వారం వారం తెవికీ వ్యాసాలు.

Sunday, May 31, 2009

మహాసముద్రము: ఈ వారం తెవికీ వ్యాసం

మహా సముద్రం లేదా మహాసాగరం, భూగోళం యొక్క జలావరణంలో ప్రధాన భాగం. ఉప్పు
నీటితో నిండిన ఈ మహా సముద్రాలు భూమి ఉపరితలము పై 71% పైగా విస్తరించి
ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం 36.1 కోట్ల చదరపు కిలో మీటర్లు. ప్రపంచం
సముద్ర జలాలలో దాదాపు సగ భాగము 3,000 మీటర్లు (9,800 అడుగులు) ఫైగా
లోతైనవి. సరాసరి మహాసముద్రాల 'సెలైనిటీ' (ఉప్పదనం) దాదాపు వెయ్యికి 35
వంతులు (3.5%). మహాసాగరాలన్నీ కలిసి ఉన్నా గాని వ్యావహారికంగా ఐదు వేరు
వేరు మహాసాగరాలుగా గుర్తిస్తారు. అవి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్
మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం మరియుదక్షిణ
మహాసముద్రం. ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయిన పెద్ద నీటి భాగాలు. కనుక
దీనిని ప్రపంచ మహాసముద్రం అని చెప్పవచ్చును

మహా సముద్రాలలో కొన్ని చిన్న భాగాలను సముద్రాలు, సింధుశాఖలు అని అంటారు.
అధికంగా అక్కడి భూభాగం లేదా దేశం లేదా ప్రాంతం బట్టి ఈ సముద్రాల,
సింధుశాఖల పేర్లు ఉంటాయి. కొన్ని జలాశయాలు పూర్తిగా భూమిచే చుట్టబడి
ఉంటాయి. (అంటే ఇతర సముద్రాలతో కలసి ఉండవు). కాస్పియన్ సముద్రం, అరల్
సముద్రం, గ్రేట్ సాల్ట్ లేక్ ఈ కోవలోకి వస్తాయి. నిజానికి ఇవి పెద్ద
ఉప్పునీటి సరస్సులే గాని సముద్రాలు కాదు. భౌగోళికంగా మహాసముద్రం అంటే
భూగోళంపై నీటితో కప్పబడిన "సముద్రపు అడుగు". (ఓషియానిక్ క్రస్ట్).

మొత్తం ప్రపంచ సముద్ర ఉపరితల వైశాల్యం 361 మిలియన్ చదరపు కిలోమీటర్లు.
మొత్తం ఘన పరిమాణం షుమారు 1,300 మిలియన్ క్యూబిక్ కిలోమీటర్లు. సరాసరి
లోతు 3,790 మీటర్లు పురాతన కాలంనుండీ మానవుడు సముద్రాలపై
ప్రయాణిస్తున్నప్పటికీ సముద్రాల నీటి అడుగుకు వెళ్ళడం ఇటీవల కాలంలోనే
సాధ్యమయ్యింది. ప్రపంచంలో అన్నింటికంటే లోతైన ప్రదేశం మెరియానా ట్రెంచ్.
ఇది పసఫిక్ మహాసముద్రంలో ఉత్తర మెరియానా దీవులు ప్రాంతంలో ఉంది. దీని
అత్యధిక లోతు 10,923 మీటర్లు (35,838 అడుగులు). ఇప్పటికీ సముద్రాంతరతలం
చాలావరకు అన్వేషించబడలేదు.

పూర్తి వ్యాసం

Sunday, May 24, 2009

యుద్ధకాండ: ఈ వారం తెవికీ వ్యాసం

యుద్ధకాండ, రామాయణం కావ్యంలో ఆరవ విభాగము. భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతములో రచించిన వాల్మీకిమహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. చాలా భారతీయ భాషలలోను, ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. భారతీయుల సంస్కృతి, సాహిత్యము, ఆలోచనా సరళి, సంప్రదాయాలలో రామాయణం ఎంతో ప్రభావం కలిగి ఉంది. రామాయణంలోని విభాగాలను కాండములు అంటారు. ఒకో కాండము మరల కొన్ని సర్గలుగా విభజింపబడింది. వీటిలో యుద్ధ కాండ ఆరవ కాండము. ఇందులో 131 సర్గలు ఉన్నాయి.


పేరుకు తగినట్లుగా యుద్ధకాండ సుదీర్ఘమైన కధా విభాగం అధిక భాగం యుద్ధ వర్ణనే ఉంది. సుందర కాండలో హనుమంతుడు సీత జాడ తెలిసికొని రామునికి చెప్పిన ఘట్టం తరువాత యుద్ధకాండ మొదలవుతుంది. ఇందులో ప్రధాన ఘట్టాలు - రాముడు హనుమంతుని ఆలింగనము చేసుకొనుట, వానర భల్లూక సేవలతో రామలక్ష్మణులు యుద్ధానికి సన్నద్ధులగుట, విభీషణ శరణాగతి, సాగరమునకు వారధి నిర్మించుట, రామ లక్ష్మణ సుగ్రీవులకు జయ ఘోషతో యుద్ధము ఆరంభం కావడం, రామలక్ష్మణుల మూర్ఛ, నాగపాశ విమోచన, అనేక రాక్షస వీరుల మరణం, కుంభకర్ణుని మరణం, హనుమ ఓషధి పర్వతాన్ని తెచ్చి వానర సేనను, తరువాత లక్ష్మణుని కాపాడడం, కుంభ, నికుంభ, ఇంద్రజిత్తుల మరణం, ఆదిత్య హృదయం స్తోత్రం, రామరావణ యుద్ధం, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము. అనంతరం రామాయణ కధా ఫలశృతి ఉన్నది.


ఈ కాండములో అనేక భాగాలు - ముఖ్యంగా నాగపాశ విమోచన, హనుమ ఓషధి పర్వతాన్ని తీసుకు రావడం, ఆదిత్య హృదయం, రావణ సంహారం, శ్రీరామ పట్టాభిషేకం వంటి భాగాలు పారాయణ చేస్తే సత్ఫలితాలు కలుగుతాయని నమ్మకం ఉంది.

... పూర్తివ్యాసం

Sunday, May 17, 2009

చిదంబరం: ఈ వారం తెవికీ వ్యాసం

చిదంబరం తమిళనాడు లోని కడలూరు జిల్లాకు చెందిన మునిసిపాలిటీ మరియు తాలూకా కేంద్రం. ఇది తీరానికి 11 కి.మీ మరియు చెన్నై కి రైలు ద్వారా 240 కి.మీ దక్షిణంగా ఉంది. ఇక్కడ పరమ శివుడు శివతాండవం చేస్తూ నటరాజు గా వెలసిన చిదంబరం దేవాలయం 40 ఎకరాల సముదాయంలో ఉన్నది. శైవులకు దేవాలయం లేదా తమిళం లో కోయిల్‌ అంటే చిదంబరం ఉన్న ఈ నటరాజ దేవాలయం. ఈ ఆలయం 'విరాట్ హృదయ పద్మ స్థలం' అంటే కమలం వంటి విశ్వపు గుండెలో ఉన్నదని ప్రతీతి. పరమశివుడు ఆనంద తాండవం చేసిన స్థలంలో - 'తిరుమూలతనేశ్వర్' ఆలయానికి దక్షిణంగా - ఇప్పుడు శివుడు నృత్య భంగిమలో కనిపించే పొన్నాంబళం/పోర్ సబై ('పొన్'అంటే బంగారం 'సబై' అంటే సభ లేదా వేదిక) ఉంది. ఇక్కడి దేవుణ్ణి 'సభానాయకర్' - అంటే వేదికపై కొలువైన దేవుడు - అని కూడా పిలుస్తారు. బంగారు తాపడం చేసిన వేదిక చిదంబరం ఆలయపు గర్భగుడిలో స్వామి మూడు రూపాల్లో దర్శనమిస్తారు: (1) సంపూర్ణ రూపం - నటరాజు రూపంలోని స్వామి (2) అసంపూర్ణ రూపం - స్ఫటిక రూపంలోని చంద్ర మౌళీశ్వరర్ (3) నిరాకారం - పంచ భూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా గర్భ గుడిలోని ఖాళీ స్థలం

చిదంబరంలో శివుడు తన దేవేరి శక్తి లేదా శివకామినితో అనంతంగా తన దివ్యమైన 'ఆనంద తాండవం' చేస్తుంటారని ప్రతీతి. దీన్ని గర్భగుడిలోని ఖాళీ స్థలంలో ఉన్న ఒక గోడపై 'యంత్ర' అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఆ స్థలాన్ని ఒక తెర కప్పి ఉంచుతుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు 'విల్వ' (బిల్వ) పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటి వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగులోనూ, లోపలి వైపు జ్ఞానాన్నీ ముక్తినీ సూచించే ఎరుపు రంగులోనూ ఉంటుంది. దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా ప్రధాన పూజారి తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచి పెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియ జెప్పే ప్రక్రియ. అందువల్ల చిదంబర రహస్యం ఏమిటంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు భగవంతుడిని తన (భక్తుడి) అజ్ఞానాన్ని తొలగించనిచ్చి ఆయనను దర్శించుకుని ఆయన ఉనికిని, ముక్తిని అనుభవించగలడు

... పూర్తి వ్యాసం

Wednesday, May 13, 2009

కర్నూలు: ఈ వారం తెవికీ వ్యాసం

కర్నూలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నగరము మరియు అదే పేరుగల జిల్లా యొక్క ముఖ్య పట్టణం. 1953 నుండి 1956 నవంబర్ 1 వరకు ఈ పట్టణం ఆంధ్ర రాష్ట్రం రాజధాని గా కొనసాగింది. శ్రీశైలం - నాగార్జునసాగర్ ప్రాంతంలోని వన్యమృగ సంరక్షణ కేంద్రం బాగా పెద్దది. ఎప్పుడో అంతరించి పోయిందని భావించబడిన బట్టమేక పిట్ట ఇటీవల జిల్లాలోని రోళ్ళపాడు వద్ద కనిపించడంతో ఆ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించారు. రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రం మంత్రాలయం కర్నూలు జిల్లాలో తుంగభద్రానదీ తీరంలో ఉంది. అహోబిలంలో నరసింహస్వామి దేవాలయం ఉంది. మహానందిలో నందీశ్వరుడు ఉన్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం ఈజిల్లాలోదే. కృష్ణా నదిపై ఇక్కడ నిర్మించబడ్డ ఆనకట్ట దేశంలోని అతిపెద్ద వాటిలో ఒకటి. లక్షలాది ఎకరాలకు నీరందించడమే కాక, విద్యుదుత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే ప్రధాన వనరుగా ఉంది.


ఇప్పుడు కర్నూలుగా పిలువబడే ఈ నగరం పూర్వ నామం కందెనవోలు. 11వ శతాబ్దిలో ఆలంపూరు లో కడుతున్న ఆలయం కోసం బళ్ల మీద రాళ్లను తరలించే క్రమంలో, ఈ ప్రాంతంలో బండి చక్రాలకు కందెన రాయడానికి ఆపేవారట. దీని వల్ల ఈ ప్రాంతానికి కందెనవోలు అనే పేరు వచ్చింది. అదే రానురాను కర్నూలుగా రూపాంతరం చెందింది. బాదామి చాళుక్యులు, తెలుగు చోళులు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. అటు తర్వాత విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని జయించి తమ ఆధీనం లోనికి తెచ్చుకొన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రస్తుత జిల్లా అంతా ఆయన ఏలుబడి లోనికి వచ్చింది. కర్నూలులో ప్రఖ్యాతి గాంచిన కొండారెడ్డి బురుజు, అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోటలో ఓ భాగం మాత్రమే, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చింది.

... పూర్తి వ్యాసం

Sunday, May 3, 2009

ఎస్.వి. రంగారావు: ఈ వారం తెవికీ వ్యాసం

సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. నట యశస్వి గా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందలకు పైగా చిత్రాలలో అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తా లో ఆఫ్రో-ఆసియా చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకుగాను ఎస్వీయార్ ఉత్తమ నటుడు బహుమతి పొందాడు. ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి, నగదు పారితోషికం లభించాయి.

ఎస్వీ రంగారావు కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 1918 జూలై 3 వ తేదీన జన్మించాడు. హిందూ కాలేజిలో చదివాడు. డిగ్రీ వరకూ చదివి, అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ, షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించాడు. ఆ తర్వాత బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు. ఆ తర్వాత మనదేశం, పల్లెటూరి పిల్ల , షావుకారు, పాతాళభైరవి, పెళ్ళి చేసి చూడు, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాతా మనవడు ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు.

వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవాడు. ఆయన గొప్ప దాత. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చాడు. చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చాడు.

... పూర్తివ్యాసం