వారం వారం తెవికీ వ్యాసాలు.

Sunday, December 28, 2008

పండ్లు: ఈ వారం తెవికీ వ్యాసం

పండ్లు చెట్టు నుండి లభించే తిను పదార్ధాలు. రకరకాల పండ్లు వివిధ రుచులలో మనకు ప్రకృతిలో లభిస్తున్నాయి. ఆవృత బీజ మొక్కలలో ఫలదీకరణం తర్వాత అండాశయం ఫలంగాను, అండాలు విత్తనాలుగాను అభివృద్ధి చెందుతాయి. ఫలంలోపల విత్తనాలు ఏర్పడడం ఆవృతబీజాల ముఖ్య లక్షణం. ఇలా ఫలాలు ఏర్పడడానికి పట్టే సమయం కొన్ని వారాల నుంచి కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది.

ఫలదీకరణ ఫలితంగా అండాశయంతో పాటు మరియే ఇతర పుష్పభాగం అయినా ఫలంగా పెరిగితే దానిని 'అనృత ఫలం' అంటారు. ఉ. ఆపిల్ లో పుష్పాసనం, జీడిమామిడి లో పుష్పవృంతం ఇలా ఏర్పడిన అనృత ఫలాలు. నిజ ఫలాలు ఫలదీకరణ చెందిన అండాశయం నుంచి ఏర్పడతాయి. నిజఫలాలలో ఫలకవచం, విత్తనాలు అనే రెండు భాగాలుంటాయి. ఒక పుష్పంలోని సంయుక్త అండకోశంలోని అండాశయం నుంచి ఏర్పడే ఫలాన్ని 'సరళ ఫలం' అంటారు.

చాలా వందల రకాల పండ్లు మనకు మంచి రుచికరమైన పోషక ఆహారము. ఉదా: మామిడి, పుచ్చ, ఆపిల్ మొదలైనవి. వీటిని కొంతమంది పండు మొత్తంగా గాని లేదా జామ్ ల రూపంలో తింటారు. పండ్ల నుండి ఐస్ క్రీమ్ లు, కేకులు మొదలైనవి తయారుచేస్తారు. కొన్ని పండ్లనుండి పానీయాలు తయారుచేసి తాగుతాము.

... పూర్తి వ్యాసం

Sunday, December 21, 2008

శ్రీకాళహస్తి: ఈ వారం తెవికీ వ్యాసం

శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లాలో ఒక పట్టణము మరియు ఒక మండలము మరియు ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ ఉండే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలు. వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం కూడా ప్రధాన ఆకర్షణే. కళంకారీ కళకు కాళహస్తి పుట్టినిల్లు.

సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్టుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మం వ్రాసిన ధూర్జటి) వంటి వారి కధలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు ఈ ఆలయ నిర్మాణానికి సహకరించారు. క్రీస్తుశకం 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపుకొన్నాడు. 1912లో దేవకోట్టై కి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుదిరూపునిచ్చారు.

ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు. ఇక్కడి అనేక శివలింగాలు బహు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్టింపబడినవిగా భావిస్తారు. ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు

... పూర్తి వ్యాసం

Sunday, December 14, 2008

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ: ఈ వారం తెవికీ వ్యాసం

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ. ఇస్రో గా ప్రసిద్ధమైన ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో ఏర్పాటైంది. బెంగుళూరు కేంద్రంగా ఏర్పాటైన ఇస్రో, దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు కలిగి ఉంది. విక్రం సారాభాయ్ని భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు పితామహుడిగా అభివర్ణిస్తారు. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధాన మంత్రి అయిన నెహ్రూకు వివరించి, 1962లో హోమీ బాబా పర్యవేక్షణలో Indian National Committee for Space Research (INCOSPAR) ఏర్పరిచాడు. కేరళలో త్రివేండ్రం వద్ద Thumba Equatorial Rocket Launching Station (TERLS) నెలకొల్పి అమెరికా, రష్యా నుండి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ అనతికాలంలోనే స్వదేశీయంగా పూర్తి స్థాయి రాకెట్లను తయారు చేసి ఉపరితల అధ్యయంలో పురోగతి సాధించారు. 1969లో ఇస్రో, అనగా Indian Space Research Organisation (ISRO), 1972లో ప్రత్యేక అంతరిక్ష విభాగం ఏర్పడ్డాయి.


భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహమయిన ఆర్యభట్టను ఏప్రిల్ 19, 1975న అప్పటి సోవియట్ యూనియన్ నుండి విజయవంతంగా ప్రయోగించారు. 1979 నాటికి శ్రీహరికోటలో ప్రయోగించిన ఉపగ్రహం రెండవ దశలో ఎదురయిన సమస్య వల్ల విజయవంతం కాలేదు. లోపాలను సరిదిద్ది 1980లో విజయవంతంగా ప్రయోగించిన రోహిణి-1 భారతదేశంలో ప్రయోగింపబడిన మొదటి ఉపగ్రహం. 1987, 1988లో చేసిన ASLV ప్రయోగాలు రెండూ విఫలమయినప్పటికీ 1992లో ASLV ప్రయోగం విజయవంతమయింది. 1993లో PSLV ప్రయోగం విఫలమయింది. తిరిగి 1994లో PSLV ప్రయోగం విజయవంతమయింది. అప్పటినుండి భారత ఉపగ్రహాలకు PSLV స్థిరమయిన వేదికగా రక్షణ, విద్యా, వ్యవసాయాలకు అవసరమయిన ఎంతో పరిజ్ఞానానికి ఆధారంగా నిలిచింది.


... పూర్తి వ్యాసం

Sunday, December 7, 2008

తెలుగు సినిమా మైలురాళ్ళు: ఈ వారం తెవికీ వ్యాసం

తెలుగులో సినిమా 1931 సంవత్సరంలో మొదలయినప్పటి నుండినేటి వరకూ అనేక వందల సినిమాలు తియ్యబడ్డాయి. అలా తీయబడ్డ సినిమాలు, ఆ సినిమాలు తీసిన దర్శకులు, అందులో నటించిన నటీనటులు-కథా నాయకీ నాయకులు, ప్రతినాయకులు, హాస్య నటులు, బాల నటులు-సంగీతాన్ని కూర్చిన సంగీత దర్శకులు, పాటలు పాడిన గాయకీగాయకులు, తెరమీద కనిపించినవారు, కనబడనివారు, ఇలా చెప్పుకుంటూ పోతే, అనేక మంది కృషితో ఇప్పుడు మన సినీ ప్రపంచం రకరకాల అంద చందాలతో అలరారుతోంది. ఇన్ని దశాబ్దాల ప్రస్థానంలో అనేక మైలు రాళ్ళు, కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి.

తొలి పాక్షిక టాకీ చిత్రం లక్ష్మీ (1930), తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద (1931), తొలి జానపద చిత్రం చింతామణి (1933), తొలి సాంఘిక చిత్రం ప్రేమ విజయం (1936), తొలి చారిత్రక చిత్రం సారంగధర (1937), తెలుగు నుండి పర భాషలోకు అనువదింపబడిన (డబ్బింగ్) తొలి చిత్రం కీలు గుర్రం (1949) తమిళంలో మాయ కుదిరై పేరుతో విడుదలైంది)

తొలి ద్విపాత్రాభినయ చిత్రం అపూర్వ సహోదరులు (1950 - రంజన్), తొలి త్రిపాత్రాభినయ చిత్రం కులగౌరవం (1972-యన్‌.టి.రామారావు), ఏకైక పంచపాత్రాభినయ చిత్రం శ్రీమద్విరాట పర్వము (1979 - యన్.టి.రామారావు), ఏకైక నవపాత్రాభినయ చిత్రం నవరాత్రి (1966- అక్కినేని నాగేశ్వరరావు). తెలుగులో అత్యధిక చిత్రాలలో నటించిన నటుడు - అల్లు రామలింగయ్య (1003 చిత్రాలు), తెలుగులో అత్యధిక చిత్రాలలో నటించిన హీరో- కృష్ణ (326 చిత్రాలు) -

మైలురాళ్ళకెల్ల మైలురాయి గిన్నీస్ బుక్. మన చలన చిత్ర నటీనటులు, దర్శకులు మరి ఇతర సాంకేతిక నిపుణులు, వారివారి నైపుణ్యంతో, ప్రతిభతో గెన్నీస్ బుక్ లోకి ఎక్కారు - విజయనిర్మల - ప్రపంచంలో ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు, దాసరి నారాయణరావు - ప్రపంచంలో 20 సంవత్సరాల నిడివిలో 100 చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు. రామానాయుడు - ప్రపంచంలో ఎక్కువ సినిమాలు (100+) నిర్మించిన నిర్మాత., రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో. బ్రహ్మానందం అత్యధిక హాస్య పాత్రలు పోషించాడు.

... పూర్తి వ్యాసం