గోను, 2007 జూన్‌లో సంభవించిన ఒక తుఫాన్. ఇది ఒక "సూపర్ సైక్లోనిక్ స్టార్మ్". అరేబియా సముద్రంలో నమోదైన తుఫాన్‌లన్నింటికంటే ఇది అత్యంత ఉధృతమైనదిగా గుర్తించారు. ఉత్తరాన హిందూమహా సముద్రంలో సంభవించిన అతిపెద్ద తుఫాన్‌కు ఇది ఇంచుమించు సమానంగా ఉంది. జూన్ 1న అరేబియా సముద్రం తూర్పు ప్రాంతంలో చిన్న అల్పపీడన ద్రోణిగా ఇది ప్రారంభమైంది. ఉపరితల ఉష్ణోగ్రతలు, గాలి దిశ అనుకూలంగా ఉండడంతో ఇది జూన్ 3 నాటికి ఉధృతంగా, 240 km/h (150 mph) గాలి వేగంతో బలపడింది. జూన్ 5వ తారీఖున ఇది ఒమన్ తూర్పు తీరాన్ని (రాస్ అల్ హద్ వద్ద) తాకింది. అరేబియన్ పెనిన్సులాలో ఇంత పెద్ద తుఫాన్ ఇంతకు ముందు నమోదు కాలేదు. ఈ ప్రాంతంలో అల్ప పీడనాలు బలహీనంగా ఉంటాయి. అవికూడా త్వరగా చెదరిపోతాయి. సంకీర్ణ తుఫాన్ హెచ్చరిక కేంద్రం (JTWC) దీనిని 02 శ్రేణి తుఫాన్‌గా వర్గీకరించి హెచ్చరికలు జారీ చేసింది. JTWC వారు మూడు సంవత్సరాలకు సరిపడా తుఫాన్ పేర్ల జాబితానొకదానిని తయారుగా ఉంచుతారు. క్రమంలో ఒక్కో తుఫాన్‌కు ఒక్కోపేరు పెడతారు. ఒకసారి వాడిన పేరును మరోసారి వాడరు.
జూన్ 6న ఇది ఉత్తర వాయువ్యదిశగా ప్రయాణించింది. అప్పుడు సముద్రంలోని అలల బలం దీనికి వ్యతిరేక దిశలో ఉండడంవలన తుఫాన్ తీవ్రత బాగా మందగించింది. వాతావరణ శాఖ దీనిని సామాన్యమైన "ఉష్ణమండల తుఫాన్" గా వర్గీకరించింది. తీవ్రమైన గాలులు, అధిక వర్షపాతం కలిగే అవకాశం ఉన్నందున విపరీతమైన నష్టం వాటిల్లే అవకాశం ఉన్నదని ఒమన్ జాతీయ రక్షణా వ్వవస్థ గుర్తించింది. అందువలన వీలయినంత వరకు నష్టాన్ని నివారించడానికి, అనంతర సహాయ చర్యలు చేపట్టడానికీ పెద్దయెత్తున సన్నాహాలు చేశారు. పోలీసు, మిలిటరీ, పారామిలిటరీ, వైద్య, మునిసిపాలిటీ, విద్యుత్, నీటి సరఫరా విభాగాలు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకొన్నారు.
... పూర్తి వ్యాసం