన్ అసఫ్ జా పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చబడినది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూర్ వజ్రం మరియు గోల్కొండ వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు.


ఈ జిల్లాలో 1553 రెవెన్యూ గ్రామాలు, 1347 గ్రామపంచాయతీలు, 64 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 2 లోకసభ నియోజక స్థానాలు, 13 అసెంబ్లీ నియోజక వర్గ స్థానాలు (పునర్విభజన ప్రకారం 14 స్థానాలు) కలవు. ఇక్కడ వర్షపాతం తక్కువ. పనులు లేక అనేక మంది కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడం ఇక్కడ సాధారణం. అక్ష్యరాస్యత కూడా తక్కువ. సామాజిక, ఆర్థికంగా కూడా ఈ జిల్లా అభివృద్ధి చెందవలసి ఉంది.


తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఆలంపూర్ వద్ద ఐదో శక్తి పీఠంగా పేరుగాంచిన జోగుళాంబ ఆలయం, బాలబ్రహ్మేశ్వర ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ పట్టణ సమీపాన సుమారు 700 సంవత్సరాల వయస్సు కల్గిన ఒక మహావృక్షం ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. గద్వాల కోట పట్టణం నడిబొడ్డున కలదు. నల్లమల అటవీ ప్రాంతంలో ఎత్తయిన కొండలపై ఉమా మహేశ్వర క్షేత్రం శ్రీశైలం ఉత్తర ద్వారంగా భాసిల్లుతోంది. మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఆంద్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్‌నగర్ ఎంపికైనది. ఇది దేశంలోనే రెండవ పంచాయతీ సమితి.
 

Sunday, October 19, 2008

రవీంద్రనాథ్ టాగోర్: ఈ వారం తెవికీ వ్యాసం

భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ టాగోర్. తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. వంగదేశంలో 1861 మే 7వ తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు. ఇంటివద్దనే క్రమశిక్షణతో లెక్కలు, చరిత్ర, భూగోళ శాస్త్రం, చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీషు, సంగీత పాఠాలు, భౌతిక శాస్త్రం ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకొన్నాడు. మాతృభాష పట్ల అభిమానం పెంచుకొన్నాడు. ఇంగ్లాండులో ఒక పబ్లిక్ స్కూలులో చేరి, ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు విని ఆంగ్ల సాహిత్యంపై అభిరుచి పొంచుకొన్నాడు.

రవీంద్రుడు బాల్యంలోనే అనేక పద్యాలు, వ్యాసాలు, విమర్శలు ప్రచురించాడు. రవీంద్రుని రచనలలో గీతాంజలి చాల గొప్పది. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. 1913 వ సంవంత్సరంలో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని గీతాంజలికే నోబెల్ బహుమతి లభించింది. "విశ్వకవి" అనే బిరుదును సాధించి పెట్టింది. ఆసియా ఖండంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి.

రవీంద్రుడు ప్రాచీన మునుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అది అయిదుగురు విద్యార్థులతో మొదలై, క్రమంగా విస్తరించింది రవీంద్రనాధ టాగోరు డెబ్భై ఏళ్ళ ప్రాయంలో చిత్రకళా రచన ప్రారంభించాడు. ఆయన వేసిన చిత్రాలు లండను, ప్యారిస్, న్యూయార్కు వంటి నగరాలలో ప్రదర్శించబడ్డాయి. ఆయన దాదాపు రెండు వేల చిత్రాలను గీశాడు. రవీంద్రుడికి సంగీతమంటే మిక్కిలి ప్రీతి. ఆయన బెంగాల్ జానపద గీతాలను, బాపుల్ కీర్తనలను విని ముగ్ధుడయ్యేవాడు. ఆయన స్వయంగా గాయకుడు. భారతీయ సంగీతంలో రవీంద్ర సంగీతం అనే ప్రత్యేక శాఖ నేర్పర్చిన వాడు రవీంద్రుడు.

... పూర్తి వ్యాసం

Sunday, October 12, 2008

మక్కా: ఈ వారం తెవికీ వ్యాసం

మక్కాహ్ ఇస్లామీయ పవిత్ర నగరం. ఇది సౌదీ అరేబియా మక్కా క్షేత్రంలో, చారిత్రాత్మక హిజాజ్ ప్రాంతంలో ఉంది. ఈనగరంలోనే ముస్లింలకు పరమ పవిత్రమైన మస్జిద్-అల్-హరామ్ (పవిత్ర మసీదు) ఉంది. ఈ మస్జిద్ లోనే పరమ పవిత్రమైన కాబా గృహం ఉంది. హజ్ యాత్రలో ముస్లింలందరూ ఇచటనే చేరి హజ్ సాంప్రదాయం లోని 'కాబా గృహం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు. నగరం జనాభా 1,294,167. ముస్లింలు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా హజ్ యాత్రకొరకు ఈనగరానికి విచ్చేస్తారు. ముస్లిమేతరులకు ఈనగరంలోని కాబాలో మాత్రం ప్రవేశం నిషిద్ధం. ఈనగరంలో వేలాది ముస్లిమేతరుల కుటుంబాలు నివశిస్తున్నాయి.


హజ్ మరియు ఉమ్రా కొరకు గల రవాణాసౌకర్యాలు పెద్దవి. మక్కాలో విమానాశ్రయం లేదు. జెద్దాలోని '[[కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం' ద్వారా ఇక్కడికి వెళ్ళవచ్చును. మక్కాలో జనసాంద్రత ఎక్కువ. అతిప్రాచీన జనావాసం పాతబస్తీలో ఉంది. ఎక్కువమంది హజ్ పరిశ్రమ లో పనిచేసేవారే. వీరెప్పుడూ హజ్ కొరకు తయారుగా వుంటారు. ప్రతియేటా దాదాపు 40 లక్షలమంది ముస్లింలు హజ్ కొరకు మక్కా సందర్శిస్తారు


కాబాగృహం చతురస్రాకారపు నిర్మాణం, దీనిచుట్టూ మస్జిద్-అల్-హరామ్ ఉంది. దీని నిర్మాణం దాదాపు హిజ్రీ పూర్వం 3000 జరిగినది. పూర్వం కాబా గృహంలో దాదాపు 360 విగ్రహాలుండేవి. ఈ విగ్రహాలలో లాత్, మనాత్, హుబల్ మరియు దులిల్ లు ప్రసిధ్ధి. మక్కా మరియు సౌదీ అరేబియాలోగల సంచార జాతులన్నీ ఈ విగ్రహారాధన చేసేవి. 360 విగ్రహాలలో ఈసా మరియు మరియమ్ విగ్రహాలు కూడా ఉండేవని ప్రతీతి.

... పూర్తి వ్యాసం

Sunday, October 5, 2008

బంగాళదుంప: ఈ వారం తెవికీ వ్యాసం

బంగాళదుంప అనేది దుంప జాతికి చెందిన ఒక కూరగాయ. ఒక్కో ప్రాంతములో ఒక్కోక పేరుతో ఈ దుంప కూర పిలవబడుతున్నది. కొన్ని చోట్ల ఆలు గడ్డ అని లేదా ఉర్ల గడ్డ అని పిలుస్తారు. ఈ మొక్క సొలనేసి కుటుంబానికి చెందిన గుల్మము. 17వ శతాబ్దము వరకు బంగాళదుంప అనే కూరగాయ ఉన్నదని ఒక్క దక్షిణ అమెరికా ఖండంలో తప్ప మిగిలిన ప్రపంచానికి తెలియదు. స్పానిష్ వారు దక్షిణ అమెరికా ప్రాంతమును ఆక్రమించి వారి దేశానికి వలస దేశాలుగా తమ అధీనము లోనికి తీసుకువచ్చిన తరువాత, ఈ కొత్త కూరగాయ గురించి ముందు ఐరోపా వాసులకు ఆ తరువాత వారి ద్వారా ఇతర ప్రాంతములకు తెలిసింది. భారత దేశమునకు బంగాళాదుంప ఐరోపా వలసవారి నుండి వచ్చినదే. 1822వ సంవత్సరమువరకు, మనదేశములో బంగాళదుంపను ఒక పంటగా పండించలేదట. మొట్టమొదట, సల్లివాన్ అనే అంగ్లేయుడు, మద్రాసుకు దగ్గరలో తన వ్యవసాయ క్షేత్రంలో పంటగా మొదలు పెట్టాడట.


బంగాళాదుంప పంట నుండి 2006వ సంవత్సరములో మొత్తం ప్రపంచములో 315 మిలియన్ టన్నుల దిగుబడి వచ్చినది. ఈ విధంగా చూస్తే, మొత్తం పంటలలో బంగాళదుంప నాలుగవ స్థానాన్ని అక్రమిస్తుంది - వరి, గోధుమ, మొక్కజొన్న తరువాత. ఆహార పౌష్టికత పరంగా బంగాళదుంపలలో పిండి పదార్ధాలు (కార్బోహైడ్రేటులు) ప్రధానమైన ఆహార పదార్ధం. ఒక మధ్య రకం సైజు దుంపలో 26 గ్రాములు పిండిపదార్ధం ఉంటుంది. ఇది ముఖ్యంగా స్టార్చ్ రూపంలో ఉంటుంది. ఇంకా పలువిధాలైన విటమిన్‌లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. బంగాళ దుంపలో లభించే పోషక పదార్ధాల వినియోగం దానిని ఉడకపెట్టే విధానంపై బాగా ఆధారపడి ఉంటుంది. ఐక్య రాజ్య సమితి 2008 సంవత్సరాన్ని అధికారికంగా అంతర్జాతీయ బంగాళాదుంప సంవత్సరం గా ప్రకటించింది.

... పూర్తి వ్యాసం

Sunday, September 28, 2008

టైటానిక్ నౌక: ఈ వారం తెవికీ వ్యాసం

టైటానిక్ నౌక, "వైట్ స్టార్ లైన్" అనే సంస్థ కోసం "హర్లాండ్ అండ్ వోల్ఫ్" అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో ఒకటి. 1912 లో దానిని మొదటిసారిగా ప్రవేశ పెట్టినపుడు ప్రపంచంలో కెల్లా అదే అతి పెద్ద ప్రయాణ నౌక. దాని మొదటి ప్రయాణంలోనే ఏప్రిల్ 15, 1912 వ తేదీన ప్రమాదవశాత్తూ ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. 1517 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. దీనివలన ఇది అపకీర్తిని మూటగట్టుకోవడమే కాకుండా చరిత్రలో అతి దురదృష్టకరమైన సంఘటనలలో ఒకటిగా మిగిలిపోయింది.


దీని నిర్మాణంలో అప్పట్లో ఉండే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన అది మునిగి పోవడం అసాధ్యం అని జనాలు నమ్మేవారు. కానీ అది మునిగిపోయి అపార ప్రాణనష్టాన్ని కలిగించడం చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. టైటానిక్ బాధితుల గురించి మాధ్యమాల ప్రచారం, నౌకలో జరిగినట్లుగా చెబుతున్న ప్రధాన సంఘటనలు, ఆతరువాత కొత్తగా ప్రవేశపెట్టబడిన నౌకాయాన న్యాయ నియమాలు, 1985లో రాబర్ట్ బల్లార్డ్ నేతృత్వం లో కనుగొనబడిన టైటానిక్ అవశేషాలు, ఈ నౌకకు అత్యంత ప్రాముఖ్యతను సంపాదించి పెట్టాయి.

టైటానిక్ నౌక మొట్టమొదట మరియు చిట్టచివరి ప్రయాణం ఇంగ్లాండులోని సౌథాంప్టన్ నుంచి న్యూయార్క్ నగరం వరకూ సాగవలసినది. ఎడ్వర్డ్.జె.స్మిత్ నావికుడిగా ఈ ప్రయాణం, 1912, ఏప్రిల్ 10 బుధవారం ఆరంభమైంది. ఏప్రిల్ 14 ఆదివారం రాత్రి. చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత. ఆరోజు దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తూ నౌకను నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదు. రాత్రి సమయంలో టైటానిక్ నౌక పర్వతాన్ని గుద్దుకోవడంలో నౌక కుడి వైపు 300 అడుగుల పొడవు మేరకు రాపిడికి గురై రివెట్లను బయటపడేసింది. సముద్రపు నీరు ముందు భాగపు గదులను నింపేస్తుండటంతో వాటి తలుపు వాటంతట అవే మూసుకుపోయాయి. ఐదు కంపార్ట్ మెంట్లూ నీటితో నిండిపోవడం ప్రారంభించాయి. అప్పటి నియమాల ప్రకారం ఈ నౌకలో సరిపడా లైఫ్ బోట్లు ఉన్నా నౌకలోని ప్రయాణీకులందరికీ అవి సరిపడలేదు.

... పూర్తి వ్యాసం

Sunday, September 21, 2008

స్వామీ వివేకానంద: ఈ వారం తెవికీ వ్యాసం

స్వామీ వివేకానంద, (జనవరి 12, 1863 - జూలై 4, 1902), ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాధుడు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.


భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండుల లో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి కలదు. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగో లో జరిగిన ప్రపంచ మత సమ్మేళనం(పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్)లో 1893లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిదేళ్ళ వయసు లోనే మరణించాడు.


వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని బోధనల ప్రకారం అద్వైత వేదంతము తత్త్వ శాస్త్రములో నే కాకుండా , సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. "దరిద్ర నారాయణ సేవ" అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతి లో కలిసి పోతాయని తెలుసుకున్నాడు. అతని సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది.

--- పూర్తి వ్యాసం

Sunday, September 14, 2008

పొట్టి శ్రీరాములు: ఈ వారం తెవికీ వ్యాసం

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.


పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌను, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పటమటపల్లె గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. 1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోవడం జరిగింది. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు.


మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. దేహం బలహీనం అయ్యి, స్పృహ తప్పి పోయినా దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకొన్నారు. స్పృహ లేనప్పుడు ఎవరూ బలవంతంగా ఇంజెక్షను ద్వారా ఆహారం ఎక్కించరాదని ఆయన చెప్పారు. అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అల్లరును వ్యతిరేకించాడు.

... పూర్తి వ్యాసం

Sunday, September 7, 2008

భారత క్రికెట్ జట్టు: ఈ వారం తెవికీ వ్యాసం

భారతదేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించే జట్టుకు భారత క్రికెట్ జట్టు అని వ్యవహరిస్తారు. ఇది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అజమాయిషీలో ఉంటుంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రపంచంలోనే స్పాన్సర్‌షిప్ రూపంలో అత్యధిక డబ్బును ఇచ్చే జాతీయ క్రీడాజట్టుగా నిలిచింది. భారతదేశం మొట్టమొదటి సారిగా 1921లో తొలి క్రికెట్ మ్యాచ్ ఆడింది. కాని అధికారికంగా మొదటి టెస్ట్ మ్యాచ్ 1932, జూన్ 25న ఇంగ్లాండుతో లార్డ్స్ లో ఆడి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆరవ దేశంగా స్థానం సంపాదించినది. 1900లలో కొందరు భారతీయులు ఇంగ్లీష్ క్రికెట్ టీంలో ఆడటానికి ఇంగ్లాండు వెళ్ళినారు. వారిలో ముఖ్యులు రంజిత్ సింహ్ జీ మరియు దులీప్ సింహ్ జీ. 1926లో ఇంపీరియల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)లో భారతదేశానికి ఆహ్వానించారు. 1932లో తొలిసారిగా అధికారిక టెస్ట్ మ్యాచ్ సి.కె.నాయుడు నేతృత్వంలో ఇంగ్లాండుతో ఆడింది.


టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు తొలి విజయం 1952లో ఇంగ్లాండుపై చెన్నైలో లభించింది. ఆ తరువాతి సంవత్సరం పాకిస్తాన్ పై తొలి సీరీస్ విజయం సాధించింది. 1950 దశాబ్దిలో భారత జట్టు మంచి పురోగతి సాధించింది. 1970 దశకంలో భారత జట్టులో స్పిన్ దిగ్గజాలైన బిషన్ సింగ్ బేడీ, ఎర్రపల్లి ప్రసన్న, చంద్రశేఖర్, వెంకట రాఘవన్ లాంటివారు ప్రవేశించారు. అదే సమయంలో ఇద్దరు ప్రముఖ బ్యాట్స్‌మెన్లు (సునీల్ గవాస్కర్ మరియు గుండప్ప విశ్వనాథ్ లు) కూడా భారత జట్టులో రంగప్రవేశం చేశారు. 1971లో అజిత్ వాడేకర్ నాయకత్వంలో భారతజట్టు ఇంగ్లాండు మరియు వెస్ట్‌ఇండీస్ లపై సీరీస్ విజయం సాధించగలిగింది.


1971లో వన్‌డే క్రికెట్ ప్రారంభమైన తరువాత క్రికెట్‌కు జనాదరణ బాగా పెరిగింది. 1970 దశాబ్దం ద్వితీయార్థం నుంచి టెస్టులలో భారత్ బలంగా తయారైంది. 1976లో క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్ట్‌ఇండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 403 పరుగుల లక్ష్యాన్ని ఛేదింది భారత్ రికార్డు సాధించింది.

... పూర్తి వ్యాసం

Monday, September 1, 2008

స్టీవ్ జాబ్స్: ఈ వారం తెవికీ వ్యాసం

స్టీవ్ జాబ్స్ గా పిలువబడే స్టీవెన్ పాల్ జాబ్స్ యాపిల్ ఇన్‌కార్పొరేటేడ్‌కు చైర్మెన్ మరియు CEO. కంప్యూటర్ రంగంలో మరియు వినోదం పరిశ్రమలో తిరుగులేని విజయాలను సాధించి ప్రపంచంలోనే ఒకానొక గొప్ప వ్యాపారవేత్తగా పేరుపొందాడు. ఇతను 1944 ఫిబ్రవరి 24న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు. జాబ్స్ కు చిన్నప్పటినుండి అధ్యాత్మిక విషయాల పైన చాలా ఆసక్తి. ఒక వీడియో గేమ్స్ కంపెనీలో కొన్నాళ్ళు పనిచేసి తగినంత డబ్బు చేకూరిన తర్వాత భారతదేశ పర్యటన చేసి వేదాంత, ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొన్నాడు. తర్వాత నున్నని గుండుతో, భారతీయ సాంప్రదాయ దుస్తులతో అమెరికాకు వెనుతిరిగాడు.


1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు. మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు. అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది. 1984లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది. 1984 చివరలో ఏర్పడిన మాంద్యం వల్ల 1985లో జాబ్స్ ను మ్యాకింటోష్ విభాగ అధిపతి పదవినుండి తొలగించారు. అప్పుడు NeXT అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్లు ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నా, చాలా ఖరీదయినవి కావడంతో ఎక్కువమంది కొనలేదు.


ఆపిల్ డైరక్టర్లు NeXTను 429 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసారు. అప్పటి ఒప్పందంలో భాగంగా స్టీవ్ జాబ్స్ మళ్ళీ ఆపిల్ కంపెనీకి తాత్కాలిక CEOగా నియమితుడయ్యాడు. కంపెనీని లాభాల బాటలో తీసుకెళ్ళడంలో ముఖ్యపాత్ర వహించడంతో 2000లో పూర్తిస్థాయి CEO అయ్యాడు. కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్‌ను ఆవిష్కరించి ఆపిల్‌ను ఎవరూ అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళగలిగాడు.


1986లో 10 మిలియన్ డాలర్లకు పిక్సర్ అనే గ్రాఫిక్స్ కంపెనీని కొన్నాడు. పిక్సర్-డిస్నీ సహయత్నంగా మొట్టమొదటి సినిమా అయిన టాయ్ స్టోరీ 1995లో విడుదలయి ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత పదేళ్ళపాటు వరుసగా ప్రతి సినిమా ఘన విజయాన్ని సాధిస్తూ గొప్ప లాభాలను ఆర్జించాయి. ఈ సంస్థ నిర్మించిన కొన్ని సినిమాలు: ఎ బగ్స్ లైఫ్, టాయ్ స్టోరీ 2, మాన్‌స్టర్స్.ఇన్‌క్, ఫైండింగ్ నీమో, ది ఇన్‌క్రెడిబుల్స్, కార్స్, రాటటూయి.

... పూర్తి వ్యాసం

Blog Archive