వారం వారం తెవికీ వ్యాసాలు.

Monday, September 28, 2009

బేతాళ కథలు: ఈ వారం తెవికీ వ్యాసం

బేతాళ కథలు, చందమామ మాసపత్రికలో చాలాకాలంగా ప్రచురితమవుతున్న ఒక జనప్రియ శీర్షిక. గుణాఢ్యుడు సంస్కృతములో రచించిన "బృహత్ కథ" బేతాళకథలకు మూలం. చివరి కథలో బేతాళుడి ప్రశ్నలకు విక్రమార్కుడు జవాబులు చెప్పలేకపోతాడట. అంతటితో ఆ కథలు సమాప్తమవుతాయి. అసలు బేతాళ కథలు పాతిక మాత్రమే! కాని, చందమామలో వందల కొలది మామూలు కథలను (ఇప్పటివరకు 600 పైగా) బేతాళ కథలుగా ఎంతో నేర్పుగా మార్చి ప్రచురించారు. కథా సంపుటి లేదా ధారావాహికగా మొదలు పెట్టబడినా, చివరకు ఒక కథా శీర్షికగా స్థిరపడినాయి ఈ బేతాళ కథలు. తెలుగు పత్రికా చరిత్రలో అన్ని శీర్షికలకన్న ఎక్కువకాలం ప్రచురించబడిన, ఇంకా ప్రచురించబడుతున్న శీర్షిక ఇది ఒక్కటే అయి ఉండవచ్చును.ఈ చక్కటి సాహిత్య ప్రక్రియ వెనుక ప్రసిద్ధ రచయిత, చందమామకు ఎక్కువకాలం సంపాదకుడిగా పనిచేసిన, కొడవటిగంటి కుటుంబరావు కృషి ఎంతగానో ఉన్నది.

ప్రతి మాసం ఒక సంఘటన (విక్రమార్కుడు చెట్టుమీదనుంచి శవాన్ని దించి, భుజాన వేసుకొని) తో మొదలయ్యేది, అలాగే, మరొక సంఘటన (విక్రమార్కుడికి ఆ విధంగా మౌన భంగం కాగానే, శవంలోని బేతాళుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు)తో అంతమయ్యేది. ప్రతి కథలోనూ, విక్రమార్కుడు మోస్తున్న శవంలోని భేతాళుడు, విక్రమార్కుడికి "శ్రమ తెలియకుండా విను" అని ఓ కథ చెప్పేవాడు. చివరకు, ఆ కథకు సంబంధించి చిక్కు ప్రశ్న/లు వేసేవాడు. అలా ప్రశ్నలు వేసి, విక్రమార్కుడికి ఒక హెచ్చరిక చేసేవాడు "ఈ ప్రశ్నలకి సమాధానం తెలిసీ చెప్పకపొయ్యావో, నీ తల వెయ్యి వక్కలవుతుంది" అని. మౌనం వీడితే వ్రత భంగం అయ్యి, వచ్చినపని చెడుతుంది, సమాధానం తెలిసీ చెప్పకపోతే ప్ర్రాణానికి ప్రమాదం. పాపం విక్రమార్కుడు ఏం చేస్తాడు? తప్పని పరిస్థితులలో, తన మౌనం వీడి, ఆ చిక్కు ప్రశ్నకు చాలా వివరంగా జవాబు చెప్పేవాడు. ఈ విధంగా ప్రతినెలా శవంలోకి బేతాళుడు ప్రవేశించి, కథ చెప్పి, ప్రశ్నలడిగి, హెచ్చరించి, విక్రమార్కుడికి మౌన భంగం చేసి, అతడు వచ్చిన పని కాకుండా చేసేవాడు. అలా పై నెలకి కథ మొదటికి వచ్చేది. బేతాళ కథలకు మొదటి పేజీలో వేసే బొమ్మ చాలా సార్లు మార్చి మార్చారు. అలాగే కథ చివరి పుటలో, బేతాళుడు ఎగిరి పోతూ ఉండటం, విక్రమార్కుడు కత్తి దూసి వెంట పడుతుండటం కూడా చాలా రకాలుగా వెయ్యబడింది.

... పూర్తి వ్యాసం

Tuesday, September 22, 2009

భట్టిప్రోలు స్తూపం: ఈ వారం తెవికీ వ్యాసం

ప్రతీపాలపురం, ప్రితుడనగరం, పిటిండ్రలు మొదలగు పేర్లు కల భట్టిప్రోలు ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో విశిష్టమైన స్థానాన్ని కలిగిఉంది. సముద్రతీరానికి సమీపములో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్న భట్టిప్రోలు ప్రపంచ బౌద్ధారామాలలో ప్రముఖమైన క్రీ.పూ. 4-3 శతాబ్దాల నాటి స్తూపం కలిగి ఉంది. గౌతమ బుద్ధుడు, మహావీరుడు లాంటి మహనీయులు ఇక్కడ దర్శించారని చరిత్రకారులు భావిస్తున్నారు. క్రీ.శ. 130 ప్రాంతంలో టాలమీ వర్ణించిన జౌళి పరిశ్రమకు, వాణిజ్యానికి కేంద్రస్థానమైన పిటిండ్ర నగరం భట్టిప్రోలేననే అభిప్రాయం చరిత్రకారులలో బలంగా ఉంది. క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందిన జైన కవి నయనసేనాని వ్రాసిన ధర్మామృత' కావ్యములోని క్రీ.పూ. 5వ శతాబ్దికి చెందిన కథలో ప్రతీపాలపుర ప్రసక్తి ఉంది. శాసనముల ఆధారముగా భట్టిప్రోలు ప్రాంతాన్ని కుబేరకుడు అనే రాజు పాలించాడు.

కాలగర్భంలో కలిసిపోయిన భట్టిప్రోలు బౌద్ధ స్తూప ప్రాశస్త్యం క్రీ. శ. 1870 నుండి వెలుగులోనికి రాసాగింది. బాస్వెల్ (1870), వాల్టర్ ఎలియట్ (1871), నారిస్ (1872, రాబర్ట్ సెవెల్ (1882), అలెగ్జాండర్ రే (1892), బుహ్లర్ (1894), రాయప్రోలు సుబ్రహ్మణ్యం (1969) మొదలగువారి కృషివల్ల అమూల్యమైన చారిత్రక నిక్షేపాలు బయల్పడ్డాయి. లంజ దిబ్బ, విక్రమార్కకోట దిబ్బ అని పిలువబడే మట్టిదిబ్బలు తవ్వగా స్తూపము, కోట గోడలు కనపడ్డాయి. 1700 చదరపు గజాలు స్తూప ఆవరణ, 148 అడుగుల మేధి వ్యాసం, 32 అడుగుల అండం వ్యాసం, 40 అడుగుల ఎత్తు, 8 అడుగుల విశాలమైన ప్రదక్షిణాపథం, 45 X 30 X 8 సె.మీ పరిమాణముగల ఇటుకలతో కట్టబడిన స్తూపం బయల్పడింది. భట్టిప్రోలు స్తూపము ధాతుగర్భము. అనగా బుద్ధుని ధాతువులపై నిర్మించబడినది. స్తూపం మధ్య అమూలాగ్రంగా రంధ్రం ఉన్నది. రంధ్రము చుట్టూ ఇటుకలను పద్మాకారములో అమర్చారు. రంధ్రంలో స్తూపాగ్రాన ఉండే ఛత్రపుకాడను అమర్చారు. రంధ్రముగుండా మూడు బండరాతి పేటికలు (శిలా మంజూషికలు) లభించాయి.

... పూర్తి వ్యాసం

Wednesday, September 16, 2009

తెలుగు వికీపీడియా అకాడమీ (జాలంలో)

ఈ విధమైన వికీపీడియా అకాడమీ సెషన్‌ని జాలంలో ఒకదాన్ని నిర్వహించాలని వీవెన్‌గారు అనుకుంటున్నారు. ఇవీ వివరాలు:
  • వేదిక: chat.etelugu.org
  • సమయం: సెప్టెంబర్ 19, 2009 శనివారం ఉదయం 10:00 నుండి 11:00 వరకు

మీకు తెలుగు వికీపీడియాకి తోడ్పడాలని ఉన్నా లేదా అందులోని సమాచారాన్ని వాడుకోవాలని ఉన్నా (వికీపీడియాని వాడటం, ఉదాహరణకి వ్యాసం రాసేప్పుడు ఫార్మాటింగు గట్రా, తెలియకపోయినా) లేదా వికీకి సంబంధించిన ఇతర విషయాలపై సందేహాలు ఉన్నా ఈ అకాడమీ సెషనుకి రండి. మీ సందేహాలకు సమాధానాలిచ్చేందుకు, తెవికీ నిర్వాహకులు మరియు క్రియాశీల సభ్యులు ఈ సెషనులో పాల్గొంటారు. ఈ సెషనులో పాల్గొని, ప్రేరణ పొంది తెవికీని మెరుగుపరచడానికి ముందుకొస్తారని ఆశిస్తున్నాను.

కొన్ని ఉపయోగకరమైన లింకులు:

పూర్తి వివరాలు మరియూ సందేగనివృత్తి కోసం క్రింది లింకులను చూడండి:

Sunday, September 13, 2009

చికమగలూరు_జిల్లా: ఈ వారం తెవికీ వ్యాసం

చిక్‌మగళూరు (కన్నడ:ಚಿಕ್ಕಮಗಳೂರು) భారతదేశం లోని కర్ణాటక రాష్ట్రం లోని ఒక జిల్లా మరియు పట్టణం. భారతదేశం లోనే మొట్టమొదటిగా చిక్‌మగళూరులో కాఫీ తోటలు పెంచబడ్డాయి. చిక్‌మగళూరు జిల్లాలో ఉన్న పశ్చిమ కనుమల పర్వతశ్రేణులలో తుంగ మరియు భద్ర నదులు పుడుతున్నాయి. ఈ జిల్లాలోనే ఉన్న ముల్లాయనగిరి పర్వత శ్రేణులు కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ఎత్తులో ఉన్న పర్వతశ్రేణులు. ప్రకృతి రమణీయ దృశ్యాలు కలిగిన కెమ్మనగుండి మరియు కుద్రేముఖ్ కొండలు, మాణిక్యధార, కల్లథిగిరి జలపాతాలు పర్యాటకుల నేత్రాలకు విందు కలిగిస్తాయి. శంకరాచార్యులు అద్వైత ప్రచారం కోసం స్థాపించిన శారదా పీఠం ఈ జిల్లాలో ఉన్న శృంగేరిలో ఉన్నది. ఆ తరువాతి కాలంలో భారతీ కృష్ణ తీర్థ స్వామిచే తన ముందు పీఠాధిపతి అయిన విద్యాశంకర స్వామి స్మారక నిమిత్తం నిర్మించబడిన విద్యాశంకర దేవాలయం కూడా శృంగేరిలో ఉన్నది. దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పెద్ద సామ్రాజ్యాలలో ఒకటైన హొయసల రాజులు అమృతపురలో నిర్మించిన హొయసల దేవాలయం ఈ జిల్లాలోనే ఉన్నది. వన్యప్రాణి సంరక్షణ మీద ఆసక్తి ఉన్నవారు ఈ జిల్లాలో ఉన్న కుద్రేముఖ్ జాతీయ వనం, భద్ర అభయారణ్యం దర్శించి తీరవలసిందే.

జిల్లాకి చిక్‌మగళూరు పేరు జిల్లా రాజధాని చిక్‌మగళూరు పట్టణం నుండి వచ్చింది. చిక్‌మగళూరు అంటే కన్నడ భాష లో చిన్న కూతురు ఊరు అని అర్థం (చిక్క=చిన్న, మగ=కూతురు, ఊరు=ఊరు). సేక్రపట్న రాజైన రుక్మాంగద చిన్న కూతురుకు కట్నంగా ఇవ్వబడడం వల్ల ఈ పట్టణానికి చిక్‌మగళూరు అని పేరు వచ్చిందని చెబుతారు.

... పూర్తి వ్యాసం

Saturday, September 12, 2009

ఈ వారం తెవికీ వ్యాసం: వై.యస్. రాజశేఖరరెడ్డి

ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి 1949, జూలై 8న కడప జిల్లాలోని పులివెందులలో జన్మించారు. 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి ఇప్పటివరకు మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నికకాగా, 4 సార్లు కడప లోకసభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టారు. పోటీచేసిన ప్రతీసారి విజయం సాధించడం ఆయన ప్రత్యేకత. జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయంసాధించిన తొలి ఎన్నికల (1978) వెంటనే మంత్రిపదవి పొందినాడు. వెనువెంటనే ముఖ్యమంత్రులు మారినప్పటికీ ముగ్గురు ముఖ్యమంత్రుల మంత్రిమండలిలో స్థానం సంపాదించారు. ఆ తరువాత చాలా కాలం పాటు అధికారం దక్కలేదు. 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు. 1999లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించాడు. 2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర మరియు ఉచిత విద్యుత్ ప్రచారం వారి విజయానికి బాటలు పరిచింది. 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డిగారికి దక్కింది. ఆయన సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో దుర్మరణం పాలయ్యారు.

... పూర్తి వ్యాసం