వారం వారం తెవికీ వ్యాసాలు.

Sunday, November 22, 2009

ఘంటసాల వెంకటేశ్వరరావు: ఈ వారం తెవికీ వ్యాసం

ఘంటసాల వెంకటేశ్వరరావు (1922, డిసెంబర్ 4 - 1974) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. ఘంటసాల జన్మతః వచ్చిన గంభీరమైన స్వరముతో, మరియు పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో ఈయన తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు.

ఘంటసాల గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామములో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించాడు. సూర్యనారాయణగారు మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. ఘంటసాల భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి ఆయనను 'బాల భరతుడు ' అని పిలిచేవారు.

... పూర్తి వ్యాసం

Thursday, November 19, 2009

ఈ వారం తెవికీ వ్యాసం: హెపటైటిస్‌-బి

హెపటైటిస్‌-బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెపటైటిస్‌-బి వైరస్ ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్ హెపడ్నావైరస్ (Hepadnaviridae) కుటుంబానికి చెందిన వందల రకాల వైరస్‌లలో ఒక రకం. దీనికి సీరం హెపటైటిస్ అని ఇంకో పేరుంది. ఈ వ్యాధి ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో చాలా చోట్ల ప్రబలంగా ఉంది. ఒంట్లో హెపటైటిస్‌-బి వైరస్‌ ఉన్నవాళ్లు మన దేశంలో, మన ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 3-5% వరకూ ఉన్నట్టు అంచనాలు చెబుతున్నాయి. కాలేయానికి వాపు రావటం, వాంతులు, పచ్చ కామెర్లు ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ముదిరితే కాలేయం గట్టిబడిపోయి (liver cirrhosis) లివర్ కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది


హెపటైటిస్‌-బి వైరస్‌ శరీరంలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్దిరోజుల్లో కామెర్లు వస్తాయి. ఇలా కామెర్లు వచ్చి, హెపటైటిస్‌-బి 'పాజిటివ్‌' ఉన్న వారిలో నూటికి 99.5 మందికి ప్రాణాపాయం ఉండదు. ఈ దశలో మనం వీరికి మంచి ఆహారం, పూర్తి విశ్రాంతి ఇస్తే చాలు. ముఖ్యంగా లివర్‌ను దెబ్బతీసే మందులు వాడకూడదు. పసర్లు తాగించటం, చేతులు కాల్పించటం వంటివేమీ చెయ్యకూడదు. అంటే హెపటైటిస్‌-బి ఎంతోమందికి సోకినా కేవలం కొద్దిమందికి మాత్రమే అది ఒంట్లో నిల్వ ఉండిపోతుంది. ఇది దీర్ఘకాలిక సమస్యకు ఆరంభం! ఒకసారి హెపటైటిస్‌-బి ఉన్నట్టు తేలిందంటే వారి నుంచి అది ఇతరులకు సంక్రమించకుండా ఇంట్లోని వారంతా టీకాలు వేయించుకోవటం వంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. జీవిత భాగస్వాములకు ఈ జాగ్రత్తలు మరీ ముఖ్యం!

... పూర్తి వ్యాసం

Sunday, November 8, 2009

బోనాలు: ఈ వారం తెవికీ వ్యాసం

బోనాలు మహాకాళిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు మరియు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు)తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు.

బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము; మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా ఉంది. అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు.

... పూర్తి వ్యాసం

Monday, November 2, 2009

భారత దేశము: ఈ వారం తెవికీ వ్యాసం

భారత గణతంత్ర రాజ్యము నూటపది కోట్లకు పైగా జనాభా తో ప్రపంచం లో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. వైశాల్యము లో ప్రపంచం లో ఏడవది. భారత దేశ ప్రాముఖ్యత గత రెండు దశాబ్దాలలో గణనీయంగా పెరిగింది. భారత ఆర్ధిక వ్యవస్థ యొక్క స్థూల జాతీయోత్పత్తి( పర్చేసింగ్ పవర్ పారిటీ) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో ఇది ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము ఐన భారతదేశం, ప్రపంచం లోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగన దేశంగా ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తి] ఆవిర్భవించినది.

దక్షణాసియా లో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండము లో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారుల పైన ఉన్నది. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు ఆఫ్ఘానిస్తాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు మరియు ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. భారతదేశము కొన్ని పురాతన నాగరికతలకు పుట్టిల్లు మరియు నాలుగు ముఖ్య ప్రపంచ మతాలకు (హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము మరియు సిక్కు మతము) జన్మనిచ్చినది.

... పూర్తి వ్యాసం

Sunday, October 25, 2009

జమ్మూ & కాశ్మీరు: ఈ వారం తెవికీ వ్యాసం

జమ్మూ & కాశ్మీరు రాష్ట్రం భారతదేశంలో ఉత్తరపుకొనన, హిమాలయ పర్వతసానువుల్లో ఒదిగిఉన్న రాష్ట్రం. జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో మూడు విభాగాలున్నాయి - జమ్ము ప్రాంతం ప్రధానంగా హిందువులు ఉన్న ప్రాంతం. జమ్ము నగరం మందిరాల నగరంగా ప్రసిద్ధం; కాశ్మీరు లోయ కనులకింపైన పర్వతశ్రేణులతోనూ, సెలయేర్లతోనూ, సరస్సులతోనూ భూతల స్వర్గంగా పేరు పొందింది. ఇక్కడి శ్రీనగర్ ముఖ్య నగరం, వేసవికాలపు రాజధాని. కాశ్మీరులో ముస్లిం మతస్తులు అధిక శాతంలో ఉన్నారు; లడఖ్ హిమాలయశిఖరాల మధ్య ఉన్న పీఠభూమి . బౌద్ధ మతస్తులు ఎక్కువగా ఉన్నందున దీనిని "చిన్న టిబెట్" అంటారు.లే" ఇక్కడి ప్రధాన పట్టణం. - కాని జమ్ము-కాశ్మీరు మూడు ప్రాంతాలలోనూ హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ మతస్తులు విస్తరించి ఉన్నారు.

భారత్, పాకిస్తాన్, చైనా దేశాలమధ్య కాశ్మీరువివాదం చాలా తీవ్రమైనది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మూడు యుద్ధాలకు (1947, 1965, 1999(కార్గిల్)కాశ్మీరు వివాదమే కారణం. జమ్ము-కాశ్మీరు సంపూర్ణ రాష్ట్రం భారతదేశపు అంతర్గత భూభాగమని భారతదేశం వాదన. కాని మొత్తం రాష్ట్రంలో సగభాగం మాత్రమే ఇప్పుడు భారతదేశం ఆధీనంలో ఉన్నది. కాశ్మీరు లోయలో కొంత భాగం పాకిస్తాన్ అధీనంలో ఉన్నది. ఆక్సాయ్‌చిన్ ప్రాంతం చైనా అధీనంలో ఉన్నది. భారతదేశం అధీనంలో ఉన్న కాశ్మీరు భాగాన్ని "భారతదేశం ఆక్రమించిన కాశ్మీరు" అనీ, పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాశ్మీరు భాగాన్ని "స్వతంత్ర కాశ్మీరు" అనీ పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. ఇక పాకిస్తాన్ అధీనంలోని కాశ్మీరు భాగాన్ని "పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీరు" అని భారతదేశం వ్యవహరిస్తుంది.

... పూర్తి వ్యాసం

Monday, October 19, 2009

తిరుపతి వేంకట కవులు: ఈ వారం తెవికీ వ్యాసం

దివాకర్ల తిరుపతి శాస్త్రి (1872-1919) మరియు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు. వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంధాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి. బావా ఎప్పుడు వచ్చితీవు.., చెల్లియో చెల్లకో.., జెండాపై కపిరాజు.. వంటి పద్యాల ఆరంభ పదాలు తెలియని తెలుగువారు అరుదు.


దివాకర్ల తిరుపతి శాస్త్రి పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం వద్ద యండగండి గ్రామంలో జన్మించాడు. చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామంలో జన్మించాడు. వేంకట శాస్త్రి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వద్ద విద్యాభ్యాసం చేస్తున్నపుడు తిరుపతి శాస్త్రితో పరిచయం ఏర్పడింది. మొదటినుండీ తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేది. ఇక వేంకట శాస్త్రి పురాణ సాహిత్యాలపై ఉపన్యాసాలివ్వడంలోనూ, మెరుపులా పద్యాలల్లడంలోనూ దిట్ట. ఒకసారి వినాయక చవితి ఉత్సవాలకు చందాలు వసూలు చేయడంలో ఇద్దరూ తమ తమ ప్రతిభలను సమన్వయంగా ప్రదర్శించారు. ఒకరి ప్రతిభపై మరొకరికి ఉన్న గౌరవం వారి స్నేహాన్ని బలపరచింది. వేంకట శాస్త్రి వారాణసి వెళ్ళి తిరిగి వచ్చినాక కాకినాడ లో జంటగా శతావధానం ప్రదర్శించారు. ఆ తరువాత జీవితాంతం ఆ సాహితీ మూర్తులు ఒకరికొకరు తోడున్నారు. తిరుపతి శాస్త్రి సదా వేంకటశాస్త్రిని తన గురువుగా భావించాడు. తిరుపతి శాస్త్రి మరణానంతరం కూడా వేంకట శాస్త్రి తన రచనలను జంట రచనలుగానే ప్రచురించాడు. ఇద్దరూ కలిసి అసంఖ్యాకంగా అవధానాలు నిర్వహించారు. సన్మానాలు అందుకొన్నారు. 'ధాతు రత్నాకరం' రచించారు. అడయారు వెళ్ళినపుడు అనీబిసెంట్ ప్రశంసలు అందుకొన్నారు. వెంకటగిరి, గద్వాల, ఆత్మకూరు, విజయనగరం, పిఠాపురం సంస్థానాలు సందర్శించి తమ ప్రతిభను ప్రదర్శించి సత్కారాలు గ్రహించారు.

... పూర్తి వ్యాసం

Sunday, October 11, 2009

ఈనాడు: ఈ వారం తెవికీ వ్యాసం

ఈనాడు ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. తెలుగు పత్రికలలోనే కాక యావద్దేశంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన పత్రికలలో ఒకటిగా నిలిచింది. ప్రజల జీవితాలతో మమేకమై, సమకాలీన చరిత్రలో విడదీయరాని భాగమైపోయింది. ఈనాడు తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దిన పత్రిక. NRS 2006 సర్వే ప్రకారం 1,38,05,000 మంది పాఠకులను కలిగి, దేశంలోనే తృతీయ స్థానంలో నిలచినది.

1974 ఆగష్టు 10న రామోజీరావు విశాఖపట్నం శివార్లలోని, సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడును ప్రారంభించాడు. అదే సంవత్సరం ఆగష్టు 28 తేదీన ఈ పత్రిక రిజిస్టర్ చేయబడినది. 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది. ప్రారంభంలోనే ఈనాడుకు కొన్ని ప్రత్యేకతలుండేవి. అప్పట్లో ఉన్న అన్ని పత్రికల పేర్లు ఎక్కువగా ఆంధ్ర శబ్దంతో మొదలయేవి. పైగా ఆ పేర్లు కాస్త సంస్కృత భాష ప్రభావంతో ఉండేవి. ఈనాడు అనే అసలు సిసలైన తెలుగు పేరుతో మొదలైన ఈ పత్రిక అప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేని కొత్త అనుభవాలను అందించింది. ఆ రోజుల్లో పత్రికలు ప్రచురితమయ్యే పట్టణాలు, ఆ చుట్టుపక్కలా తప్పించి మిగిలిన రాష్ట్రం మొత్తమ్మీద పత్రికలు వచ్చేసరికి బాగా ఆలస్యం అయ్యేది; కొన్నిచోట్ల మధ్యాహ్నం అయ్యేది. అలాంటిది తెల్లవారే సరికి గుమ్మంలో దినపత్రిక అందించడమనే కొత్త సాంప్రదాయానికి ఈనాడు శ్రీకారం చుట్టింది. ఈనాడు సాధించిన విజయాలకు స్థానిక వార్తలకు అది ఇస్తూ వస్తున్న ప్రాధాన్యత ఒక కారణం.

ప్రముఖ పాత్రికేయుడైన ఎ.బి.కె. ప్రసాద్ ఈనాడుకు ప్రారంభ సంపాదకుడు. 1975 డిసెంబర్ 17హైదరాబాదు లో రెండవ ప్రచురణ కేంద్రం మొదలైంది. అలా విస్తరిస్తూ 2005 అక్టోబర్ 9 నాటికి, రాష్ట్రంలోను, రాష్ట్రం బయటా మొత్తం 23 కేంద్రాలనుండి ప్రచురితమౌతూ, అత్యధిక ప్రచురణ, ఆదరణ కల భారతీయ భాషా పత్రికలలో మూడవ స్థానానికి చేరింది.

... పూర్తి వ్యాసం

Sunday, October 4, 2009

విద్య: ఈ వారం తెవికీ వ్యాసం

విద్య, అనగా బోధన, మరియు నిర్ధిష్ట నైపుణ్యాల అభ్యసనల సమీకరణము. ఇంకనూ విశాలమైన భావంలో, పరిజ్ఞానాన్ని, ధనాత్మక తీర్పును, జ్ఞానాన్ని ఇవ్వడం. విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం, సంస్కృతిని వారసత్వాలకు అందిస్తూ సామాజకీయం జేయడం. విద్య అనగా, వెలికి తీయడం. ప్రకృతి ప్రతి మానవునికీ అంతర్-జ్ఞానాన్ని ప్రసాదించి వుంటుంది. దానిని వెలికి తీయడమే విద్య పని. విద్యారంగాలనేకం. మానసిక శాస్త్రం, తత్వ శాస్త్రం, కంప్యూటర్ శాస్త్రం, భాషాశాస్త్రం, సామాజిక శాస్త్రం మొదలగునవి.


విద్యావిధానాలు, విద్య మరియు శిక్షణ లను ఇవ్వడానికి స్థాపించబడ్డాయి. ఇవి ప్రధానంగా పిల్లలు మరియు యువకుల కొరకు స్థాపించబడ్డాయి. పిల్లలకు యువకులకు, బోధనాంశాలను నిర్ధారించి, వారి విద్యాఫలితాలను, వారి జీవిత లక్ష్యాల కొరకు ప్రతిపాదింపబడుతాయి. వీటి వలన పిల్లలు, ఏమి నేర్చుకోవాలి?, ఎలా నేర్చుకోవాలి?, ఎందుకు నేర్చుకోవాలి? అనే ప్రశ్నలు సంధించుకొనేలా జాగ్రత్తలు తీసుకొని, వారికి విద్యా బోధన ఇవ్వబడుతుంది. బోధనా వృత్తి, ఇందుకు సర్వదా సహాయపడుతూ, పిల్లలలోని అన్ని రంగాల అభివృద్ధికొరకు సహాయపడుతూ, వారికి మంచి పౌరులుగా తీర్చి దిద్దడానికి ఎల్లవేళలా సిద్ధంగా వుంటుంది. ఈ బోధనా వృత్తి, విద్యా బోధన, బోధనాంశాలు, మూల్యాంకనము మొదలగు అంశాలపై ఆధారపడి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది.

... పూర్తి వ్యాసం

Monday, September 28, 2009

బేతాళ కథలు: ఈ వారం తెవికీ వ్యాసం

బేతాళ కథలు, చందమామ మాసపత్రికలో చాలాకాలంగా ప్రచురితమవుతున్న ఒక జనప్రియ శీర్షిక. గుణాఢ్యుడు సంస్కృతములో రచించిన "బృహత్ కథ" బేతాళకథలకు మూలం. చివరి కథలో బేతాళుడి ప్రశ్నలకు విక్రమార్కుడు జవాబులు చెప్పలేకపోతాడట. అంతటితో ఆ కథలు సమాప్తమవుతాయి. అసలు బేతాళ కథలు పాతిక మాత్రమే! కాని, చందమామలో వందల కొలది మామూలు కథలను (ఇప్పటివరకు 600 పైగా) బేతాళ కథలుగా ఎంతో నేర్పుగా మార్చి ప్రచురించారు. కథా సంపుటి లేదా ధారావాహికగా మొదలు పెట్టబడినా, చివరకు ఒక కథా శీర్షికగా స్థిరపడినాయి ఈ బేతాళ కథలు. తెలుగు పత్రికా చరిత్రలో అన్ని శీర్షికలకన్న ఎక్కువకాలం ప్రచురించబడిన, ఇంకా ప్రచురించబడుతున్న శీర్షిక ఇది ఒక్కటే అయి ఉండవచ్చును.ఈ చక్కటి సాహిత్య ప్రక్రియ వెనుక ప్రసిద్ధ రచయిత, చందమామకు ఎక్కువకాలం సంపాదకుడిగా పనిచేసిన, కొడవటిగంటి కుటుంబరావు కృషి ఎంతగానో ఉన్నది.

ప్రతి మాసం ఒక సంఘటన (విక్రమార్కుడు చెట్టుమీదనుంచి శవాన్ని దించి, భుజాన వేసుకొని) తో మొదలయ్యేది, అలాగే, మరొక సంఘటన (విక్రమార్కుడికి ఆ విధంగా మౌన భంగం కాగానే, శవంలోని బేతాళుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు)తో అంతమయ్యేది. ప్రతి కథలోనూ, విక్రమార్కుడు మోస్తున్న శవంలోని భేతాళుడు, విక్రమార్కుడికి "శ్రమ తెలియకుండా విను" అని ఓ కథ చెప్పేవాడు. చివరకు, ఆ కథకు సంబంధించి చిక్కు ప్రశ్న/లు వేసేవాడు. అలా ప్రశ్నలు వేసి, విక్రమార్కుడికి ఒక హెచ్చరిక చేసేవాడు "ఈ ప్రశ్నలకి సమాధానం తెలిసీ చెప్పకపొయ్యావో, నీ తల వెయ్యి వక్కలవుతుంది" అని. మౌనం వీడితే వ్రత భంగం అయ్యి, వచ్చినపని చెడుతుంది, సమాధానం తెలిసీ చెప్పకపోతే ప్ర్రాణానికి ప్రమాదం. పాపం విక్రమార్కుడు ఏం చేస్తాడు? తప్పని పరిస్థితులలో, తన మౌనం వీడి, ఆ చిక్కు ప్రశ్నకు చాలా వివరంగా జవాబు చెప్పేవాడు. ఈ విధంగా ప్రతినెలా శవంలోకి బేతాళుడు ప్రవేశించి, కథ చెప్పి, ప్రశ్నలడిగి, హెచ్చరించి, విక్రమార్కుడికి మౌన భంగం చేసి, అతడు వచ్చిన పని కాకుండా చేసేవాడు. అలా పై నెలకి కథ మొదటికి వచ్చేది. బేతాళ కథలకు మొదటి పేజీలో వేసే బొమ్మ చాలా సార్లు మార్చి మార్చారు. అలాగే కథ చివరి పుటలో, బేతాళుడు ఎగిరి పోతూ ఉండటం, విక్రమార్కుడు కత్తి దూసి వెంట పడుతుండటం కూడా చాలా రకాలుగా వెయ్యబడింది.

... పూర్తి వ్యాసం

Tuesday, September 22, 2009

భట్టిప్రోలు స్తూపం: ఈ వారం తెవికీ వ్యాసం

ప్రతీపాలపురం, ప్రితుడనగరం, పిటిండ్రలు మొదలగు పేర్లు కల భట్టిప్రోలు ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో విశిష్టమైన స్థానాన్ని కలిగిఉంది. సముద్రతీరానికి సమీపములో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్న భట్టిప్రోలు ప్రపంచ బౌద్ధారామాలలో ప్రముఖమైన క్రీ.పూ. 4-3 శతాబ్దాల నాటి స్తూపం కలిగి ఉంది. గౌతమ బుద్ధుడు, మహావీరుడు లాంటి మహనీయులు ఇక్కడ దర్శించారని చరిత్రకారులు భావిస్తున్నారు. క్రీ.శ. 130 ప్రాంతంలో టాలమీ వర్ణించిన జౌళి పరిశ్రమకు, వాణిజ్యానికి కేంద్రస్థానమైన పిటిండ్ర నగరం భట్టిప్రోలేననే అభిప్రాయం చరిత్రకారులలో బలంగా ఉంది. క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందిన జైన కవి నయనసేనాని వ్రాసిన ధర్మామృత' కావ్యములోని క్రీ.పూ. 5వ శతాబ్దికి చెందిన కథలో ప్రతీపాలపుర ప్రసక్తి ఉంది. శాసనముల ఆధారముగా భట్టిప్రోలు ప్రాంతాన్ని కుబేరకుడు అనే రాజు పాలించాడు.

కాలగర్భంలో కలిసిపోయిన భట్టిప్రోలు బౌద్ధ స్తూప ప్రాశస్త్యం క్రీ. శ. 1870 నుండి వెలుగులోనికి రాసాగింది. బాస్వెల్ (1870), వాల్టర్ ఎలియట్ (1871), నారిస్ (1872, రాబర్ట్ సెవెల్ (1882), అలెగ్జాండర్ రే (1892), బుహ్లర్ (1894), రాయప్రోలు సుబ్రహ్మణ్యం (1969) మొదలగువారి కృషివల్ల అమూల్యమైన చారిత్రక నిక్షేపాలు బయల్పడ్డాయి. లంజ దిబ్బ, విక్రమార్కకోట దిబ్బ అని పిలువబడే మట్టిదిబ్బలు తవ్వగా స్తూపము, కోట గోడలు కనపడ్డాయి. 1700 చదరపు గజాలు స్తూప ఆవరణ, 148 అడుగుల మేధి వ్యాసం, 32 అడుగుల అండం వ్యాసం, 40 అడుగుల ఎత్తు, 8 అడుగుల విశాలమైన ప్రదక్షిణాపథం, 45 X 30 X 8 సె.మీ పరిమాణముగల ఇటుకలతో కట్టబడిన స్తూపం బయల్పడింది. భట్టిప్రోలు స్తూపము ధాతుగర్భము. అనగా బుద్ధుని ధాతువులపై నిర్మించబడినది. స్తూపం మధ్య అమూలాగ్రంగా రంధ్రం ఉన్నది. రంధ్రము చుట్టూ ఇటుకలను పద్మాకారములో అమర్చారు. రంధ్రంలో స్తూపాగ్రాన ఉండే ఛత్రపుకాడను అమర్చారు. రంధ్రముగుండా మూడు బండరాతి పేటికలు (శిలా మంజూషికలు) లభించాయి.

... పూర్తి వ్యాసం

Wednesday, September 16, 2009

తెలుగు వికీపీడియా అకాడమీ (జాలంలో)

ఈ విధమైన వికీపీడియా అకాడమీ సెషన్‌ని జాలంలో ఒకదాన్ని నిర్వహించాలని వీవెన్‌గారు అనుకుంటున్నారు. ఇవీ వివరాలు:
  • వేదిక: chat.etelugu.org
  • సమయం: సెప్టెంబర్ 19, 2009 శనివారం ఉదయం 10:00 నుండి 11:00 వరకు

మీకు తెలుగు వికీపీడియాకి తోడ్పడాలని ఉన్నా లేదా అందులోని సమాచారాన్ని వాడుకోవాలని ఉన్నా (వికీపీడియాని వాడటం, ఉదాహరణకి వ్యాసం రాసేప్పుడు ఫార్మాటింగు గట్రా, తెలియకపోయినా) లేదా వికీకి సంబంధించిన ఇతర విషయాలపై సందేహాలు ఉన్నా ఈ అకాడమీ సెషనుకి రండి. మీ సందేహాలకు సమాధానాలిచ్చేందుకు, తెవికీ నిర్వాహకులు మరియు క్రియాశీల సభ్యులు ఈ సెషనులో పాల్గొంటారు. ఈ సెషనులో పాల్గొని, ప్రేరణ పొంది తెవికీని మెరుగుపరచడానికి ముందుకొస్తారని ఆశిస్తున్నాను.

కొన్ని ఉపయోగకరమైన లింకులు:

పూర్తి వివరాలు మరియూ సందేగనివృత్తి కోసం క్రింది లింకులను చూడండి:

Sunday, September 13, 2009

చికమగలూరు_జిల్లా: ఈ వారం తెవికీ వ్యాసం

చిక్‌మగళూరు (కన్నడ:ಚಿಕ್ಕಮಗಳೂರು) భారతదేశం లోని కర్ణాటక రాష్ట్రం లోని ఒక జిల్లా మరియు పట్టణం. భారతదేశం లోనే మొట్టమొదటిగా చిక్‌మగళూరులో కాఫీ తోటలు పెంచబడ్డాయి. చిక్‌మగళూరు జిల్లాలో ఉన్న పశ్చిమ కనుమల పర్వతశ్రేణులలో తుంగ మరియు భద్ర నదులు పుడుతున్నాయి. ఈ జిల్లాలోనే ఉన్న ముల్లాయనగిరి పర్వత శ్రేణులు కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ఎత్తులో ఉన్న పర్వతశ్రేణులు. ప్రకృతి రమణీయ దృశ్యాలు కలిగిన కెమ్మనగుండి మరియు కుద్రేముఖ్ కొండలు, మాణిక్యధార, కల్లథిగిరి జలపాతాలు పర్యాటకుల నేత్రాలకు విందు కలిగిస్తాయి. శంకరాచార్యులు అద్వైత ప్రచారం కోసం స్థాపించిన శారదా పీఠం ఈ జిల్లాలో ఉన్న శృంగేరిలో ఉన్నది. ఆ తరువాతి కాలంలో భారతీ కృష్ణ తీర్థ స్వామిచే తన ముందు పీఠాధిపతి అయిన విద్యాశంకర స్వామి స్మారక నిమిత్తం నిర్మించబడిన విద్యాశంకర దేవాలయం కూడా శృంగేరిలో ఉన్నది. దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పెద్ద సామ్రాజ్యాలలో ఒకటైన హొయసల రాజులు అమృతపురలో నిర్మించిన హొయసల దేవాలయం ఈ జిల్లాలోనే ఉన్నది. వన్యప్రాణి సంరక్షణ మీద ఆసక్తి ఉన్నవారు ఈ జిల్లాలో ఉన్న కుద్రేముఖ్ జాతీయ వనం, భద్ర అభయారణ్యం దర్శించి తీరవలసిందే.

జిల్లాకి చిక్‌మగళూరు పేరు జిల్లా రాజధాని చిక్‌మగళూరు పట్టణం నుండి వచ్చింది. చిక్‌మగళూరు అంటే కన్నడ భాష లో చిన్న కూతురు ఊరు అని అర్థం (చిక్క=చిన్న, మగ=కూతురు, ఊరు=ఊరు). సేక్రపట్న రాజైన రుక్మాంగద చిన్న కూతురుకు కట్నంగా ఇవ్వబడడం వల్ల ఈ పట్టణానికి చిక్‌మగళూరు అని పేరు వచ్చిందని చెబుతారు.

... పూర్తి వ్యాసం

Saturday, September 12, 2009

ఈ వారం తెవికీ వ్యాసం: వై.యస్. రాజశేఖరరెడ్డి

ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి 1949, జూలై 8న కడప జిల్లాలోని పులివెందులలో జన్మించారు. 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి ఇప్పటివరకు మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నికకాగా, 4 సార్లు కడప లోకసభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టారు. పోటీచేసిన ప్రతీసారి విజయం సాధించడం ఆయన ప్రత్యేకత. జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయంసాధించిన తొలి ఎన్నికల (1978) వెంటనే మంత్రిపదవి పొందినాడు. వెనువెంటనే ముఖ్యమంత్రులు మారినప్పటికీ ముగ్గురు ముఖ్యమంత్రుల మంత్రిమండలిలో స్థానం సంపాదించారు. ఆ తరువాత చాలా కాలం పాటు అధికారం దక్కలేదు. 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు. 1999లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించాడు. 2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర మరియు ఉచిత విద్యుత్ ప్రచారం వారి విజయానికి బాటలు పరిచింది. 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డిగారికి దక్కింది. ఆయన సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో దుర్మరణం పాలయ్యారు.

... పూర్తి వ్యాసం

Sunday, August 30, 2009

భారతీయ రైలు రవాణా వ్యవస్థ: ఈ వారం తెవికీ వ్యాసం

భారతీయ రైల్వేలు, ఒక భారత ప్రభుత్వ విభాగము. ఇది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పని చేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర రైల్వే మంత్రి (కేబినెట్ హోదా) నిర్వహణలో ఉండే రైల్వే విభాగం, రైల్వే బోర్డు కింద పని చెస్తుంది. భారతీయ రైల్వేలు కార్పొరేట్ సంస్థ కానప్పటికీ ఈ మధ్య కాలంలో కార్పొరేట్ నిర్వహణ శైలిని అలవర్చుకొంటోంది. భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛ్ఛత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. ఇది ప్రతి రోజూ ఒక కోటీ అరవై లక్షల ప్రయాణీకులను గమ్యం చేరుస్తూండడమే కాక మరో పది లక్షల మెట్రిక్ టన్నుల సరుకులను కూడా రవాణా చేస్తోంది. భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను (సుమారు పదహారు లక్షలు)కలిగి వున్న సంస్థగా రికార్డుని నెలకొల్పింది.

రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి వున్నాయి. ఈ మార్గాల మొత్తం దూరం సుమారుగా 63,140 కి.మీ (39,233 మైళ్ళు). సం,2002 నాటికి రైల్వేల వద్ద 2,16,717 వాగన్లు, 39,263 కోచ్ లు, 7,739 ఇంజిన్లు వున్నాయి. భారత రైల్వే ప్రతి రోజూ 14,444 రైళ్ళను నడుపుతూండగా అందులో 8,702 పాసెంజర్ రైళ్ళు.


భారత దేశంలో 1851 ఏప్రిల్ 16న మొదటి రైలు పనిచెయ్యడం మొదలుబెట్టింది. రూర్కీలో కట్టుబడి సామాగ్రిని మోసేందుకు దాన్ని వాడారు. కొన్నేళ్ళ తరువాత, 1853 ఏప్రిల్ 16బాంబే లోని బోరి నందర్, ఠాణాల మధ్య -34 కి.మీ.దూరం - మొట్టమొదటి ప్రయాణీకుల రైలును నడిపారు మొదటిసారిగా సం.1853 లో ప్రవేశపెట్టబడ్డాయి. సం.1947(స్వతంత్రం వచ్చే)నాటికి దేశంలో మొత్తం42 రైల్వే సంస్థలు నెలకొల్పబడి వున్నాయి. సం.1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే, ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించింది. భారత రైల్వే దూర ప్రయాణాలకు మరియు నగరాలలో దగ్గరి ప్రయాణాలకు అవసరమైన రైళ్ళను నడుపుతోంది.


మొత్తం రైలు మార్గము సుమారు 108,706 కీ.మీ.(67,547 మైళ్ళు). ఈ మార్గాలని వేగం అధారముగా (75 కీ.మీ/గం నుండి 160కీ.మీ/గం లేదా 47 మైళ్ళు/గం నుండి 99 మైళ్ళు/గం) విభజించారు. భారతీయ రైలు మార్గాన్ని బ్రాడ్ గేజ్ (స్టాండర్డ్ గేజ్ కంటే వెడల్పైనది – 4  అడుగులు 8½  అంగుళాలు (1,435 మిల్లీ మీటర్లు)); మీటర్ గేజ్; మరియు నారో గేజ్ (స్టాండర్డ్ గేజ్ కంటే తక్కువ). భారత దేశములో అత్యధిక రైలు మార్గం బ్రాడ్ గేజ్. సుమారు 86,526 కీ.మీ (53,765 మైళ్ళు)ల బ్రాడ్ గేజ్ రైలు మార్గం కలదు. రద్దీ తక్కువ ఉన్న ప్రాంతాలకు మీటర్ గేజ్ (1,000 మీ.మీ. (3.28 ft) రైలు మార్గాన్ని నిర్మించారు. ప్రస్తుతం అన్ని మార్గాలను బ్రాడ్ గేజ్ గా మార్చే పనులు జరుగుతున్నాయి. కొండ ప్రాంతాలలో ఉన్న రైలు మార్గాలను నారో గేజ్ మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గాలను బ్రాడ్ గేజ్ గా మార్చడం చాలా కష్టం. మొత్తం నారో గేజ్ రైలు మార్గం 3,651 కీ.మీ (2,269 మైళ్ళు).

... పూర్తి వ్యాసం

Monday, August 24, 2009

వర్షం: ఈ వారం తెవికీ వ్యాసం

వర్షం లేదా వాన ఆకాశంలోని మేఘాల నుండి భూతలం పైకి నీటి బిందువుల రూపంలో కురిసే ఒక రకమైన అవపాతం. ఆకాశం నుండి కురిసిన వర్షమంతా భూమికి చేరదు. కొంత శాతం వర్షం పొడి గాలి గుండా పడుతుంటూనే గాలిలో ఆవిరైపోతుంది. కురిసిన వర్షం మొత్తం భూమికి చేరకపోవటాన్ని విర్గా అంటారు. ఈ ప్రక్రియ తరచూ ఉష్ణోగ్రత హెచ్చుగా, వాతావరణం పొడిగా ఉండే ఎడారి ప్రాంతాలలో కనిపిస్తుంది. వర్షం ఎలా సంభవిస్తుంది మరియు ఎలా కురుస్తుంది అన్న వాటికి శాస్త్రీయ వివరణను బెర్గెరాన్ ప్రక్రియ అంటారు.

జలచక్రములో వర్షం ప్రధాన పాత్ర పోషిస్తుంది. సముద్రాల నుండి నీరు ఆవిరై, ఆ తేమ తిరిగి ఆకాశములో ధ్రవీభవించి బుడగలలాగా ఏర్పడిన అవపాతము ఆకాశానికి తేలుతుంది. ఆ అవపాతము వర్షముగా కురుస్తుంది. వర్షము పడిన అవపాతాన్ని తిరిగి సముద్రానికి చేర్చి నదులు ఈ చక్రాన్ని పూర్తి చేస్తాయి. మొక్కలు పీల్చుకున్న నీటిని శ్వాస క్రియలో ఆవిరిగా వాతావరణంలోకి వదులుతాయి. అలా వదిలిన ఆవిరి ఇతర నీటి అణువులను చేరి నీటి బిందువులుగా యేర్పడతాయి. సాధారంగా వర్షాన్ని అవపాత పరిమాణం మరియు అవపాతానికి కారణం అన్న రెండు అంశాలతో వర్గీకరిస్తారు.

అవపాతం, అందునా వర్షం వ్యవసాయన్ని చాలా ప్రభావితం చేస్తుంది. అన్ని మొక్కలకూ జీవించటానికి కొంతైనా నీరు అవసరం. వర్షం అత్యంత సులువైన నీరు అందజేయు పద్ధతి కాబట్టి, ఇది వ్యవసాయానికి చాల ఉపయోగకరమైనది. సాధారణంగా ఒక క్రమ పద్ధతిలో తరచూ పడే వర్షాలు మొక్కలు ఆరోగ్యముగా పెరగటానికి అవసరం కానీ అతివృష్టి, అనావృష్టి రెండూ పంటలకు ముప్పును కలుగజేస్తాయి. అన్ని దేశాలలో వ్యవసాయం ఎంతోకొంత వరకైనా వర్షంపై ఆధారపడుతుంది. భారతీయ వ్యవసాయ రంగము వర్షంపై భారీగా ఆధారపడి ఉన్నది. ముఖ్యంగా పత్తి, వరి, నూనెదినుసులు మరియు ముతక ధాన్యం పంటలు అతి ఎక్కువగా వర్షంపై ఆధారపడుతున్నవి. ఋతుపవనాలు కొన్ని రోజులు ఆలస్యమైనా, అది దేశ ఆర్ధికరంగాన్ని విపరీతంగా దెబ్బతీస్తుంది.

... పూర్తి వ్యాసం

Monday, August 17, 2009

చతుర్వేదాలు: ఈ వారం తెవికీ వ్యాసం

చతుర్వేదాలు హిందూమతం లో అత్యంత మౌలికమైన ప్రమాణంగా గుర్తిస్తారు. వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములు (ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య) అనీ కూడా అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదానికి నిగమము (అనాదిగా వస్తున్న నిర్ధారితమైన మూల గ్రంథము) అని కూడా పేరుంది.

మొదట కలగలుపుగా ఉన్న వేదాలను వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడనీ, కనుకనే ఆయన వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. అలా నాలుగు వేదాలు మనకు లభించాయి. (1) ఋగ్వేదము (2) యజుర్వేదము (3) సామవేదము (4) అధర్వణవేదము. వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి బోధించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అన్ని వేదాలూ కలిపి 1180 అధ్యాయాలు, లక్షపైగా శ్లోకాలు ఉండాలని అంటారు. కాని ప్రస్తుతం మనకు లభించేవి 20,023 మాత్రమే.

మళ్ళీ ఒక్కొక్క వేదంలోను నాలుగు ఉపవిభాగాలున్నాయి. మొదటి రెండింటిని "కర్మకాండ" అనీ, తరువాతి రెండింటిని "జ్ఞానకాండ" అనీ అంటారు. అవి -

  1. మంత్ర సంహిత:ఇది వేదాలలోని మంత్రభాగం. స్తోత్రాలు, ఆవాహనలు ఇందులో ఉంటాయి. అన్నింటికంటే ఋగ్వేదసంహిత అత్యంత పురాతన, ప్రముఖ గ్రంథము. యజుర్వేదసంహిత ఎక్కువగా వచనరూపంలో ఉంది. ఋగ్వేద మంత్రాలకు అనుబంధంగా ఇది ఉంటుంది.
  2. బ్రాహ్మణము: సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు. ఇది గృహస్తులకు ఎక్కువగా వినియోగపడుతుంది.
  3. ఆరణ్యకము: అనగా అడవులకు సంబంధించిన విషయాలు. వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి. కాని వీటిలో కర్మలయొక్క భౌతిక భాగం ఉండదు. కర్మలవెనుక ఉన్న నిగూఢమైన తత్వాలమీది ధ్యానానికి ఆరణ్యకాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి.
  4. ఉపనిషత్తులు - ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వీటిలో 108 ముఖ్యమైనవి.

యజ్ఞ నిర్వహణలో నలుగురు పురోహితులుంటారు. (1) హోత: ఋగ్వేదంలోని స్తోత్రాలను పఠించేవాడు. (2) అధ్వర్యుడు: యజుర్వేదంలో చెప్పిన ప్రకారం యజ్ఞకర్మలను యధావిధిగా నిర్వహించేవాడు. (3) ఉద్గాత: సామగీతాలను గానం చేసేవాడు. (4) బ్రహ్మ: అధర్వణ వేద పండితుడు. యజ్ఞాన్ని పర్యవేక్షించేవాడు.

... పూర్తి వ్యాసం

Sunday, August 9, 2009

ఛత్రపతి శివాజీ: ఈ వారం తెవికీ వ్యాసం

ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - మార్చి 4, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. నిజాంషాహీలపైన షాజహాన్ దండయాత్ర చేసినపుడు షాహాజి సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్‌రావ్ అనే మరాఠా యోధున్ని నిజాంషాహీ ప్రభువు హత్య చేయించాడు. ఇది నచ్చని షాహాజీ నిజాంషాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు. షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా, మొఘలులు ఆదిల్షాతో కలసి షాహాజీని ఓడించారు. ఆదిల్షాతో సంధి ప్రకారం షాహాజి ప్రస్తుత బెంగుళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది, పూణే వదిలి వెల్లవలసి వచ్చింది. షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవలసిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకొన్నాడు.


షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడయిన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్దులు నేర్పింది. చిన్నప్పటినుండి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింప చేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ద తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకొన్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలు పెట్టాడు.

... పూర్తి వ్యాసం

Monday, August 3, 2009

గోవా: ఈ వారం తెవికీ వ్యాసం

గోవా భారతదేశంలో పశ్చిమతీరాన అరేబియా సముద్రం అంచున ఉన్నది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా అంటారు. ఇది దేశంలో వైశాల్యపరంగా రెండవ అతిచిన్న రాష్ట్రం. జనాభా పరంగా నాలుగవ అతిచిన్న రాష్ట్రం. గోవా రాజధాని పనజీ. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకొన్నారు. కొద్దికాలంలోనే అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకొన్నారు. 450 ఏండ్ల తరువాత, 1961లో భారత ప్రభుత్వం గోవాను తన అధీనంలోకి తీసుకొన్నది. చక్కని బీచిలు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపద - ఇవన్నీ కలిపి గోవా మంచి పర్యాటక కేంద్రంగా కావడానికి తోడ్పడ్డాయి. ఈ ప్రాంతానికి మహాభారతంలోనూ, ఇతర ప్రాచీన గ్రంధాలలోనూ గోపరాష్ట్రం, గోవరాష్ట్రం, గోపకపురి, గోపక పట్టణం, గోమంచాల, గోవపురి వంటి పేర్లు వాడబడినాయి. ఆప్రాంత అనే పేరు కూడా వాడబడింది.


1498లో వాస్కో డ గామా కేరళ లో కోజికోడ్‌లో అడుగుపెట్టాడు. తరువాత అతడు గోవా చేరాడు. సుగంధ ద్రవ్యాల వ్యాపారమే పోర్చుగీసు వారి అప్పటి లక్ష్యము. కాని 1501 లో తిమ్మయ్య అనే స్థానిక రాజు తరపున పోరాడి అల్ఫోంసో డి అల్బుకర్క్ అనే పోర్చుగీసు అడ్మిరల్ బహమనీ రాజులనోడించాడు. గోవాను తమ నావలకు స్థావరంగా చేయాలనేది వారి అభిమతం. బ్రిటిష్‌వారు వచ్చిన తరువాత పోర్చుగీసు అధికారం గోవాకు, మరి కొద్ది స్థలాలకు పరిమితమైనది. పోర్చుగీసు వారికి గోవా విలువైన విదేశీ స్థావరమైనది. పోర్చుగీసు నుండి వచ్చినవారు ఇక్కడ స్థిరపడడం, స్థానికులను పెండ్లాడడం జరిగింది. 1843లో రాజధాని పాత గోవా నుండి పనజీకి మార్చారు. 1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా గోవాను వదులుకోవడానికి పోర్చుగీసువారు ఒప్పుకొనలేదు. 1961 డిసెంబరు 12న భారత సైన్యం గోవాలో ప్రవేశించి, గోవాను ఆక్రమించింది. కొద్దిపాటి ఘర్షణ తరువాత డామన్, డయ్యులు కూడా భారతదేశం అధీనంలోకి వచ్చాయి. కాని 1974 వరకు పోర్చుగీసు ప్రభుత్వం గోవాను భారతదేశంలో అంతర్భాగంగా అంగీకరించలేదు. 1987 మే 30న గోవాను కేంద్రపాలిత ప్రాంతంగా కాక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచారు. ఇది భారతదేశంలో 25వ రాష్ట్రం అయ్యింది.


పడమటి కనుమలులోని కొంకణ తీరాన ఉన్న గోవాకు 101 కి.మీ. సముద్ర తీరము ఉన్నది. మాండవి, జువారి, తెరెఖోల్, ఛపోరా, బేతుల్అనేవి గోవాలోని నదులు. జువారి నది ముఖద్వారాన ఉన్న మార్ముగోవా నౌకాశ్రయం మంచి సహజ నౌకాశ్రయం. జువారి, మాండవి నదులు, అంతటా విస్తరించిన వాటి ఉపనదులు గోవాలో మంచి నీటి వసతి, రవాణా వసతి కలిగించాయి. ఇంకా కదంబ రాజులు తవ్వించిన 300పైగా పాతకాలపు చెరువులు, 100 పైగా ఔషధిగుణాలున్న ఊటలు ఉన్నాయి. గోవా నేల ఎక్కువ భాగం ఖనిజలవణాలుగల ఎర్రనేల. లోపలి నదీతీరాలలో నల్లరేగడి నేల ఉన్నది. గోవా, కర్ణాటక సరిహద్దులలో మోలెమ్, అన్‌మోడ్ల మధ్యనున్న శిలలు భారత ఉపఖండంలోన అత్యంత పురాతనమైనవాటిలోకి వస్తాయి. కొన్ని శిలలు 3,600 మిలియన్ సంవత్సరాల పురాతనమైనవని గుర్తించారు.

... పూర్తి వ్యాసం

Monday, July 27, 2009

చార్లీ చాప్లిన్: ఈ వారం తెవికీ వ్యాసం

చార్లీ చాప్లిన్ ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఒక హాస్య నటుడు. ఒక విభిన్నమైన కళాకారుడు. అనేక కళల్లో నిష్ణాతుడైన ఒక ప్రసిద్ధ బహురూపి. అమాయకునిలా తెర మీద కనిపించే చాప్లిన్, హాస్వోత్రేరక వ్యక్తిలా అనిపించే చార్లీ, నిజానికి చాలా చక్కనివాడు, అందగాడు. ఆశ్చర్యాన్ని గొలిపే రచయిత , చక్కని రచయిత, చక్కని గాయకుడు. యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతిప్రియుడు. అన్నిటికీ మించిన ప్రపంచకారుడు. ఛార్లీ చాప్లిన్ దయార్థ్ర హృదయుడు. అందానికి ఆరాధకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచాద్భుతాల్లో ఒకడు.

ప్రధానంగా హాస్య నటుడైనా హాస్యాన్ని మించిన ఒక పరమార్థాన్ని , ఒక సార్వజనీనతను అతడు తన చిత్రాలలో సాధించాడు. పాంటోమైమ్ , క్లౌనింగ్, మైమింగ్ , బర్లెస్క్, పేరడీ, శ్లాప్‌స్టిక్ - వీటన్నిటిని అతడు మాస్టర్ చేశాడు. ఒక చిత్రమైన బ్రష్‌లాంటి మీసకట్టు, బిగుతైన కోటు, వదులు ప్యాంటు, పెద్ద సైజు బూట్లు, చేతిలో వంకీ కర్ర, వంకరటింకర నడక - ఇవీ అతని సరంజామా. తనకు తాను ఒక పాత్రను ట్రాంప్ పాత్రను సృష్టించుకున్నాడు. ట్రాంప్ అంటే దేశద్రిమ్మరి. ఇవాళ ఇక్కడ వుంటాదు, రేపు మరో చోట. అతడికి ఊరూ పేరూ లేదు. అన్ని ఊర్లూ అతనివే , అన్ని పేర్లూ అతనివే.

అతని అజరామర కీర్తికి అధార చిత్రాలలో ఒకటి 1921 నాటి " కిడ్ " . దానిలో అనాథ బాలుడుగా జాకీ కూగన్, అతడిని సాకి చివరికి అసలు తల్లికి అప్పగించవలసి వచ్చిన పెంపుడు తండ్రిగా చాప్లిన్‌ల నటన చిరస్మరణీయమైనది. ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో (1940) తీసిన గ్రేట్ డిక్టేటర్‍లో చాప్లిన్ హిట్లర్‍ను అద్భుతంగా సెటైర్ చేశాడు. కాని కేవలం సెటై‍ర్ చేయడంతోనే సరిపెట్టక నియంతల క్రూర దారుణ నిరంకుశత్వం నుంచి మానవుడిని విముక్తుడిని చేయగల ఆశావాదాన్ని పురికొల్పే ప్రయత్నం చేశాడు.

... పూర్తి వ్యాసం

Sunday, July 19, 2009

భారత నావికా దళం: ఈ వారం తెవికీ వ్యాసం

భారత రక్షణ వ్యవస్థలో భాగమయిన భారత నావికా దళం (ఇండియన్ నేవీ) 55,000 సిబ్బందితో ప్రపంచంలో నాలుగవ అతి పెద్ద నావికా దళం. కేవలం దేశరక్షణకే కాకుండా మానవతా సహాయాలకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సహాయం కొరకు భారత ప్రభుత్వం నేవీని వినియోగిస్తుంది.

5,000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న భారతదేశంలో కీస్తు పూర్వం, 2300లో ప్రస్తుత గుజరాత్‌లోని మంగ్రోల్ దగ్గర మొట్టమొదటి నౌకాతీరం నిర్మించబడినది. క్రీ.పూ. 4వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యంలో మొదటిసారి నౌకా విభాగాన్ని ఏర్పరిచారు. చంద్రగుప్త మౌర్యుడి ప్రధానమంత్రి అయిన చాణక్యుడు తాను రచించిన అర్థశాస్త్రంలో 'నవాధ్యక్ష' (నౌకల నిర్వాహకుడు) పేరుతో నదీజలాల వినియోగం గురించి నిర్దేశించాడు. చుట్టూ ఉన్న దేశాలతో రాకపోకలకు, పలు రకార సంస్కృతులకు ఈ జలదారులు ప్రధాన కారణం. భారతదేశ చరిత్రలో మౌర్య, శాతవాహన, చోళ, విజయనగర, కళింగ, మరాఠా మరియు మొఘల్ సామ్రాజ్యాల నౌకా వ్యవస్థలు పేరెన్నికగన్నవి.

బ్రిటీషు ప్రభుత్వం భారతదేశాన్ని పాలిస్తున్నపుడు ది బ్రిటీష్ ఇండియన్ నేవీని ఏర్పరిచారు. ఇది 1946 నాటికి 78 ఓడలు 2,000 సిబ్బంది కలిగి ఉండేది. జనవరి 26, 1950న భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చిన రోజున నౌకాదళానికి ఇండియన్ నేవీగా , వాహకాలకు ఇండియన్ నావల్ షిప్స్ (INS) గా పేరు పెట్టారు.

... పూర్తి వ్యాసం

Sunday, July 12, 2009

మామిడి: ఈ వారం తెవికీ వ్యాసం

మామిడి (Mango) : అనకార్డియేసి కుటుంబానికి చెందిన మామిడికి, 25-30 మిలియన్ సంవత్సరాల పూర్వీకం, నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది. దీని జన్మస్థలం దక్షిణాసియా దేశాలైన భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు బర్మా. ఇది ఉష్ణదేశపు పండ్ల చెట్టు. గరిష్ట ఎత్తు 120 అడుగులు, ముప్పై(30)అడుగుల వ్యాసం వరకు విస్తరించి కిరీటం ఆకారంలో ఉంటుంది. పుష్పించడం పూర్తి ఐన తరవాత కాయలు రూపు దిద్దుకొని మూడు(3)నుండి ఆరు(6)మాసాలలో పక్వానికి వస్తాయి. ప్రపంచం మొత్తం 38.7 లక్ష హెక్టేర్లలో సాగుబడి వుండగా అందులో భారత్ 16 లక్షల హెక్టార్లలో సాగుబడి చేస్తోంది.

ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితులలో కూడా పండిస్తూ ఉన్నారు భారతద్వీపకల్పం అంతటా, కరీబియన్(Caribbean), మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు అసియా, మధ్య మరియు దక్షిణ ఆఫ్రికా దేశాలలోను పండిస్తున్నారు. దీనిని ఎక్కవగా తాజాగానే తింటారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడిచెట్టుని ఇంటి పెరటిలో చూడావచ్చు. తాజా మామిడి పండులో పదిహేను శాతం(15%)చక్కెర, ఒక శాతం(1%) మాంసకృత్తులు మరియు గుర్తించ తగిన మోతాదులో ఎ,బి,సి(A,B,C) విటమిన్లు ఉంటాయి. మామిడిపండు ఎక్కవగా తియ్యగా ఉన్నా కొన్నిజాతుల పండు కొంచంపుల్లగా ఉంటుంది. కొన్ని పండ్లు పీచు, ఎక్కువ రసంతో ఉంటాయి. వీటిని రసాలు అంటారు. కొన్ని కరకర లాడే కందడతో ఉంటాయి వీటిని మల్ గోవా మామిడి అంటారు. బంగినపల్లి ఎక్కువ తీయగా మెత్తటి కండ కలిగి ఉంటాయి. నీటిశాతం ఎక్కువ కనుక రసభరితంగా ఉంటాయి. కాయలతో దీర్గ కాలం నిలవ ఉండే పచ్చళ్ళు(ఊరగాయలు), చట్నీ, ఆమ్‌చూర్, మామిడి తాండ్ర లు తయారు చేస్తారు. మామిడి రసాన్ని బాటిల్స్, ప్యాక్ ల రూపంలో వ్యాపారసంస్థలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మిల్క్ షేక్, లస్సీ, ఐస్‌క్రీం, ఫ్రూట్‌సలాడ్ ఇంకా అనేక నోరూరించే రకాలు.



... పూర్తి వ్యాసం

Sunday, July 5, 2009

హనుమంతుడు: ఈ వారం తెవికీ వ్యాసం

హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు హనుమంతుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుడిని ఆరాధిస్తారు. సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా కొలవబడే ఆంజనేయుని గుడులు లేని ఊరు ఆంధ్ర ప్రదేశ్ ‌లో ఉండటం అరుదు. ఆంధ్రలోనేగాక, భారతదేశం యావత్తూ మరియు దేశవిదేశాలలోనూ హనుమంతుని దేవాలయాలు కానవస్తాయి. హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు, వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎర్రని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకమును హరించినవాడు. ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుకవచ్చి యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడు.

శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలిజోడించి ఉంటాడు. ఇంకా వివిధ సందర్భాలలో హనుమంతుని గురించి చెప్పబడిన వర్ణనలు: రామాయణ మహామాలా రత్నము, జితేంద్రియుడు, శ్రీరామదూత, జానకీశోక నాశకుడు, జ్ఞానగుణ సాగరుడు, హనుమాన గోసాయి, సంకట హారి, మంగళమూర్తి. రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాధలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాధలున్నాయి. పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను. శ్రీరాముని దేవాలయంలో సీతారాముల ఎదురుగా చేతులు మోడ్చిన హనుమంతుడు ప్రతిష్టింపబడడం సాధారణం. ఇలా రామాలయాలు అన్నీ హనుమంతుని ఆలయాలే అనవచ్చును. హనుమంతుని వివిధ నామస్తోత్రాలు, భజనలు, పాటలు చాలా ఉన్నాయి.

... పూర్తి వ్యాసం

Sunday, June 28, 2009

చైనా మహా కుడ్యము: ఈ వారం తెవికీ వ్యాసం

ప్రాచీన, మధ్యయుగపు మరియు నేటి ఏడు ప్రపంచవింతలలో ఒకటిగా పరిగణింపబడుతూ, చూపరులకు ఆశ్చర్యచకితులను చేసే చైనా లో గల అతి పొడవైన కుడ్య నిర్మాణమే ఈ చైనా మహా కుడ్యము. దీని పొడవు 6,508 కి.మీ. లేదా 4,000 మైళ్ళు. నిజానికి ఇదో గోడల సమూహము. క్రీ.పూ. 5, 6 శతాబ్దాల కాలంలో ప్రారంభించబడి, క్రీ.శ. 16 శతాబ్దం వరకూ పునర్నిర్మాణాలకు లోనై, నేటికీ నిలిచి ఉంది. దీనిలోని ప్రసిద్ధమైన గోడ చైనా చక్రవర్తి "క్విన్ షీ హువాంగ్" చే క్రీ.పూ. 220 - 200 కాలంలో నిర్మింపబడింది. దీని నిర్మాణానికి కారణం చైనా ఉత్తర సరిహద్దుల నుంచి దండయాత్రలను అరికట్టుట. ఆధునిక కాలంలో కనిపించే గోడ 'మింగ్ వంశ' కాలంలో నిర్మింపబడింది.

క్రీ.పూ. 7వ శతాబ్దకాలంలో చైనీయులకు ఈ కుడ్యనిర్మాణ సాంకేతికాలన్నీ తెలుసు. చైనాలో అంతర్-రాజ్య యుద్ధకాలమైన క్రీ.పూ.5వ శతాబ్దం నుండి క్రీ.పూ. 221 వరకు, "క్వి", "యాన్", మరియు "ఝావో" రాజ్యాలమధ్య, వారి వారి సరిహద్దులను కాపాడుకోవడానికి కోటలకు గోడవలె పటిష్ఠ శత్రు దుర్భేద్య కుడ్యాలను నిర్మించారు

ఈ కుడ్యానికి చెందిన బీజింగ్ ఉత్తర ప్రాంతం, మరమ్మత్తులు పునర్నిర్మాణాలకు నోచుకొని, పర్యాటకుల కేంద్రంగా విరాజిల్లుచున్నది. దీని ఇతర ప్రాంతాలు కుడ్యశిథిలాలతో, గ్రామ ఆటస్థలములుగానూ వీటి ఇటుకలు రాళ్ళు పల్లెవాసుల ఇండ్ల కట్టడాలకు దురుపయోగమౌతున్నవి. ఈ కుడ్యపు అనేక భాగాలునూ దురుపయోగం పాలౌతున్నవి. వీటి గూర్చి సరైన చర్యలు తీసుకోవడం లేదు. మరీ ముఖ్యంగా లోపలి ప్రాంతాలలో దీనిపై సరైన నిఘాలేదు.

రాబోవు 20 సంవత్సరాలలో 'గాన్సూ' రాష్ట్రంలోని ఈ కుడ్యభాగం 60 కి.మీ. కంటే ఎక్కువ భాగం అంతరించిపోయే ప్రమాదముంది. దీనికి కారణాలు దుమ్ము తుఫానులు మరియు ఇసుక తుఫానులు. ఈ ప్రాంతాలలో దీని ఎత్తు 5 మీటర్ల నుండి 2 మీటర్లకు కుదించుకుపోయింది.

... పూర్తివ్యాసం

Sunday, June 21, 2009

కేరళ: ఈ వారం తెవికీ వ్యాసం

కేరళ భారత దేశంలో నైరుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రము. క్రీ.పూ.10 వ శతాబ్దంలో ద్రావిడ భాషలు మాట్లాడే వారు ఇక్కడ స్థిరపడ్డారు. మౌర్య సామ్రాజ్యం లో భాగంగా ఉండేది. తరువాతి కాలంలో చేర సామ్రాజ్యంలోను, భూస్వామ్య నంబూదిరిల పాలనలోను ఉంటూ వచ్చింది. విదేశాలతో ఏర్పరచుకుంటున్న సంబంధాలు చివరకు స్థానికులకు, ఆక్రమణదారులకు మధ్య ఘర్షణలకు దారితీసాయి. మూడో ప్రపంచ దేశాల్లోనే అత్యధిక అక్షరాస్యత ఉన్న, అత్యంత ఆరోగ్యకరమైన ప్రాంతంగా కేరళ నిలిచింది.

14 వ శతాబ్దపు తొలినాళ్ళకు, భాష పరంగా కేరళ ప్రత్యేకతను సంతరించుకుంది. ఆధారాలు లభించిన మొదటి సామ్రాజ్యం - చేర వంశీకులు - వంచి రాజధానిగా కేరళను పాలించారు. పల్లవుల తో కలిసి వారు చోళ, పాండ్య రాజులతో యుద్ధాలు చేసారు. 8- 14 శతాబ్దాల మధ్యకాలంలో చేరరాజుల పాలనా సమయంలో మళయాళం భాష అభివృద్ధి చెందింది. ఆదే సమయంలో కేరళీయులు తమిళప్రజలలో భాగంగా కాక ఒక ప్రత్యేకమైన జాతిగా గుర్తింపు ఏర్పడింది. లిఖితంగా కేరళ గురించిన ప్రస్తావన సంస్కృత ఇతిహాసం ఐతరేయారణ్యకంలో మొదటిగా లభిస్తున్నది. తరువాత కాత్యాయనుడు, పతంజలి, పెద్దప్లినీల వ్రాతలలోనూ, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ గ్రంధంలోనూ కేరళ ప్రస్తావనలున్నాయి.

1947లో భారతదేశం స్వతంత్రమైనాక 1941 జూలై 1న తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థానాలను కలిపి తిరువాన్కూర్-కొచ్చిన్ ఏర్పరచారు. 1950 జనవరి 1న దీనిని ఒక రాష్ట్రంగా గుర్తించారు. ఇదే సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీని మద్రాసు రాష్ట్రం చేశారు. 1956 నవంబరు 1న, రాష్ట్రపునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేరళ రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు ప్రెసిడెన్సీనుండి మలబార్‌ప్రాంతాన్ని (4 తాలూకాలు మినహా) వేరుచేసి తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్రంలో కలిపారు. 1957లో క్రొత్త అసెంబ్లీ ఎన్నిల అనంతరం ఇ.ఎమ్.ఎస్.నంబూద్రిపాద్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికలద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడం అనేది ప్రపంచంలోనే మొదటి వాటిలో ఇది ఒకటి.

కేరళ జంతుసంపదలో వైవిధ్యం, స్థానికత్వం గమనించదగిన విషయాలు. తీవ్రమైన పర్యావరణ వినాశనం (అడవల నరికివేత, చరియలు విరగడం, ఉప్పుపట్టడం, ఖనిజసంపద త్రవ్వకం వంటివి) వల్ల కేరళలోని ఈ జంతుసంపద మనుగడకు ప్రమాదం వాటిల్లుతున్నది.

... పూర్తి వ్యాసం

Monday, June 15, 2009

కందుకూరి వీరేశలింగం పంతులు: ఈ వారం తెవికీ వ్యాసం

కందుకూరి వీరేశలింగం పంతులు సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు. సాహితీ వ్యాసంగంలోనూ అంతటి కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. ఆయన జీవితం సంఘసంస్కరణ, సాహిత్య కృషిలతో పెనవేసుకు పోయింది. ప్రభుత్వంలోని అవినీతిని ఏవగించుకుని ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని, అబద్ధాలు ఆడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్న వ్యక్తి.

బాల్య వివాహాల వ్యతిరేకంగా, కుల నిర్మూలనకు అకుంఠిత దీక్షతో పనిచేసాడు. ఆయన చేసిన ఇతర సంస్కరణా కార్యక్రమాలొక ఎత్తు, వితంతు పునర్వివాహాలొక ఎత్తు. 1881 డిసెంబరు 11న తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం చేశారు. సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించాడు. పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, మరియు ఆయన విద్యార్ధులు వీరేశలింగానికి అండగా నిలిచారు. ఆయన భార్య రాజ్యలక్ష్మమ్మ భర్తకు బాసటగా ఉంది. వంటవాళ్ళు, నీళ్ళవాళ్ళు వారి ఇంటికి రావడానికి నిరాకరించినపుడు రాజ్యలక్ష్మమ్మ స్వయంగా గోదావరికి వెళ్ళి నీళ్ళు తెచ్చి పెళ్ళివారికి వంట చేసిపెట్టింది.

వీరేశలింగం సాహిత్యంలోనూ అంతే కృషి జరిపాడు. చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. వివేకవర్ధనిలో సులభశైలిలో రచనలు చేసేవాడు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకరు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ కలవాడు. 130కి పైగా గ్రంధాలు రాసాడు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంధాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు రాసాడు. స్వీయ చరిత్ర రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు. సంగ్రహ వ్యాకరణం రాసాడు. నీతిచంద్రిక లోని సంధి, విగ్రహం భాగాలను చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం పూర్తి చేసాడు.

... పూర్తి వ్యాసం

Sunday, June 7, 2009

ఫుట్‌బాల్: ఈ వారం తెవికీ వ్యాసం

ఫుట్‌బాల్, ఒక జట్టు క్రీడ. దీని అసలు పేరు అసోషియేషన్ ఫుట్‌బాల్. ఇందులో జట్టుకు 11 మంది ఆటగాళ్లు ఉంటారు. ప్రపంచంలో అతి విరివిగా అడబడే ఆట ఇది దీర్ఘచతురస్రాకార మైదానాలలో ఈ ఆట ఆడుతారు. మైదానానికి ఇరు చివర్ల లక్ష్యాలుంటాయి (గోల్ పోస్టులు). బంతిని లక్ష్యానికి చేర్చి స్కోరు చెయ్యడం ఆట ప్రధాన లక్ష్యం. బంతిని చేతితో తాకు హక్కు గోలుకీపరుకు మాత్రమే వుంటుంది. మిగిలిన ఆటగాళ్ళందరూ, బంతిని కాలితో తన్నడం, తలతో కొట్టడం, లేక ఛాతీతో నియంత్రించడం చేస్తుంటారు. నియంత్రిత సమయం లో ఎక్కువ సార్లు లక్ష్యాన్ని ఛేధించిన జట్టు విజేత. ఇరు జట్లు సమాన సంఖ్యలో గోలులు చేస్తే పోటీ బట్టి ఆట డ్రాగా పరిగణించబడడం, లేక అధిక సమయంలోకి తీసుకు వెళ్ళడం జరుగుతుంది.

అత్యున్నత స్థాయిలో జరుగు ఆటలలో సగటున రెండు మాడు గోలులు మాత్రమే చేయబడతాయి. ఆట నియమాల ప్రకారం ఆటగాళ్ళందరి స్థానాలు నియంత్రించబడి లేవు. గోలి తప్పు మిగిలిన ఆటగాళ్ళు మైదానంలో యదేఛ్చగా తిరగవచ్చు. కాని కాల గమనంతో ఫుట్‌బాలులో చాలా స్థితులు రూపుదిద్దుకున్నాయి. ఇందులో ముఖ్యంగా మూడు రకాల స్థితులున్నాయి: స్ట్రైకర్లు, ముందు వరుస వారు, (గోలులు చేయడం వీరి ప్రత్యేకత); రక్షకులు (వీరు ప్రత్యర్ధులు గోలు చేయకుండా చూడాలి); మరియు మైదాన మధ్యులు, బంతిని తమ జట్టు అధీనంలో వుంచడం, దానిని గోలు చేయవలసిన ముందువరుస వారికి అందించడం వీరి కర్తవ్యం. వీరిని గోలీ నుండి గుర్తించడానికి మైదానఆటవారు (అవుట్ ఫీల్డర్స్) గా సంబోధిస్తారు. ఆడువారు ఆడు చోటు ప్రకారం, ఈ స్థితులని ఇంకా విభజించి సంబోధించడం జరుగుతుంది. ఉదా- ఎడమ రక్షకులు, కుడి రక్షకులు వగైరా. పది మంది మైదాన ఆటవారిని ఏ విధానంగా నైనా అమర్చడం జరుగుతుంది. ప్రతి వరుసలో ఎంత మంది ఆటవారు వున్నదీ, జట్టు ఆడు తీరును రూపు దిద్దుతుంది. ఎక్కువ మంది ముందువరుస వారు, తక్కువ రక్షకులు వున్నప్పుడు, గోలు చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నట్టు ఆడుతున్నవారు.


ఆధికారిక ఆట నియమాలు పదిహేడు వున్నవి. ఇవే ఆట యొక్క అన్ని స్థాయిల్లోనూ వర్తిస్తాయి. పిల్లలు మహిళలకోసం వీటిని అప్పుడప్పుడూ స్వల్పంగా మార్చడం జరుగుతుంది. ఈ పదిహేడు నియమాలతో బాటు అనేక IFAB నిర్దేశాలు ఆటని నియంత్రిస్తాయి. ఆట నియమాలను ఫీఫా ప్రచురించినప్పటికీ అవి IFAB పర్యవేక్షణలోనే వున్నాయి.

... పూర్తి వ్యాసం

Sunday, May 31, 2009

మహాసముద్రము: ఈ వారం తెవికీ వ్యాసం

మహా సముద్రం లేదా మహాసాగరం, భూగోళం యొక్క జలావరణంలో ప్రధాన భాగం. ఉప్పు
నీటితో నిండిన ఈ మహా సముద్రాలు భూమి ఉపరితలము పై 71% పైగా విస్తరించి
ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం 36.1 కోట్ల చదరపు కిలో మీటర్లు. ప్రపంచం
సముద్ర జలాలలో దాదాపు సగ భాగము 3,000 మీటర్లు (9,800 అడుగులు) ఫైగా
లోతైనవి. సరాసరి మహాసముద్రాల 'సెలైనిటీ' (ఉప్పదనం) దాదాపు వెయ్యికి 35
వంతులు (3.5%). మహాసాగరాలన్నీ కలిసి ఉన్నా గాని వ్యావహారికంగా ఐదు వేరు
వేరు మహాసాగరాలుగా గుర్తిస్తారు. అవి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్
మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం మరియుదక్షిణ
మహాసముద్రం. ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయిన పెద్ద నీటి భాగాలు. కనుక
దీనిని ప్రపంచ మహాసముద్రం అని చెప్పవచ్చును

మహా సముద్రాలలో కొన్ని చిన్న భాగాలను సముద్రాలు, సింధుశాఖలు అని అంటారు.
అధికంగా అక్కడి భూభాగం లేదా దేశం లేదా ప్రాంతం బట్టి ఈ సముద్రాల,
సింధుశాఖల పేర్లు ఉంటాయి. కొన్ని జలాశయాలు పూర్తిగా భూమిచే చుట్టబడి
ఉంటాయి. (అంటే ఇతర సముద్రాలతో కలసి ఉండవు). కాస్పియన్ సముద్రం, అరల్
సముద్రం, గ్రేట్ సాల్ట్ లేక్ ఈ కోవలోకి వస్తాయి. నిజానికి ఇవి పెద్ద
ఉప్పునీటి సరస్సులే గాని సముద్రాలు కాదు. భౌగోళికంగా మహాసముద్రం అంటే
భూగోళంపై నీటితో కప్పబడిన "సముద్రపు అడుగు". (ఓషియానిక్ క్రస్ట్).

మొత్తం ప్రపంచ సముద్ర ఉపరితల వైశాల్యం 361 మిలియన్ చదరపు కిలోమీటర్లు.
మొత్తం ఘన పరిమాణం షుమారు 1,300 మిలియన్ క్యూబిక్ కిలోమీటర్లు. సరాసరి
లోతు 3,790 మీటర్లు పురాతన కాలంనుండీ మానవుడు సముద్రాలపై
ప్రయాణిస్తున్నప్పటికీ సముద్రాల నీటి అడుగుకు వెళ్ళడం ఇటీవల కాలంలోనే
సాధ్యమయ్యింది. ప్రపంచంలో అన్నింటికంటే లోతైన ప్రదేశం మెరియానా ట్రెంచ్.
ఇది పసఫిక్ మహాసముద్రంలో ఉత్తర మెరియానా దీవులు ప్రాంతంలో ఉంది. దీని
అత్యధిక లోతు 10,923 మీటర్లు (35,838 అడుగులు). ఇప్పటికీ సముద్రాంతరతలం
చాలావరకు అన్వేషించబడలేదు.

పూర్తి వ్యాసం

Blog Archive