వారం వారం తెవికీ వ్యాసాలు.

Sunday, August 30, 2009

భారతీయ రైలు రవాణా వ్యవస్థ: ఈ వారం తెవికీ వ్యాసం

భారతీయ రైల్వేలు, ఒక భారత ప్రభుత్వ విభాగము. ఇది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పని చేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర రైల్వే మంత్రి (కేబినెట్ హోదా) నిర్వహణలో ఉండే రైల్వే విభాగం, రైల్వే బోర్డు కింద పని చెస్తుంది. భారతీయ రైల్వేలు కార్పొరేట్ సంస్థ కానప్పటికీ ఈ మధ్య కాలంలో కార్పొరేట్ నిర్వహణ శైలిని అలవర్చుకొంటోంది. భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛ్ఛత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. ఇది ప్రతి రోజూ ఒక కోటీ అరవై లక్షల ప్రయాణీకులను గమ్యం చేరుస్తూండడమే కాక మరో పది లక్షల మెట్రిక్ టన్నుల సరుకులను కూడా రవాణా చేస్తోంది. భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను (సుమారు పదహారు లక్షలు)కలిగి వున్న సంస్థగా రికార్డుని నెలకొల్పింది.

రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి వున్నాయి. ఈ మార్గాల మొత్తం దూరం సుమారుగా 63,140 కి.మీ (39,233 మైళ్ళు). సం,2002 నాటికి రైల్వేల వద్ద 2,16,717 వాగన్లు, 39,263 కోచ్ లు, 7,739 ఇంజిన్లు వున్నాయి. భారత రైల్వే ప్రతి రోజూ 14,444 రైళ్ళను నడుపుతూండగా అందులో 8,702 పాసెంజర్ రైళ్ళు.


భారత దేశంలో 1851 ఏప్రిల్ 16న మొదటి రైలు పనిచెయ్యడం మొదలుబెట్టింది. రూర్కీలో కట్టుబడి సామాగ్రిని మోసేందుకు దాన్ని వాడారు. కొన్నేళ్ళ తరువాత, 1853 ఏప్రిల్ 16బాంబే లోని బోరి నందర్, ఠాణాల మధ్య -34 కి.మీ.దూరం - మొట్టమొదటి ప్రయాణీకుల రైలును నడిపారు మొదటిసారిగా సం.1853 లో ప్రవేశపెట్టబడ్డాయి. సం.1947(స్వతంత్రం వచ్చే)నాటికి దేశంలో మొత్తం42 రైల్వే సంస్థలు నెలకొల్పబడి వున్నాయి. సం.1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే, ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించింది. భారత రైల్వే దూర ప్రయాణాలకు మరియు నగరాలలో దగ్గరి ప్రయాణాలకు అవసరమైన రైళ్ళను నడుపుతోంది.


మొత్తం రైలు మార్గము సుమారు 108,706 కీ.మీ.(67,547 మైళ్ళు). ఈ మార్గాలని వేగం అధారముగా (75 కీ.మీ/గం నుండి 160కీ.మీ/గం లేదా 47 మైళ్ళు/గం నుండి 99 మైళ్ళు/గం) విభజించారు. భారతీయ రైలు మార్గాన్ని బ్రాడ్ గేజ్ (స్టాండర్డ్ గేజ్ కంటే వెడల్పైనది – 4  అడుగులు 8½  అంగుళాలు (1,435 మిల్లీ మీటర్లు)); మీటర్ గేజ్; మరియు నారో గేజ్ (స్టాండర్డ్ గేజ్ కంటే తక్కువ). భారత దేశములో అత్యధిక రైలు మార్గం బ్రాడ్ గేజ్. సుమారు 86,526 కీ.మీ (53,765 మైళ్ళు)ల బ్రాడ్ గేజ్ రైలు మార్గం కలదు. రద్దీ తక్కువ ఉన్న ప్రాంతాలకు మీటర్ గేజ్ (1,000 మీ.మీ. (3.28 ft) రైలు మార్గాన్ని నిర్మించారు. ప్రస్తుతం అన్ని మార్గాలను బ్రాడ్ గేజ్ గా మార్చే పనులు జరుగుతున్నాయి. కొండ ప్రాంతాలలో ఉన్న రైలు మార్గాలను నారో గేజ్ మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గాలను బ్రాడ్ గేజ్ గా మార్చడం చాలా కష్టం. మొత్తం నారో గేజ్ రైలు మార్గం 3,651 కీ.మీ (2,269 మైళ్ళు).

... పూర్తి వ్యాసం

Monday, August 24, 2009

వర్షం: ఈ వారం తెవికీ వ్యాసం

వర్షం లేదా వాన ఆకాశంలోని మేఘాల నుండి భూతలం పైకి నీటి బిందువుల రూపంలో కురిసే ఒక రకమైన అవపాతం. ఆకాశం నుండి కురిసిన వర్షమంతా భూమికి చేరదు. కొంత శాతం వర్షం పొడి గాలి గుండా పడుతుంటూనే గాలిలో ఆవిరైపోతుంది. కురిసిన వర్షం మొత్తం భూమికి చేరకపోవటాన్ని విర్గా అంటారు. ఈ ప్రక్రియ తరచూ ఉష్ణోగ్రత హెచ్చుగా, వాతావరణం పొడిగా ఉండే ఎడారి ప్రాంతాలలో కనిపిస్తుంది. వర్షం ఎలా సంభవిస్తుంది మరియు ఎలా కురుస్తుంది అన్న వాటికి శాస్త్రీయ వివరణను బెర్గెరాన్ ప్రక్రియ అంటారు.

జలచక్రములో వర్షం ప్రధాన పాత్ర పోషిస్తుంది. సముద్రాల నుండి నీరు ఆవిరై, ఆ తేమ తిరిగి ఆకాశములో ధ్రవీభవించి బుడగలలాగా ఏర్పడిన అవపాతము ఆకాశానికి తేలుతుంది. ఆ అవపాతము వర్షముగా కురుస్తుంది. వర్షము పడిన అవపాతాన్ని తిరిగి సముద్రానికి చేర్చి నదులు ఈ చక్రాన్ని పూర్తి చేస్తాయి. మొక్కలు పీల్చుకున్న నీటిని శ్వాస క్రియలో ఆవిరిగా వాతావరణంలోకి వదులుతాయి. అలా వదిలిన ఆవిరి ఇతర నీటి అణువులను చేరి నీటి బిందువులుగా యేర్పడతాయి. సాధారంగా వర్షాన్ని అవపాత పరిమాణం మరియు అవపాతానికి కారణం అన్న రెండు అంశాలతో వర్గీకరిస్తారు.

అవపాతం, అందునా వర్షం వ్యవసాయన్ని చాలా ప్రభావితం చేస్తుంది. అన్ని మొక్కలకూ జీవించటానికి కొంతైనా నీరు అవసరం. వర్షం అత్యంత సులువైన నీరు అందజేయు పద్ధతి కాబట్టి, ఇది వ్యవసాయానికి చాల ఉపయోగకరమైనది. సాధారణంగా ఒక క్రమ పద్ధతిలో తరచూ పడే వర్షాలు మొక్కలు ఆరోగ్యముగా పెరగటానికి అవసరం కానీ అతివృష్టి, అనావృష్టి రెండూ పంటలకు ముప్పును కలుగజేస్తాయి. అన్ని దేశాలలో వ్యవసాయం ఎంతోకొంత వరకైనా వర్షంపై ఆధారపడుతుంది. భారతీయ వ్యవసాయ రంగము వర్షంపై భారీగా ఆధారపడి ఉన్నది. ముఖ్యంగా పత్తి, వరి, నూనెదినుసులు మరియు ముతక ధాన్యం పంటలు అతి ఎక్కువగా వర్షంపై ఆధారపడుతున్నవి. ఋతుపవనాలు కొన్ని రోజులు ఆలస్యమైనా, అది దేశ ఆర్ధికరంగాన్ని విపరీతంగా దెబ్బతీస్తుంది.

... పూర్తి వ్యాసం

Monday, August 17, 2009

చతుర్వేదాలు: ఈ వారం తెవికీ వ్యాసం

చతుర్వేదాలు హిందూమతం లో అత్యంత మౌలికమైన ప్రమాణంగా గుర్తిస్తారు. వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములు (ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య) అనీ కూడా అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదానికి నిగమము (అనాదిగా వస్తున్న నిర్ధారితమైన మూల గ్రంథము) అని కూడా పేరుంది.

మొదట కలగలుపుగా ఉన్న వేదాలను వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడనీ, కనుకనే ఆయన వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. అలా నాలుగు వేదాలు మనకు లభించాయి. (1) ఋగ్వేదము (2) యజుర్వేదము (3) సామవేదము (4) అధర్వణవేదము. వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి బోధించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అన్ని వేదాలూ కలిపి 1180 అధ్యాయాలు, లక్షపైగా శ్లోకాలు ఉండాలని అంటారు. కాని ప్రస్తుతం మనకు లభించేవి 20,023 మాత్రమే.

మళ్ళీ ఒక్కొక్క వేదంలోను నాలుగు ఉపవిభాగాలున్నాయి. మొదటి రెండింటిని "కర్మకాండ" అనీ, తరువాతి రెండింటిని "జ్ఞానకాండ" అనీ అంటారు. అవి -

  1. మంత్ర సంహిత:ఇది వేదాలలోని మంత్రభాగం. స్తోత్రాలు, ఆవాహనలు ఇందులో ఉంటాయి. అన్నింటికంటే ఋగ్వేదసంహిత అత్యంత పురాతన, ప్రముఖ గ్రంథము. యజుర్వేదసంహిత ఎక్కువగా వచనరూపంలో ఉంది. ఋగ్వేద మంత్రాలకు అనుబంధంగా ఇది ఉంటుంది.
  2. బ్రాహ్మణము: సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు. ఇది గృహస్తులకు ఎక్కువగా వినియోగపడుతుంది.
  3. ఆరణ్యకము: అనగా అడవులకు సంబంధించిన విషయాలు. వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి. కాని వీటిలో కర్మలయొక్క భౌతిక భాగం ఉండదు. కర్మలవెనుక ఉన్న నిగూఢమైన తత్వాలమీది ధ్యానానికి ఆరణ్యకాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి.
  4. ఉపనిషత్తులు - ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వీటిలో 108 ముఖ్యమైనవి.

యజ్ఞ నిర్వహణలో నలుగురు పురోహితులుంటారు. (1) హోత: ఋగ్వేదంలోని స్తోత్రాలను పఠించేవాడు. (2) అధ్వర్యుడు: యజుర్వేదంలో చెప్పిన ప్రకారం యజ్ఞకర్మలను యధావిధిగా నిర్వహించేవాడు. (3) ఉద్గాత: సామగీతాలను గానం చేసేవాడు. (4) బ్రహ్మ: అధర్వణ వేద పండితుడు. యజ్ఞాన్ని పర్యవేక్షించేవాడు.

... పూర్తి వ్యాసం

Sunday, August 9, 2009

ఛత్రపతి శివాజీ: ఈ వారం తెవికీ వ్యాసం

ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - మార్చి 4, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. నిజాంషాహీలపైన షాజహాన్ దండయాత్ర చేసినపుడు షాహాజి సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్‌రావ్ అనే మరాఠా యోధున్ని నిజాంషాహీ ప్రభువు హత్య చేయించాడు. ఇది నచ్చని షాహాజీ నిజాంషాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు. షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా, మొఘలులు ఆదిల్షాతో కలసి షాహాజీని ఓడించారు. ఆదిల్షాతో సంధి ప్రకారం షాహాజి ప్రస్తుత బెంగుళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది, పూణే వదిలి వెల్లవలసి వచ్చింది. షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవలసిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకొన్నాడు.


షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడయిన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్దులు నేర్పింది. చిన్నప్పటినుండి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింప చేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ద తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకొన్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలు పెట్టాడు.

... పూర్తి వ్యాసం

Monday, August 3, 2009

గోవా: ఈ వారం తెవికీ వ్యాసం

గోవా భారతదేశంలో పశ్చిమతీరాన అరేబియా సముద్రం అంచున ఉన్నది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా అంటారు. ఇది దేశంలో వైశాల్యపరంగా రెండవ అతిచిన్న రాష్ట్రం. జనాభా పరంగా నాలుగవ అతిచిన్న రాష్ట్రం. గోవా రాజధాని పనజీ. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకొన్నారు. కొద్దికాలంలోనే అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకొన్నారు. 450 ఏండ్ల తరువాత, 1961లో భారత ప్రభుత్వం గోవాను తన అధీనంలోకి తీసుకొన్నది. చక్కని బీచిలు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపద - ఇవన్నీ కలిపి గోవా మంచి పర్యాటక కేంద్రంగా కావడానికి తోడ్పడ్డాయి. ఈ ప్రాంతానికి మహాభారతంలోనూ, ఇతర ప్రాచీన గ్రంధాలలోనూ గోపరాష్ట్రం, గోవరాష్ట్రం, గోపకపురి, గోపక పట్టణం, గోమంచాల, గోవపురి వంటి పేర్లు వాడబడినాయి. ఆప్రాంత అనే పేరు కూడా వాడబడింది.


1498లో వాస్కో డ గామా కేరళ లో కోజికోడ్‌లో అడుగుపెట్టాడు. తరువాత అతడు గోవా చేరాడు. సుగంధ ద్రవ్యాల వ్యాపారమే పోర్చుగీసు వారి అప్పటి లక్ష్యము. కాని 1501 లో తిమ్మయ్య అనే స్థానిక రాజు తరపున పోరాడి అల్ఫోంసో డి అల్బుకర్క్ అనే పోర్చుగీసు అడ్మిరల్ బహమనీ రాజులనోడించాడు. గోవాను తమ నావలకు స్థావరంగా చేయాలనేది వారి అభిమతం. బ్రిటిష్‌వారు వచ్చిన తరువాత పోర్చుగీసు అధికారం గోవాకు, మరి కొద్ది స్థలాలకు పరిమితమైనది. పోర్చుగీసు వారికి గోవా విలువైన విదేశీ స్థావరమైనది. పోర్చుగీసు నుండి వచ్చినవారు ఇక్కడ స్థిరపడడం, స్థానికులను పెండ్లాడడం జరిగింది. 1843లో రాజధాని పాత గోవా నుండి పనజీకి మార్చారు. 1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా గోవాను వదులుకోవడానికి పోర్చుగీసువారు ఒప్పుకొనలేదు. 1961 డిసెంబరు 12న భారత సైన్యం గోవాలో ప్రవేశించి, గోవాను ఆక్రమించింది. కొద్దిపాటి ఘర్షణ తరువాత డామన్, డయ్యులు కూడా భారతదేశం అధీనంలోకి వచ్చాయి. కాని 1974 వరకు పోర్చుగీసు ప్రభుత్వం గోవాను భారతదేశంలో అంతర్భాగంగా అంగీకరించలేదు. 1987 మే 30న గోవాను కేంద్రపాలిత ప్రాంతంగా కాక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచారు. ఇది భారతదేశంలో 25వ రాష్ట్రం అయ్యింది.


పడమటి కనుమలులోని కొంకణ తీరాన ఉన్న గోవాకు 101 కి.మీ. సముద్ర తీరము ఉన్నది. మాండవి, జువారి, తెరెఖోల్, ఛపోరా, బేతుల్అనేవి గోవాలోని నదులు. జువారి నది ముఖద్వారాన ఉన్న మార్ముగోవా నౌకాశ్రయం మంచి సహజ నౌకాశ్రయం. జువారి, మాండవి నదులు, అంతటా విస్తరించిన వాటి ఉపనదులు గోవాలో మంచి నీటి వసతి, రవాణా వసతి కలిగించాయి. ఇంకా కదంబ రాజులు తవ్వించిన 300పైగా పాతకాలపు చెరువులు, 100 పైగా ఔషధిగుణాలున్న ఊటలు ఉన్నాయి. గోవా నేల ఎక్కువ భాగం ఖనిజలవణాలుగల ఎర్రనేల. లోపలి నదీతీరాలలో నల్లరేగడి నేల ఉన్నది. గోవా, కర్ణాటక సరిహద్దులలో మోలెమ్, అన్‌మోడ్ల మధ్యనున్న శిలలు భారత ఉపఖండంలోన అత్యంత పురాతనమైనవాటిలోకి వస్తాయి. కొన్ని శిలలు 3,600 మిలియన్ సంవత్సరాల పురాతనమైనవని గుర్తించారు.

... పూర్తి వ్యాసం