వారం వారం తెవికీ వ్యాసాలు.

Sunday, April 26, 2009

చింపాంజీ: ఈ వారం తెవికీ వ్యాసం

చింపాంజీ, హోమినిడే కుటుంబానికి చెందిన జంతువు. నిటారుగా నిలబడక చేతులను కూడా నడవడానికి ఉపయోగిస్తుంది. "చింపాంజీ" అనే పదాన్ని రెండు వేరువేరు కోతి జాతుల జంతువులకు వాడుతారు. వీటిలో ఒకటి పశ్చిమ ఆఫ్రికా, మధ్య ఆఫ్రికా ప్రాంతాలలో నివసించేది. రెండవ జాతి చింపాంజీలు కాంగో పరిసర ప్రాంతాలలో ఉంటాయి. ఆ జాతి సాధారణ నామం బొనొబో. శాస్త్రీయ నామం Pan paniscus. ఆఫ్రికాలో ఈ రెండు జాతుల చింపాజీల నివాస స్థలాలకు కాంగో నది సరిహద్దుగా ఉంటున్నది. చింపాంజీలు, గొరిల్లాలు, ఒరాంగుటాన్‌లు, మానవులు - వీరంతా హోమినిడే అనే జీవ కుటుంబానికి చెందిన జంతువులు. వీటిలో పైన చెప్పిన రెండు చింపాజీ జాతులు మానవ జాతికి అతి దగ్గరగా ఉన్న జంతుజాలం. సాధారణ చింపాంజీ, మరియు బోనొబో అనే ఈ రెండు జాతులూ ఈదలేవు. ఆఫ్రికా ఖండంలో 1.5-2 మిలియన్ సంవత్సరాల క్రిందట కాంగో నది ఏర్పడినపుడు అప్పటి ఒకే జాతి అయిన చింపాజీలు నది దక్షిణాన "బొనొబో"లు గాను, నది ఉత్తరాన సాధారణ చింపాంజీలు గాను పరిణామం చెందాయని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఇలా జాతులు రూపు దిద్దుకోవడాన్ని speciation అంటారు


అడవులలో పెరిగే చింపాంజీలు 40 యేండ్ల వరకు జీవిస్తాయి. పెంపకంలో ఇవి 60 యేళ్ళ వరకు బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. టార్జాన్ చిత్రంలో నటించిన "చీతా" అనే చింపాంజీ వయసు 2008 నాటికి 76 సంవత్సరాలు. ఇది ఇప్పటికి రికార్డయిన అత్యంత పెద్ద వయసు గల చింపాంజీ. 1960లో జేన్ గూడాల్ అనే శాస్త్రవేత్త టాంజానియా గోంబె నేషనల్ పార్క్ అడవులలో సాగించిన అధ్యయనాలు చింపాంజీల గురించిన విజ్ఞానానికి ముఖ్యమైనవి. జంతువులలో మనుషులు మాత్రమే పనిముట్లు వాడతారనే అభిప్రాయం అంతకుముందు ఉండేది. చింపాంజీలు పనిముట్లను వాడతాయని ఆమె కనుక్కోవడం ఒక ప్రముఖ పరిశీలనగా భావిస్తారు. తరువాత అడవులలోను, పరిశోధనాగారాలలోను చింపాంజీల గురించి అనేక అధ్యయనాలు జరిగాయి.
... పూర్తి వ్యాసం

Sunday, April 19, 2009

బాక్టీరియా: ఈ వారం తెవికీ వ్యాసం

బాక్టీరియా ఏకకణ సూక్ష్మజీవులు. ఇవి కొన్ని మైక్రోమీటర్ల పొడవు కలిగి, అసాధారణమయిన నిర్మాణాత్మక వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. బాక్టీరియా సర్వాంతర్యాములు, ఎలాంటి వాతావరణంలో నయినా మనం వీటిని కనుగొనవచ్చు. సాధారణంగా ఒక గ్రాము మట్టిలో 40 మిలియన్, ఒక మిల్లీ లీటరు నీటిలో ఒక మిలియన్ బాక్టీరియా కణాలుంటాయి. లెక్క కడితే ప్రపంచంలో మొత్తం 5 నొనిలియన్ (5×1030) బాక్టీరియా కణాలుంటాయి. సగానికి పైగా బాక్టీరియా ఇంకా కారక్టరైజ్ చేయబడలేదు మరియు చాలా కొన్ని జాతులను మాత్రం ప్రస్తుతానికి ప్రయోగశాలలో వర్ధనం ద్వారా పెంచవచ్చు. బాక్టీరియాల అధ్యయనాన్ని 'బాక్టీరియాలజీ' అంటారు. విట్టాకర్ ఐదు రాజ్యాల వర్గీకరణలో వీటిని మొనీరా రాజ్యంలో చేర్చడం జరిగింది. లీవెన్ హాక్ సూక్ష్మదర్శిని కనుగొన్న తర్వాత మొదటిసారిగా బాక్టీరియాను కనుక్కొన్నాడు.

మానవుని శరీరంపైన, లోపల కలిపితే మొత్తం మానవ కణాల సంఖ్యకన్నా బాక్టీరియా కణాల సంఖ్యే ఎక్కువ. చాలా శాతం బాక్టీరియాలు చర్మంపైన మరియు జీర్ణనాళంలోనూ నివసిస్తాయి. ఇందులో అత్యధిక శాతం బాక్టీరియా మానవునికి ఎలాంటి హనీ కలగజేయవు, కొన్ని మానవులలో ఇమ్మూనిటికి రక్షణ కల్పిస్తాయి, ఇంకొన్ని హానికారక బాక్టీరియాలు. హానికారక బాక్టీరియాల వల్ల కలిగే అంటువ్యాధులలో కలరా, సిఫిలిస్, ఆంథ్రాక్స్, కుష్టు(లెప్రసీ), క్షయ వ్యాధులు ప్రాణాంతకమైనవి.


బాక్టీరియా అన్ని రకాల ఆవాసాలలో వ్యాపించి ఉన్నాయి. ఇవి మృత్తిక, నీరు, వాతావరణం, జీవుల దేహాలలో లేదా దేహాలపైన విస్తరించి ఉన్నాయి. వివిధరకాల ఆహారాలు, వాటి ఉత్పాదితాలపైన పెరుగుతాయి. అతిశీతల, అత్యోష్ణ మరియు జలాభావ పరిస్థితులను కూడా తట్టుకొని బాక్టీరియా జీవిస్తాయి. కొన్ని బాక్టీరియా మొక్కల, జంతువుల దేహాలలో పరాన్నజీవులుగా లేదా సహజీవులుగా జీవిస్తున్నాయి.

... పూర్తి వ్యాసం

Tuesday, April 14, 2009

భగవద్గీత: ఈ వారం తెవికీ వ్యాసం

మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు.

కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చును. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరెవరికీ తెలియని అనేక విషయాలు బోధిస్తాడు.


ఆత్మ నిత్య సత్యమైనది మరియు చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన మరియు జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును. మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి.


కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భగవంతుని అంశతోనే ఉన్నవి. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునకే చెందుతాయి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసాదించాడు. అనంతము, తేజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయిన ఆ శ్రీకృష్ణుని విశ్వ రూపాన్ని చూసి అర్జునుడు తరించాడు. ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్తమోగుణాలచే నిండి ఉన్నాయి. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాల బంధంనుండి విముక్తి లభిస్తుంది.
... పూర్తి వ్యాసం

Sunday, April 5, 2009

గోల్కొండ: ఈ వారం తెవికీ వ్యాసం

గోల్కొండ ఒక శిధిలమయిన కోట మరియు నగరము. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాదు నగరమునకు 11 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరము మరియు కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. 1143 కాలంలో ఈ ప్రాంతాన్ని కాకతీయులు పాలిస్తూ ఉండేవారు. 200 సంవత్సరముల తరువాత వారినుండి బహమనీ సుల్తాను వశము చేసుకున్నాడని కధనం. ఇది బహుమనీ సామ్రాజ్యములో రాజధానిగా (1364-1512) ఉండేది, కానీ 1512 తరువాత సుల్తానుల రాజ్యములో రాజధానిగా చేయబడినది. గోల్కొండ అధికారులు, సైన్యం, పాలకుల కుటుంబాలు నివసించేటంత పెద్దగా ఉండేది. అక్కడ మసీదులు మరియు కోటల శిధిలాలు కూడా ఉంటాయి. గోల్కొండలో కుతుబ్ షాహీ వంశస్తుల పాలన 1687 లో ఔరంగజేబు విజయముతో అంతమయినది. ఆసమయములొనే ఔరంగజేబు, కోటను నాశనంచేసి, శిధిలాలను మిగిల్చాడు. గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి గాను ఎంతో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచప్రసిద్ద కోహినూరు వజ్రము కూడా ఇక్కడినుండే వచ్చినదని చెబుతూ ఉంటారు. గోల్కొండలోని గనుల నుండి వచ్చిన ధనము నిజాము చక్రవర్తులను సుసంపన్నం చేశాయి. నిజాములు మొగలు చక్రవర్తులనుండి స్వాతంత్ర్యము పొందిన తరువాత హైదరాబాదును 1724 నుండి 1948లో భారత్‌లో విలీనమయ్యేంతవరకు పాలించారు.


గోల్కొండ నాలుగు వేర్వేరు కోటలు, 87 అర్ధ చంద్రాకారపు బురుజులతోకూడిన 10 కి.మీ. పొడవు గోడ కలిగి ఉంది. కొన్ని బురుజులలో ఇంకా ఫిరంగులను నిలిపిఉంచారు. ఇంకా 8 సింహద్వారములు, 4 ఎత్తగలిగే వంతెనలు (draw bridge), బోలెడన్ని రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలు మొదలగునవి చాలా ఉండేవి. సింహద్వారములలో అన్నిటికంటే కిందది మరియు అన్నిటికంటే బయట ఉండే ఫతే దర్వాజా (విజయ ద్వారము) నుండే మనము గోల్కొండ కోటను చూడటానికి వెళ్తాము. ఫతే దర్వాజా నిర్మించటానికి ధ్వనిశాస్త్రమును ఔపోసన పట్టినట్లున్నారు. గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశమునందు చప్పట్లు కొడితే కిలోమీటరు ఆవల గోల్కొండలో అతి ఎత్తయిన ప్రదేశములో ఉన్న "బాలా హిస్సారు" వద్ద చాలా స్పస్టముగా వినిపిస్తుంది. ఈ విశేషమును ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాదసంకేతములు తెలుపుటకు ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా మిగిలిపోయింది.

... పూర్తి వ్యాసం