వారం వారం తెవికీ వ్యాసాలు.

Monday, October 27, 2008

మహబూబ్‌ నగర్: ఈ వారం తెవికీ వ్యాసం

మహబూబ్‌ నగర్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లోని తెలంగాణా ప్రాంతంలోని 10 జిల్లాల్లో విస్తీర్ణం పరంగా అతిపెద్దది. 18432 చ.కి.మీ. విస్తీర్ణం కల్గిన ఈ జిల్లాకు దక్షిణంగా తుంగభద్ర నది ప్రవహిస్తుంది. కృష్ణా నది కూడా ఈ జిల్లా గుండా ప్రవేశించి ఆలంపూర్ వద్ద తుంగభద్రతో కలుస్తుంది. అమ్రాబాదు గుట్టలు జిల్లా ఆగ్నేయాన విస్తరించాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా జనసంఖ్య 35 లక్షలు. ఈ ప్రాంతాన్ని పూర్వం పాలమూరు అని, రుక్మమ్మపేట అని పిలిచేవారు. డిసెంబరు 4, 1890న అప్పటి హైదరాబాదు సంస్థాన పరిపాలకుడైన ఆరవ మహబూబ్ ఆలీ ఖాన్ అసఫ్ జా పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చబడినది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూర్ వజ్రం మరియు గోల్కొండ వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు.


ఈ జిల్లాలో 1553 రెవెన్యూ గ్రామాలు, 1347 గ్రామపంచాయతీలు, 64 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 2 లోకసభ నియోజక స్థానాలు, 13 అసెంబ్లీ నియోజక వర్గ స్థానాలు (పునర్విభజన ప్రకారం 14 స్థానాలు) కలవు. ఇక్కడ వర్షపాతం తక్కువ. పనులు లేక అనేక మంది కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడం ఇక్కడ సాధారణం. అక్ష్యరాస్యత కూడా తక్కువ. సామాజిక, ఆర్థికంగా కూడా ఈ జిల్లా అభివృద్ధి చెందవలసి ఉంది.


తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఆలంపూర్ వద్ద ఐదో శక్తి పీఠంగా పేరుగాంచిన జోగుళాంబ ఆలయం, బాలబ్రహ్మేశ్వర ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ పట్టణ సమీపాన సుమారు 700 సంవత్సరాల వయస్సు కల్గిన ఒక మహావృక్షం ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. గద్వాల కోట పట్టణం నడిబొడ్డున కలదు. నల్లమల అటవీ ప్రాంతంలో ఎత్తయిన కొండలపై ఉమా మహేశ్వర క్షేత్రం శ్రీశైలం ఉత్తర ద్వారంగా భాసిల్లుతోంది. మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఆంద్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్‌నగర్ ఎంపికైనది. ఇది దేశంలోనే రెండవ పంచాయతీ సమితి.
 

Sunday, October 19, 2008

రవీంద్రనాథ్ టాగోర్: ఈ వారం తెవికీ వ్యాసం

భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ టాగోర్. తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. వంగదేశంలో 1861 మే 7వ తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు. ఇంటివద్దనే క్రమశిక్షణతో లెక్కలు, చరిత్ర, భూగోళ శాస్త్రం, చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీషు, సంగీత పాఠాలు, భౌతిక శాస్త్రం ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకొన్నాడు. మాతృభాష పట్ల అభిమానం పెంచుకొన్నాడు. ఇంగ్లాండులో ఒక పబ్లిక్ స్కూలులో చేరి, ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు విని ఆంగ్ల సాహిత్యంపై అభిరుచి పొంచుకొన్నాడు.

రవీంద్రుడు బాల్యంలోనే అనేక పద్యాలు, వ్యాసాలు, విమర్శలు ప్రచురించాడు. రవీంద్రుని రచనలలో గీతాంజలి చాల గొప్పది. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. 1913 వ సంవంత్సరంలో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని గీతాంజలికే నోబెల్ బహుమతి లభించింది. "విశ్వకవి" అనే బిరుదును సాధించి పెట్టింది. ఆసియా ఖండంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి.

రవీంద్రుడు ప్రాచీన మునుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అది అయిదుగురు విద్యార్థులతో మొదలై, క్రమంగా విస్తరించింది రవీంద్రనాధ టాగోరు డెబ్భై ఏళ్ళ ప్రాయంలో చిత్రకళా రచన ప్రారంభించాడు. ఆయన వేసిన చిత్రాలు లండను, ప్యారిస్, న్యూయార్కు వంటి నగరాలలో ప్రదర్శించబడ్డాయి. ఆయన దాదాపు రెండు వేల చిత్రాలను గీశాడు. రవీంద్రుడికి సంగీతమంటే మిక్కిలి ప్రీతి. ఆయన బెంగాల్ జానపద గీతాలను, బాపుల్ కీర్తనలను విని ముగ్ధుడయ్యేవాడు. ఆయన స్వయంగా గాయకుడు. భారతీయ సంగీతంలో రవీంద్ర సంగీతం అనే ప్రత్యేక శాఖ నేర్పర్చిన వాడు రవీంద్రుడు.

... పూర్తి వ్యాసం

Sunday, October 12, 2008

మక్కా: ఈ వారం తెవికీ వ్యాసం

మక్కాహ్ ఇస్లామీయ పవిత్ర నగరం. ఇది సౌదీ అరేబియా మక్కా క్షేత్రంలో, చారిత్రాత్మక హిజాజ్ ప్రాంతంలో ఉంది. ఈనగరంలోనే ముస్లింలకు పరమ పవిత్రమైన మస్జిద్-అల్-హరామ్ (పవిత్ర మసీదు) ఉంది. ఈ మస్జిద్ లోనే పరమ పవిత్రమైన కాబా గృహం ఉంది. హజ్ యాత్రలో ముస్లింలందరూ ఇచటనే చేరి హజ్ సాంప్రదాయం లోని 'కాబా గృహం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు. నగరం జనాభా 1,294,167. ముస్లింలు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా హజ్ యాత్రకొరకు ఈనగరానికి విచ్చేస్తారు. ముస్లిమేతరులకు ఈనగరంలోని కాబాలో మాత్రం ప్రవేశం నిషిద్ధం. ఈనగరంలో వేలాది ముస్లిమేతరుల కుటుంబాలు నివశిస్తున్నాయి.


హజ్ మరియు ఉమ్రా కొరకు గల రవాణాసౌకర్యాలు పెద్దవి. మక్కాలో విమానాశ్రయం లేదు. జెద్దాలోని '[[కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం' ద్వారా ఇక్కడికి వెళ్ళవచ్చును. మక్కాలో జనసాంద్రత ఎక్కువ. అతిప్రాచీన జనావాసం పాతబస్తీలో ఉంది. ఎక్కువమంది హజ్ పరిశ్రమ లో పనిచేసేవారే. వీరెప్పుడూ హజ్ కొరకు తయారుగా వుంటారు. ప్రతియేటా దాదాపు 40 లక్షలమంది ముస్లింలు హజ్ కొరకు మక్కా సందర్శిస్తారు


కాబాగృహం చతురస్రాకారపు నిర్మాణం, దీనిచుట్టూ మస్జిద్-అల్-హరామ్ ఉంది. దీని నిర్మాణం దాదాపు హిజ్రీ పూర్వం 3000 జరిగినది. పూర్వం కాబా గృహంలో దాదాపు 360 విగ్రహాలుండేవి. ఈ విగ్రహాలలో లాత్, మనాత్, హుబల్ మరియు దులిల్ లు ప్రసిధ్ధి. మక్కా మరియు సౌదీ అరేబియాలోగల సంచార జాతులన్నీ ఈ విగ్రహారాధన చేసేవి. 360 విగ్రహాలలో ఈసా మరియు మరియమ్ విగ్రహాలు కూడా ఉండేవని ప్రతీతి.

... పూర్తి వ్యాసం

Sunday, October 5, 2008

బంగాళదుంప: ఈ వారం తెవికీ వ్యాసం

బంగాళదుంప అనేది దుంప జాతికి చెందిన ఒక కూరగాయ. ఒక్కో ప్రాంతములో ఒక్కోక పేరుతో ఈ దుంప కూర పిలవబడుతున్నది. కొన్ని చోట్ల ఆలు గడ్డ అని లేదా ఉర్ల గడ్డ అని పిలుస్తారు. ఈ మొక్క సొలనేసి కుటుంబానికి చెందిన గుల్మము. 17వ శతాబ్దము వరకు బంగాళదుంప అనే కూరగాయ ఉన్నదని ఒక్క దక్షిణ అమెరికా ఖండంలో తప్ప మిగిలిన ప్రపంచానికి తెలియదు. స్పానిష్ వారు దక్షిణ అమెరికా ప్రాంతమును ఆక్రమించి వారి దేశానికి వలస దేశాలుగా తమ అధీనము లోనికి తీసుకువచ్చిన తరువాత, ఈ కొత్త కూరగాయ గురించి ముందు ఐరోపా వాసులకు ఆ తరువాత వారి ద్వారా ఇతర ప్రాంతములకు తెలిసింది. భారత దేశమునకు బంగాళాదుంప ఐరోపా వలసవారి నుండి వచ్చినదే. 1822వ సంవత్సరమువరకు, మనదేశములో బంగాళదుంపను ఒక పంటగా పండించలేదట. మొట్టమొదట, సల్లివాన్ అనే అంగ్లేయుడు, మద్రాసుకు దగ్గరలో తన వ్యవసాయ క్షేత్రంలో పంటగా మొదలు పెట్టాడట.


బంగాళాదుంప పంట నుండి 2006వ సంవత్సరములో మొత్తం ప్రపంచములో 315 మిలియన్ టన్నుల దిగుబడి వచ్చినది. ఈ విధంగా చూస్తే, మొత్తం పంటలలో బంగాళదుంప నాలుగవ స్థానాన్ని అక్రమిస్తుంది - వరి, గోధుమ, మొక్కజొన్న తరువాత. ఆహార పౌష్టికత పరంగా బంగాళదుంపలలో పిండి పదార్ధాలు (కార్బోహైడ్రేటులు) ప్రధానమైన ఆహార పదార్ధం. ఒక మధ్య రకం సైజు దుంపలో 26 గ్రాములు పిండిపదార్ధం ఉంటుంది. ఇది ముఖ్యంగా స్టార్చ్ రూపంలో ఉంటుంది. ఇంకా పలువిధాలైన విటమిన్‌లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. బంగాళ దుంపలో లభించే పోషక పదార్ధాల వినియోగం దానిని ఉడకపెట్టే విధానంపై బాగా ఆధారపడి ఉంటుంది. ఐక్య రాజ్య సమితి 2008 సంవత్సరాన్ని అధికారికంగా అంతర్జాతీయ బంగాళాదుంప సంవత్సరం గా ప్రకటించింది.

... పూర్తి వ్యాసం