వారం వారం తెవికీ వ్యాసాలు.

Monday, July 27, 2009

చార్లీ చాప్లిన్: ఈ వారం తెవికీ వ్యాసం

చార్లీ చాప్లిన్ ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఒక హాస్య నటుడు. ఒక విభిన్నమైన కళాకారుడు. అనేక కళల్లో నిష్ణాతుడైన ఒక ప్రసిద్ధ బహురూపి. అమాయకునిలా తెర మీద కనిపించే చాప్లిన్, హాస్వోత్రేరక వ్యక్తిలా అనిపించే చార్లీ, నిజానికి చాలా చక్కనివాడు, అందగాడు. ఆశ్చర్యాన్ని గొలిపే రచయిత , చక్కని రచయిత, చక్కని గాయకుడు. యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతిప్రియుడు. అన్నిటికీ మించిన ప్రపంచకారుడు. ఛార్లీ చాప్లిన్ దయార్థ్ర హృదయుడు. అందానికి ఆరాధకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచాద్భుతాల్లో ఒకడు.

ప్రధానంగా హాస్య నటుడైనా హాస్యాన్ని మించిన ఒక పరమార్థాన్ని , ఒక సార్వజనీనతను అతడు తన చిత్రాలలో సాధించాడు. పాంటోమైమ్ , క్లౌనింగ్, మైమింగ్ , బర్లెస్క్, పేరడీ, శ్లాప్‌స్టిక్ - వీటన్నిటిని అతడు మాస్టర్ చేశాడు. ఒక చిత్రమైన బ్రష్‌లాంటి మీసకట్టు, బిగుతైన కోటు, వదులు ప్యాంటు, పెద్ద సైజు బూట్లు, చేతిలో వంకీ కర్ర, వంకరటింకర నడక - ఇవీ అతని సరంజామా. తనకు తాను ఒక పాత్రను ట్రాంప్ పాత్రను సృష్టించుకున్నాడు. ట్రాంప్ అంటే దేశద్రిమ్మరి. ఇవాళ ఇక్కడ వుంటాదు, రేపు మరో చోట. అతడికి ఊరూ పేరూ లేదు. అన్ని ఊర్లూ అతనివే , అన్ని పేర్లూ అతనివే.

అతని అజరామర కీర్తికి అధార చిత్రాలలో ఒకటి 1921 నాటి " కిడ్ " . దానిలో అనాథ బాలుడుగా జాకీ కూగన్, అతడిని సాకి చివరికి అసలు తల్లికి అప్పగించవలసి వచ్చిన పెంపుడు తండ్రిగా చాప్లిన్‌ల నటన చిరస్మరణీయమైనది. ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో (1940) తీసిన గ్రేట్ డిక్టేటర్‍లో చాప్లిన్ హిట్లర్‍ను అద్భుతంగా సెటైర్ చేశాడు. కాని కేవలం సెటై‍ర్ చేయడంతోనే సరిపెట్టక నియంతల క్రూర దారుణ నిరంకుశత్వం నుంచి మానవుడిని విముక్తుడిని చేయగల ఆశావాదాన్ని పురికొల్పే ప్రయత్నం చేశాడు.

... పూర్తి వ్యాసం

Sunday, July 19, 2009

భారత నావికా దళం: ఈ వారం తెవికీ వ్యాసం

భారత రక్షణ వ్యవస్థలో భాగమయిన భారత నావికా దళం (ఇండియన్ నేవీ) 55,000 సిబ్బందితో ప్రపంచంలో నాలుగవ అతి పెద్ద నావికా దళం. కేవలం దేశరక్షణకే కాకుండా మానవతా సహాయాలకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సహాయం కొరకు భారత ప్రభుత్వం నేవీని వినియోగిస్తుంది.

5,000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న భారతదేశంలో కీస్తు పూర్వం, 2300లో ప్రస్తుత గుజరాత్‌లోని మంగ్రోల్ దగ్గర మొట్టమొదటి నౌకాతీరం నిర్మించబడినది. క్రీ.పూ. 4వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యంలో మొదటిసారి నౌకా విభాగాన్ని ఏర్పరిచారు. చంద్రగుప్త మౌర్యుడి ప్రధానమంత్రి అయిన చాణక్యుడు తాను రచించిన అర్థశాస్త్రంలో 'నవాధ్యక్ష' (నౌకల నిర్వాహకుడు) పేరుతో నదీజలాల వినియోగం గురించి నిర్దేశించాడు. చుట్టూ ఉన్న దేశాలతో రాకపోకలకు, పలు రకార సంస్కృతులకు ఈ జలదారులు ప్రధాన కారణం. భారతదేశ చరిత్రలో మౌర్య, శాతవాహన, చోళ, విజయనగర, కళింగ, మరాఠా మరియు మొఘల్ సామ్రాజ్యాల నౌకా వ్యవస్థలు పేరెన్నికగన్నవి.

బ్రిటీషు ప్రభుత్వం భారతదేశాన్ని పాలిస్తున్నపుడు ది బ్రిటీష్ ఇండియన్ నేవీని ఏర్పరిచారు. ఇది 1946 నాటికి 78 ఓడలు 2,000 సిబ్బంది కలిగి ఉండేది. జనవరి 26, 1950న భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చిన రోజున నౌకాదళానికి ఇండియన్ నేవీగా , వాహకాలకు ఇండియన్ నావల్ షిప్స్ (INS) గా పేరు పెట్టారు.

... పూర్తి వ్యాసం

Sunday, July 12, 2009

మామిడి: ఈ వారం తెవికీ వ్యాసం

మామిడి (Mango) : అనకార్డియేసి కుటుంబానికి చెందిన మామిడికి, 25-30 మిలియన్ సంవత్సరాల పూర్వీకం, నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది. దీని జన్మస్థలం దక్షిణాసియా దేశాలైన భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు బర్మా. ఇది ఉష్ణదేశపు పండ్ల చెట్టు. గరిష్ట ఎత్తు 120 అడుగులు, ముప్పై(30)అడుగుల వ్యాసం వరకు విస్తరించి కిరీటం ఆకారంలో ఉంటుంది. పుష్పించడం పూర్తి ఐన తరవాత కాయలు రూపు దిద్దుకొని మూడు(3)నుండి ఆరు(6)మాసాలలో పక్వానికి వస్తాయి. ప్రపంచం మొత్తం 38.7 లక్ష హెక్టేర్లలో సాగుబడి వుండగా అందులో భారత్ 16 లక్షల హెక్టార్లలో సాగుబడి చేస్తోంది.

ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితులలో కూడా పండిస్తూ ఉన్నారు భారతద్వీపకల్పం అంతటా, కరీబియన్(Caribbean), మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు అసియా, మధ్య మరియు దక్షిణ ఆఫ్రికా దేశాలలోను పండిస్తున్నారు. దీనిని ఎక్కవగా తాజాగానే తింటారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడిచెట్టుని ఇంటి పెరటిలో చూడావచ్చు. తాజా మామిడి పండులో పదిహేను శాతం(15%)చక్కెర, ఒక శాతం(1%) మాంసకృత్తులు మరియు గుర్తించ తగిన మోతాదులో ఎ,బి,సి(A,B,C) విటమిన్లు ఉంటాయి. మామిడిపండు ఎక్కవగా తియ్యగా ఉన్నా కొన్నిజాతుల పండు కొంచంపుల్లగా ఉంటుంది. కొన్ని పండ్లు పీచు, ఎక్కువ రసంతో ఉంటాయి. వీటిని రసాలు అంటారు. కొన్ని కరకర లాడే కందడతో ఉంటాయి వీటిని మల్ గోవా మామిడి అంటారు. బంగినపల్లి ఎక్కువ తీయగా మెత్తటి కండ కలిగి ఉంటాయి. నీటిశాతం ఎక్కువ కనుక రసభరితంగా ఉంటాయి. కాయలతో దీర్గ కాలం నిలవ ఉండే పచ్చళ్ళు(ఊరగాయలు), చట్నీ, ఆమ్‌చూర్, మామిడి తాండ్ర లు తయారు చేస్తారు. మామిడి రసాన్ని బాటిల్స్, ప్యాక్ ల రూపంలో వ్యాపారసంస్థలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మిల్క్ షేక్, లస్సీ, ఐస్‌క్రీం, ఫ్రూట్‌సలాడ్ ఇంకా అనేక నోరూరించే రకాలు.



... పూర్తి వ్యాసం

Sunday, July 5, 2009

హనుమంతుడు: ఈ వారం తెవికీ వ్యాసం

హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు హనుమంతుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుడిని ఆరాధిస్తారు. సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా కొలవబడే ఆంజనేయుని గుడులు లేని ఊరు ఆంధ్ర ప్రదేశ్ ‌లో ఉండటం అరుదు. ఆంధ్రలోనేగాక, భారతదేశం యావత్తూ మరియు దేశవిదేశాలలోనూ హనుమంతుని దేవాలయాలు కానవస్తాయి. హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు, వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎర్రని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకమును హరించినవాడు. ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుకవచ్చి యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడు.

శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలిజోడించి ఉంటాడు. ఇంకా వివిధ సందర్భాలలో హనుమంతుని గురించి చెప్పబడిన వర్ణనలు: రామాయణ మహామాలా రత్నము, జితేంద్రియుడు, శ్రీరామదూత, జానకీశోక నాశకుడు, జ్ఞానగుణ సాగరుడు, హనుమాన గోసాయి, సంకట హారి, మంగళమూర్తి. రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాధలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాధలున్నాయి. పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను. శ్రీరాముని దేవాలయంలో సీతారాముల ఎదురుగా చేతులు మోడ్చిన హనుమంతుడు ప్రతిష్టింపబడడం సాధారణం. ఇలా రామాలయాలు అన్నీ హనుమంతుని ఆలయాలే అనవచ్చును. హనుమంతుని వివిధ నామస్తోత్రాలు, భజనలు, పాటలు చాలా ఉన్నాయి.

... పూర్తి వ్యాసం