వారం వారం తెవికీ వ్యాసాలు.

Sunday, March 29, 2009

కాంచీపురం: ఈ వారం తెవికీ వ్యాసం

కాంచీపురం లేదా కంచి, తమిళనాడులోని కాంచీపురం జిల్లా రాజధాని. చెన్నై నగరానికి 70 కి.మీ దూరంలో ఉన్నది. కాంచీపురం చీరలకు, దేవాలయాలకు ప్రసిద్ధి. కంచి పట్టణంలో పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి కామాక్షి దేవాలయం, ఆది శంకరాచార్యుడు స్థాపించిన మూలామ్నాయ కంచి శంకర మఠం ఉన్నాయి. కంచి పట్టుచీరలు దేశమంతటా చాలా ప్రసిద్ధి చెందినవి. కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం చారిత్రాత్మక రేవు పట్టణం పల్లవుల శిల్పకళా చాతుర్యానికి తార్కాణం. అంతేకాకుండా ఈ జిల్లాలో వేదాంతాంగళ్ అనే పక్షుల సంరక్షణ కేంద్రం కూడా ఉన్నది. మహాబలిపురానికి 14 కి.మీ దూరంలో మొసళ్ళ బ్రీడింగ్ సెంటర్ ఉన్నది. 2001 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం కాంచీపురం జనాభా 152,984.


మధ్య యుగములలో చైనా రాయబారి హుయాన్ సాంగ్ తన భారతయాత్రలో ఈ పట్టణాన్ని సందర్శించాడు. 4వ శతాబ్ధం నుండి 9వ శతాబ్ధం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవులకు ఇది రాజధాని. అప్పటి కాలంలో కాంచీపురం విద్యాబోధనలో కాశి అంత ప్రాముఖ్యం పొందింది. క్రీ.పూ.రెండవ శతాబ్ధంలో పతంజలి వ్రాసిన మహాభాష్యాలలో కూడా కంచి యొక్క ప్రస్తావన ఉన్నది. మణిమెక్కళ్ అనే తమిళ కవి, పెరుమపంత్రు అనే మరో తమిళ కవి తమ సాహిత్యంలో కంచిని వర్ణించారు. పల్లవుల తరువాత కంచిని చోళులు పదవ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు పరిపాలించారు. ఆ తరువాత విజయ నగర రాజులు 14 నుండి 17 శతాబ్ధం వరకు పరిపాలించారు. తరువాత కంచి ఆంగ్లేయుల హస్తగతం అయ్యింది. ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ వరదరాజ పెరుమాళ్ కు ఒక హారాన్ని బహుకరించాడని దానిని క్లైవ్ మకరకండి అని పిలుస్తారు. కంచి హిందువులకే కాక బౌద్ధులు, జైనులకు కూడా తీర్థ స్థలం.

... పూర్తి వ్యాసం

Sunday, March 22, 2009

అల్లూరి సీతారామరాజు: ఈ వారం తెవికీ వ్యాసం

అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4న వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ లకు జన్మించాడు. ఈ మన్యం వీరుని అసలుపేరు "శ్రీరామరాజు". కాలాంతరంలో ఇతనికి "సీతారామరాజు" అనే పేరు స్థిరపడింది. భీమవరంలో మిషన్ హైస్కూలులో, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో, కాకినాడ పిఠాపురం రాజా పాఠశాలలో, విశాఖపట్నంలో, నర్సాపురంలో ఇతని చదువు సాగింది. రాజు కుటుంబం 1918 వరకు తునిలో ఉన్నది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవి పేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలో చూసాడు. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు.


చిన్నప్పటినుండి సీతారామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవ పూజ చేసేవాడు. తుని సమీపంలో గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. మన్యం ప్రాంతాలలో పర్యటించాడు. దేవాలయాల్లోను, కొండలపైన, స్మశానాలలోను రాత్రిపూట ధ్యానం చేసేవాడు. దేవీపూజలు చేసేవాడు. మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు.

... పూర్తి వ్యాసం

Sunday, March 15, 2009

గోను తుఫాను: ఈ వారం తెవికీ వ్యాసం

గోను, 2007 జూన్‌లో సంభవించిన ఒక తుఫాన్. ఇది ఒక "సూపర్ సైక్లోనిక్ స్టార్మ్". అరేబియా సముద్రంలో నమోదైన తుఫాన్‌లన్నింటికంటే ఇది అత్యంత ఉధృతమైనదిగా గుర్తించారు. ఉత్తరాన హిందూమహా సముద్రంలో సంభవించిన అతిపెద్ద తుఫాన్‌కు ఇది ఇంచుమించు సమానంగా ఉంది. జూన్ 1న అరేబియా సముద్రం తూర్పు ప్రాంతంలో చిన్న అల్పపీడన ద్రోణిగా ఇది ప్రారంభమైంది. ఉపరితల ఉష్ణోగ్రతలు, గాలి దిశ అనుకూలంగా ఉండడంతో ఇది జూన్ 3 నాటికి ఉధృతంగా, 240 km/h (150 mph) గాలి వేగంతో బలపడింది. జూన్ 5వ తారీఖున ఇది ఒమన్ తూర్పు తీరాన్ని (రాస్ అల్ హద్ వద్ద) తాకింది. అరేబియన్ పెనిన్సులాలో ఇంత పెద్ద తుఫాన్ ఇంతకు ముందు నమోదు కాలేదు. ఈ ప్రాంతంలో అల్ప పీడనాలు బలహీనంగా ఉంటాయి. అవికూడా త్వరగా చెదరిపోతాయి. సంకీర్ణ తుఫాన్ హెచ్చరిక కేంద్రం (JTWC) దీనిని 02 శ్రేణి తుఫాన్‌గా వర్గీకరించి హెచ్చరికలు జారీ చేసింది. JTWC వారు మూడు సంవత్సరాలకు సరిపడా తుఫాన్ పేర్ల జాబితానొకదానిని తయారుగా ఉంచుతారు. క్రమంలో ఒక్కో తుఫాన్‌కు ఒక్కోపేరు పెడతారు. ఒకసారి వాడిన పేరును మరోసారి వాడరు.


జూన్ 6న ఇది ఉత్తర వాయువ్యదిశగా ప్రయాణించింది. అప్పుడు సముద్రంలోని అలల బలం దీనికి వ్యతిరేక దిశలో ఉండడంవలన తుఫాన్ తీవ్రత బాగా మందగించింది. వాతావరణ శాఖ దీనిని సామాన్యమైన "ఉష్ణమండల తుఫాన్" గా వర్గీకరించింది. తీవ్రమైన గాలులు, అధిక వర్షపాతం కలిగే అవకాశం ఉన్నందున విపరీతమైన నష్టం వాటిల్లే అవకాశం ఉన్నదని ఒమన్ జాతీయ రక్షణా వ్వవస్థ గుర్తించింది. అందువలన వీలయినంత వరకు నష్టాన్ని నివారించడానికి, అనంతర సహాయ చర్యలు చేపట్టడానికీ పెద్దయెత్తున సన్నాహాలు చేశారు. పోలీసు, మిలిటరీ, పారామిలిటరీ, వైద్య, మునిసిపాలిటీ, విద్యుత్, నీటి సరఫరా విభాగాలు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకొన్నారు.

ఒమన్ తీరప్రాంతాన్ని తాకడానికి 7 గంటలు ముందునుండీ తుఫాను ప్రభావం ఒమన్ తీరప్రాంతంపై కనిపించింది. ఈదురుగాలులు, అధిక వర్షపాతం సంభవించాయి. కొన్ని ప్రాంతాలలో 610 మి.మీ.వరకు వర్షపాతం నమోదయ్యింది. తీరాన రహదారులన్నీ జలమయమైపోయాయి. స్తంభాలు కూలి పోవడం వలన టెలిఫోను, విద్యుత్ సదుపాయాలు కొన్ని చోట్ల తీవ్రంగా స్తంభించాయి. కాని దేశంలో అత్యధిక ప్రాంతంలో ఈ సౌకర్యాలు కొనసాగాయి. జూన్ 5న మొట్టమొదట తుఫాను ప్రభావం మసీరా దీవిమీదా, షర్కియా ప్రాంతంలోనూ అధికంగా ఉంది. ఇక్కడి ముఖ్యపట్టణమైన సూర్, చుట్టుప్రక్కల రాస్ అల్ హద్ వంటి గ్రామాలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యాయి. కొంత సమయం వీటికి మస్కట్ నగరంతో దాదాపు పూర్తిగా సంబంధం లేకుండా జరిగింది.

... పూర్తి వ్యాసం

Sunday, March 8, 2009

తేనె: ఈ వారం తెవికీ వ్యాసం

మకరందము పూలలో ఉత్పత్తి అయ్యి స్రవించే తియ్యని ద్రవము. తేనెటీగలు పూలనుండి మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి. పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఇందులో నీటి శాతం కూడా తక్కువగా ఉండటంతో పులియడం, పాడవడం జరగదు. 18 శాతంకన్నా తక్కువ తేమ ఉన్న పదార్తాల్లో సూక్ష్మ జీవులు కానీ ఏ ఇతర జీవులు కానీ పెరగలేవు. మన ఆయుర్వేదానికి తేనె ప్రాణం లాంటిది. శుశ్రుతసంహిత తేనెను తాగేమందుగా వర్ణించింది, శ్వాసకోశవ్యాధులకు మధువును మించిన దివ్యౌషధం లేదని చెప్పింది.


అనేక రకాల చక్కెరపదార్థాల సమ్మిశ్రమమే తేనె. ఇందులో 38 శాతం ఫ్రక్టోజ్, 31 శాతం గ్లూకోజ్, ఒక శాతం సుక్రోజ్, 17 శాతం నీరు, 9 శాతం ఇతరత్రా చక్కెర పదార్థాలు, 0.17 శాతం బూడిద ఉంటాయి. కేవలం చక్కెర ద్రావణానికి అంత చిక్కదనం ఎలా వచ్చిందాని చూస్తే - కూలీ ఈగలు మకరందాన్ని గ్రోలి తేనెపట్టు దగ్గరకు తీసుకువచ్చేటప్పుడు ఆ సమయంలో వాటిల్లోని కొన్ని ఎంజైములు, అందులో కలుస్తాయి. సేకరించడం పూర్తయ్యాక ఈగలన్నీ తేనెపట్టులోకి చేరతాయి. అవి అక్కడ అనేకసార్లు రెక్కలల్లార్చుకుంటూ ఎగురుతుంటాయి. దాంతో మకరందంలో ఉన్న నీరంతా ఆవిరైపోతుంది. ఫలితంగా చక్కెర గాఢత పెరిగి చిక్కని తేనె మాత్రం మిగులుతుంది.


తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు, థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్... లాంటి విటమిన్లూ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లూ అమైనోఆమ్లాలూ ఎంజైములూ ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలూ ఎక్కువగా ఉంటాయి. ఇన్ని రకాల పోషకాలున్నాయి కాబట్టే తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెబుతారు. శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు.

... పూర్తి వ్యాసం

Monday, March 2, 2009

దసరా: ఈ వారం తెవికీ వ్యాసం

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది.

తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.

కొందరు దసరా వేషాలు లేదా పగటి వేషాలు ధరిస్తారు. పాఠశాల ఉపాద్యాయులు విద్యార్ధులను వెంట పెట్టుకొని అందరి ఇళ్ళకు వెళ్ళి మామూలు పుచ్చుకోవడం మామూలే. విద్యార్ధులు ఏదయా మీ దయా మామీద లేదు, ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా .. అయ్యవారికి చాలు అయుదు వరహాలు, పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు. సంవత్సర కాలంలో సేవలందిచిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు.