వారం వారం తెవికీ వ్యాసాలు.

Monday, January 26, 2009

ఎయిడ్స్: ఈ వారం తెవికీ వ్యాసం

ఎయిడ్స్ (AIDS) ఒక ప్రాణాంతకమయిన వ్యాధి. ఇది హెచ్ఐవి Human immunodeficiency virus (HIV) అనే వైరస్ వలన సంభవిస్తుంది. AIDS అనేది Acquired Immune Deficiency Syndrome (ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోం)కు పొడి నామము. హెచ్ఐవి వైరస్ మనుషులలో రోగనిరోధక శక్తిని తగ్గించివేస్తుంది. హెచ్ఐవిలో హెచ్ అనేది హ్యూమాన్‌ని సూచిస్తుంది, అంటే ఈ వైరస్ మనుషులకు మాత్రమే సోకుతుంది.

శాస్త్రఙుల అంచనా ప్రకారం హెచ్ఐవి వైరసు సోకిన మొదటి వ్యక్తి ఆఫ్రికా ఖండంలోనే ఉండాలి. ఇది 1915, 1941ల మధ్య జరిగి ఉండవచ్చునని ఊహిస్తున్నారు. అప్పట్లో అక్కడ చింపాంజీలకు ఎస్ఐవి(SIV)సోకుతూ ఉండేది, ఇది హెచ్ఐవిగా రూపాంతరం చెంది మనుషులకు సోకటం ప్రారంభించింది అని చెబుతారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం జూన్ 18, 1981న అమెరికాలో మొదటి ఎయిడ్స్ కేసు నమోదయింది. దీనిని మొదట స్వలింగ సంపర్కం వల్ల వచ్చే జబ్బుగా పొరబడ్డారు. కాని వచ్చిన కేసులలో సగంపైగా స్వలింగ సంపర్కం కానివారు కావటం వలన అందరికీ వచ్చే జబ్బుగా తరువాత నిర్ధారణకు వచ్చారు.

ప్రస్తుతానికయితే ఎయిడ్స్‌ని పూర్తిగా నిర్మూలించటానికి ఎటువంటి మందు కానీ టీకా కానీ తయారు చేయలేదు. కానీ దాని తీవ్రతని తగ్గించటానికి మందులు ఉన్నాయి, అవి కొంచెం ఖరీదయినవే. కొన్ని హెచ్ఐవి వైరసులు కొన్ని మందులను తట్టుకోగలవు. అందుకని వాటి చికిత్సకు ఒకేసారి రెండు మూడు రకాల మందులను వాడుతూ ఉంటారు. అందుకనే వాటిని హెచ్ఐవి కాక్‌టెయిల్ అని పిలిస్తారు. అయితే హెచ్ఐవీ చాలా తొందరగా మందులను తట్టుకునే సామర్ధ్యం పెంచేసుకుంటున్నాయి. కొన్నయితే ఒకటి కంటే ఎక్కువ మందులను తట్టుకోగలుగుతున్నాయి. కాబట్టి శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు హెచ్ఐవితో పోరాడటానికి కొత్త కొత్త మందులను కనిపెడుతూనే ఉన్నారు.

... పూర్తి వ్యాసం

Sunday, January 18, 2009

కుషాణు సామ్రాజ్యం: ఈ వారం తెవికీ వ్యాసం

కుషాణు సామ్రాజ్యం క్రీ.శ. 1వ శతాబ్దం - 3వ శతాబ్దం మధ్య కాలంలో విలసిల్లింది. దాని ప్రాభవ కాలంలో, షుమారు క్రీ.శ.250 నాటికి, ఆ సామ్రాజ్యం ప్రస్తుత తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాల నుండి ఉత్తర భారతదేశంలోని గంగానది పరివాహక ప్రాంతమంతా విస్తరించింది. ఈ సామ్రాజ్యం పాలకులు మొదట యూజీ అనే ఇండో-యూరోపియన్ తెగకు చెందిన పశ్చిమచైనా ప్రాంతంవారు. కుషాణులకు రోమన్ సామ్రాజ్యంతోను, పర్షియా సస్సానిద్ సామ్రాజ్యంతోను, చైనాతోను రాజకీయ సంబంధాలుండేవి. తూర్పు, పశ్చిమ భూముల మధ్య సాస్కృతిక, ఆర్ధిక, రాజకీయ మేళవింపులకు కుషాన్ సామ్రాజ్యం ఒక ముఖ్యమైన కేంద్రం అయ్యింది.

చైనాలో లభించిన సమాచారం ప్రకారం కుషాన్ మూలపదం గ్విషువాంగ్ (చైనా భాషలో: 貴霜) అనేది యూజీ (月氏) జాతికి చెందిన ఐదు రాజకుటుంబాలలో ఒకటి. ఇది ఒక ఇండో- యూరోపియన్ జాతి. బహుశా వీరి భాష తొచారిన్ భాషకు చెందినది కావచ్చును. వీరు క్రీ.పూ. 176 - 160 మధ్యకాలంలో జొయోగ్ను వారి దాడుల వలన మరింత పడమర దిక్కుకు వెళ్ళిఉంటారు. తరువాతి శతాబ్దంలో (క్రీ.పూ. 1వ శతాబ్దం) గ్విషాంగ్ జాతివారు తక్కిన యూజీజాతులవారిపై నాయకత్వం సాధించి, వారందరినీ ఒక బలమైన సంఘంగా రూపొందించారు. ఈ దశలో గ్విషాంగ్ నాయకుడు కుజులా కాడ్‌ఫైసిస్. ఈ గ్విషాంగ్ పదమే పాశ్చాత్య దేశాలలో కుషాన్గా వ్యవహరింపబడింది. కాని చైనాలో మాత్రం యూజీ పదం కొనసాగింది. క్రమంగా వారు తక్కిన సిథియన్ జాతులనుండి అధికారాన్ని హస్తగతం చేసుకొని దక్షిణాన గాంధార దేశం అనబడే ప్రాంతానికి విస్తరించారు. ఈ గాంధార దేశంలో ప్రస్తుత పాకిస్తాన్‌యొక్క పోతోవార్, వాయువ్య సరిహద్దు, కాబూల్ లోయ, కాందహార్ ప్రాంతాలు ఉండేవి. అలా కనిష్కులు అప్పటిలో "కాప్సియా" (ఇప్పటి కాబూల్) మరియు "పుష్కలావతి" (ఇప్పటి పెషావర్)లలో జంట రాజధానులను స్థాపించారు.

... పూర్తి వ్యాసం

Sunday, January 11, 2009

అసోం: ఈ వారం తెవికీ వ్యాసం

అసోం ("అస్సాం") ఈశాన్య భారతదేశము లోని ఒక రాష్ట్రం. దీని రాజధాని డిస్పూర్. హిమాయల పర్వత సానువుల్లో ఉన్న ప్రాంతము చూట్టూ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర మరియు మేఘాలయ మొదలైన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. ఆంగ్ల అక్షరము T ఆకారములో ఉండే ఈ రాష్ట్రము భౌగోళికముగా మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఉత్తరాన బ్రహ్మపుత్ర నదీలోయ, మధ్యన కర్బి మరియు చాచర్ కొండలు మరియు దక్షిణాన బరక్ లోయ. అసోం రాష్ట్రములో మార్చి నుండి సెప్టెంబర్ వరకు భారీ వర్షాలు కురుస్తాయి. వేసవి నెలల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణముగా అన్ని కాలాల్లోనూ మితముగా ఉంటాయి.

అస్సాంలో జీవ సంపద, అడవులు మరియు వణ్యప్రాణులు పుష్కలముగా ఉన్నాయి. ఈ ప్రాంతములో అనేక అభయారణ్యాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది, అరుదైన భారతీయ ఖడ్గమృగానికి ఆలవాలమైన కాజీరంగా జాతీయ వనము. వన్య ప్రాణులు, అడవులు, వృక్షసంపద, నదులు మరియు జలమార్గాలు అన్నీ ఈ ప్రాంతాకి ఎంతో ప్రకృతి సౌందర్యాన్ని తెచ్చుపెడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతున్నాయి. అతివృష్టి, చెట్ల నరికివేత, మరియు ఇతరత్రా కారణాల వల్ల ప్రతి సంవత్సరం వరదలు సంభవించి విస్తృత ప్రాణ నష్టము, ఆస్తి నష్టము వాటిల్లడమే కాకుండా జీవనోపాధికి ముప్పు జరుగుతున్నది.

అస్సామీ ఆచార వ్యవహారాలలో గమోసా కు ఒక విశిష్టమైన స్థానముంది. ఇది ఒక దీర్ఘ చతురస్రాకారపు గుడ్డ. మూడు ప్రక్కల ఎరుపుగాని, వేరే రంగులో గాని అంచు ఉంటుంది. నాలుగవ ప్రక్క అల్లిక అంచుగా ఉంటుంది. గమోసాను ఎన్నో విధాలుగా వాడుతారు. రైతులు మొలగుడ్డగా వాడుతారు. బిహూ నాట్యకారులు చిత్రమైన ముడివేసి తలగుడ్డగా వాడుతారు. ప్రార్ధనా సమయంలో మెడలో వేసుకొంటారు. సమాజంలో ఉన్నతిని తెలుపుకొనే విధంగా భుజాన వేసుకొంటారు. బిహు పండుగకు పెద్దవారికి గమోసాలు సమర్పించుకోవడం ఆనవాయితీ. ఏదయినా భక్తిగా, ఆదరంగా భావించే వస్తువును నేలమీద పెట్టరు. ముందుగా గమోసా పరచి, దానిపై ఉంచుతారు. అన్ని మతాలువారూ గమోసాను ఇదే ఆదరంతో దైనందిన జీవితంలో వాడుతారు


... పూర్తి వ్యాసం

Sunday, January 4, 2009

సంక్రాంతి: ఈ వారం తెవికీ వ్యాసం

సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 14 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.

... పూర్తి వ్యాసం