వారం వారం తెవికీ వ్యాసాలు.

Sunday, February 22, 2009

గంగా నది: ఈ వారం తెవికీ వ్యాసం

గంగా నది భారతదేశం, మరియు బంగ్లాదేశ్ లలో ప్రధానమైన నదుల్లో ఒకటి. భారతదేశం ఆర్ధిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడిపడి ఉన్నాయి. హిందూమతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది. "గంగమ్మ తల్లి" అనీ, "పావన గంగ" అనీ, "గంగా భవాని" అనీ ఈ నదిని హిందువులు స్మరిస్తారు. "నీరు" అన్న పదానికి సంస్కృతంలో "గంగ" అన్న పదాన్ని వాడుతారు.

గంగా నది మొత్తం పొడవు షుమారు 2,510 కి.మీ.(1,557 మైళ్ళు). గంగ, దాని ఉపనదియైన యమున కలిసి విశాలమైన మైదానప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. సారవంతమైన ఈ "గంగా-యమునా మైదానం" ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్‌లలో విస్తరించి ఉన్నది. ఉత్తరాంచల్ రాష్ట్రం పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమానీనదం (Glacier)లో భాగీరధి నది ఉద్భవిస్తున్నది. ప్రవాహ మార్గంలో దేవ ప్రయాగ వద్ద అలకనందనది దీనితో కలుస్తుంది.అక్కడినుండి దీనిని "గంగ" అంటారు. కొంత దూరం హిమాలయాలలో ప్రహించిన ఈ నది హరిద్వారం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తున్నది.

హిందూ మతం ఆచారాల ప్రకారం గంగానది పవిత్రమైనది. పావనం చేసేది. ఒక్కమారు గంగానదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలనుండి విముక్తి లభిస్తుందని, చనిపోయే ముందు గంగా జలం మింగితే స్వర్గప్రాప్తి నిశ్చయమనీ నమ్మకం. చనిపోయిన తమ కుటుంబీకుల అస్తికలను గంగానదిలో నిమజ్జనం చేయడానికి దూరదూరాలనుండి వారాణసికి, గయకు, ప్రయాగకు, ఇతర గంగానదీ తీర్ధాలకు వస్తారు. గంగా నది జలాన్ని ఒక చిన్న పాత్రలో ఇంటిలో ఉంచుకోవడం శుభప్రదమని భావిస్తారు.

మొత్తం ప్రపంచ జనాభాలో 8.5 % ప్రజలకు (ప్రతి 12 మందికీ ఒకరికి) ఈ మైదానం నివాసస్థానం. ఈ కారణంగా ఈ ప్రాంతంలో తీవ్రమైన ఆర్ధిక, పర్యావరణ, సాంఘిక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. జనసాంద్రత అధికంగా ఉన్న ప్రదేశాలు గంగానదికి ఇరువైపులా ఉన్నందున, చుట్టుప్రక్కల కాలుష్యాన్ని విడుదలచేసే అనేక పరిశ్రమలు ఉండడం వలన, గంగానదీ జలాలు తీవ్రమైన కాలుష్యానికి గురవుతున్నాయి. కాన్పూరు వంటి నగరాలలోని రసాయనిక పరిశ్రమలు, తోలు పరిశ్రమలు, ఇందుకు ఒక ముఖ్య కారణం. అందుకు తోడు ప్రజల గృహాలనుండి వెలువడే మురుగునీరు రోజూ 100 కోట్ల లీటర్లు గంగలో కలుస్తున్నాయని అంచనా. ఈ పరిస్థితిని నివారించడానికి అడపా దడపా కొన్ని చర్యలు తీసుకొన్నారు గాని ఫలితాలు చాలా కొద్ది స్థాయిలో ఉన్నాయి.
... పూర్తి వ్యాసం

Monday, February 16, 2009

ఆంధ్ర ప్రదేశ్: ఈ వారం తెవికీ వ్యాసం

ఆంధ్ర ప్రదేశ్ భారతదేశంలో నాలుగవ అతి పెద్ద రాష్ట్రం. దీనికి ఉత్తరాన మహా/aరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ. 1953, అక్టోబర్ 1 న తొలుత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డపుడు కర్నూలు, రాష్ట్ర రాజాధానిగా ఉండేది. 1956, నవంబర్ 1న రాజధాని హైదరాబాదు కు మార్చబడింది.

ఆంధ్రులు వింధ్యపర్వత దక్షిణ భాగానికి తరలి వెళ్ళి, ద్రావిడులతో కలసిన ఆర్యులుగా క్రీ.పూ. 7వ శతాబ్దపు సంస్కృత రచనలు వర్ణిస్తున్నాయి. క్రీ. పూ. 5వ శతాబ్దములో ప్రతీపాలపురం (భట్టిప్రోలు) రాజధానిగా కుబేరక అను రాజు పాలన చేస్తున్నాడని ఆధారాలు దొరికాయి. మహావీరుడు, గౌతమ బుద్ధుడు ధాన్యకటకము (అమరావతి) సందర్శించారనడానికి ఆధారాలున్నాయి. మౌర్య చక్రవర్తి అశోకుని మరణానంతరం (క్రీ.పూ 232) ఆంధ్రులు వెలుగులోకి వచ్చారు. నవీన చరిత్రకారులు ఆంధ్రుల చరిత్ర ఆనాటినుండి మొదలైనట్లుగా లెక్కిస్తున్నారు. ఆంధ్ర (శాతవాహన (ఇంకా రాయలేదు)">శాతవాహన), శక, పల్లవ, ఇక్ష్వాకు, తెలుగు చోళ, తూర్పు చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్ షాహి, హైదరాబాదు నిజాం లు మొదలైన వంశాలకు చెందిన రాజులు ఆంధ్ర దేశాన్ని పరిపాలించారు. క్రీ.శ 17వ శతాబ్దములో బ్రిటీషు వారు కోస్తా ఆంధ్రను నిజామ్ వద్ద గెలుచుకొని మద్రాసు రాష్ట్రములో (మద్రాసు ప్రెసిడెన్సీ) కలుపుకున్నారు. హైదరాబాదు నిజామ్ బ్రిటిషు ఆధిక్యతను గుర్తించి తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనాడు.

నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి. 1982 వరకు అన్నీ కాంగ్రెసు ప్రభుత్వాలే ఆంధ్ర ప్రదేశ్ ను పరిపాలించాయి. 1982 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలము పనిచేశాడు. ఆయన తరువాత పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేసాడు. తరువాతి కాలంలో ఆయన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసాడు.ఆంధ్ర ప్రదేశ్ లో మూడు ముఖ్య ప్రాంతములు కలవు: కోస్తా ఆంధ్ర, తెలంగాణ మరియు రాయలసీమ. రాష్ట్రములో 23 జిల్లాలు కలవు. హైదరాబాదు, రాష్ట్ర రాజధాని మరియు అతి పెద్ద నగరము. ఇతర ముఖ్య నగరాలు విజయవాడ, విశాఖపట్నం,తిరుపతి,కర్నూలు, కడప, వరంగల్లు, గుంటూరు. గోదావరి, కృష్ణ వంటి మహానదులు రాష్టంలో ప్రవహిస్తూ కొన్ని లక్షల హెక్టేరుల భూమి సాగు చేయుటకు తోడ్పడుతున్నాయి.

... పూర్తి వ్యాసం

Sunday, February 8, 2009

అనిల్ కుంబ్లే: ఈ వారం తెవికి వ్యాసం

అనిల్ కుంబ్లే (కన్నడ:ಅನಿಲ್‌ ರಾಧಾಕೃಷ್ಣ ಕುಂಬ್ಳೆ) భారతదేశపు ప్రముఖ క్రికెట్ బౌలర్. 1970 అక్టోబర్ 17కర్ణాటక లోని బెంగుళూరు లో జన్మించిన అనిల్ కుంబ్లే పూర్తి పేరు అనిల్ రాధాకృష్ణన్ కుంబ్లే. ప్రస్తుతం మనదేశం తరఫున టెస్ట్ క్రికెట్ లోనూ, వన్డే క్రికెట్ లోనూ అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ అనిల్ కుంబ్లే. 2007 నవంబర్ 8 న అతనికి టెస్ట్ క్రికెట్ నాయకత్వ బాధ్యతలు కూడా అప్పగించబడినది. మొదటగా పాకిస్తాన్ తో స్వదేశంలో జర్గే 3 టెస్టుల సీరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. 1990 లో అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించి 603 టెస్ట్ వికెట్లను, 337 వన్డే వికెట్లను పడగొట్టాడు. బంతిని బాగా స్పిన్ చేయలేడని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆస్ట్రేలియా కు చెందిన షేన్ వార్న్ తర్వాత టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో లెగ్ స్పిన్నర్ గా రికార్డు సృష్టించాడు, స్పిన్నర్లలో షేన్ వార్న్, శ్రీలంక కు చెందిన ముత్తయ్య మురళీధరన్ ల తర్వాత మూడో స్థానంలో ఉన్నాడు. 2008, జనవరి 17 నాడు టెస్ట్ క్రికెట్‌లో 600వ వికెట్టును సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా అవతరించినాడు. టెస్ట్ క్రికెట్ లో అతని యొక్క అత్యంత ప్రముఖ సంఘటన ఒకే ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లను సాధించడం. ఇంగ్లాండ్ కు చెందిన జిమ్‌లేకర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ కావడం గమనార్హం. అతని యొక్క సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 2005 లో పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది. తనకు ఎంతో ప్రీతిపాత్రమైన ఢిల్లీ ఫిరీజ్‌షా కోట్లా మైదానంలో ఆస్ట్రేలియాపై చివరి టెస్ట్ మ్యాచ్ ఆడి 2008, నవంబర్ 2న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.

టెస్ట్ చరిత్రలోనే ఇన్నింగ్స్ లోని మొత్తం 10 వికెట్లు సాధించిన వారిలో ఇంగ్లాండు కు చెందిన జిమ్‌లేకర్ తర్వాత అనిల్ కుంబ్లే రెండో బౌలర్. 1999 లో ఫిబ్రవరి 4 నుండి 8 వరకు ఢిల్లీ లో పాకిస్తాన్ తో జర్గిన రెండో టెస్ట్ మ్యాచ్ లో అనిల్ కుంబ్లే ఈ ఘనతను సాధించాడు. కాని ఈ టెస్ట్ లో పాకిస్తాన్ కు చెందిన వకార్ యూనిస్ ను రెండు ఇన్నింగ్సులలోనూ ఒక్కసారి కూడా ఔట్ చేయలేడు. అతని వికెట్టును కూడా సాధించి ఉంటే ఒకే టెస్ట్ మ్యాచ్ లో ప్రత్యర్థికి చెందిన మొత్తం 11 బ్యాట్స్‌మెన్ లను ఔట్ చేసిన అరుదైన ఘనతను అనిల్ కుంబ్లే సొంతం చేసుకునేవాడు. ఆ ఇనింగ్సులో 9 వికెట్లను తీసిన తర్వాత అతని సహ బౌలర్ అయిన జవగళ్ శ్రీనాథ్ అనిక్ కుంబ్లే కు 10 వికెట్లు దక్కాలనే నెపంతో అతను వికెట్టు సాధించడానికి ప్రయత్నించలేడనే వాదన ఉంది. అనిల్ కుంబ్లే ఈ అరుదైన రికార్డు సాధించిన తర్వాత బెంగుళూరు లోని ఒక ప్రధాన కూడలికి అతని పేరు పెట్టారు.

... పూర్తి వ్యాసం

Sunday, February 1, 2009

ఒలింపిక్ క్రీడలు: ఈ వారం తెవికీ వ్యాసం

ఒలింపిక్ క్రీడలు ప్రతి నాలుగేళ్ళకొకసారి ప్రపంచ దేశాలన్నీ పోటీపడే ప్రతిష్టాత్మక క్రీడలు. క్రీ.పూ.776 లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలు క్రీ.శ.393 లో నిలిపి వేసారు. మళ్ళీ క్రీ.శ. 1896లో ఏథెన్స్ లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మధ్యలో కొంతకాలం ప్రపంచయుద్ధాల వల్ల అంతరాయం ఏర్పడిననూ దాదాపు నాలుగేళ్ళకోసారి (దీనికే ఒలింపియాడ్ అని కూడా పేరు) ఈ మహా క్రీడలు జరుగుతున్నాయి. ప్రాచీన కాలంలో జరిగిన క్రీడలను ప్రాచీన ఒలింపిక్ క్రీడలుగా, పున:ప్రారంభం తరువాత జరుగుతున్న క్రీడలకు ఆధునిక ఒలింపిక్ క్రీడలుగా వ్యవహరిస్తారు. సంక్షిప్తంగా ఈ క్రీడలను ది ఒలింపిక్స్ అని పిలుస్తారు. ఆధునిక ఒలింపిక్ క్రీడలకు ముఖ్యకారకుడు ఫ్రాన్స్ దేశానికి చెందిన పియరె డి కోబర్టీన్. 1924 నుంచి శీతాకాలపు ఒలింపిక్ క్రీడలను కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి 1896లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలకు వేసవి ఒలింపిక్ క్రీడలు అని పిలువవచ్చు. ఇంతవరకు 28 వేసవి ఒలింపిక్ క్రీడలు జరుగగా, 29 వ ఒలింపిక్ క్రీడలు 2008లో చైనా లోని బీజింగ్ లో జరిగాయి.

రంగురంగుల వలయాలు పెనవేసుకున్నట్లు కనిపించే చిహ్నమే ఒలింపిక్ చిహ్నం. పైన 3 వలయాలు, క్రింద 2 వలయాలు ఈ చిహ్నంలో ఉంటాయి. ఒక్కో వలయం ఒక్కో ఖండానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వలయాల మాదిరిగా ఖండాలు కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చిహ్నాన్ని ఎంపికచేశారు. 1913లో రూపొందించిన ఈ చిహ్నం తొలిసారిగా 1914లో ఆమోదించబడింది. 1920 నుంచి ఒలింపిక్ క్రీడలలో వాడుతున్నారు.

... పూర్తి వ్యాసం